5, డిసెంబర్ 2023, మంగళవారం

కలహాల కాపురం గంగాధర నెల్లూరు



గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వరుసగా మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ఓటమిని చవిచూసింది. నియోజకవర్గంలోని నాయకులలో ఒకరిని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించకుండా చెన్నైలో ఉంటున్న డాక్టర్ థామస్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంతో అసంతృప్తికి  ఆజ్యం పోసినట్లయింది. అంతకుముందు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న చిట్టి బాబు విషయంలో కూడా మండల నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. థామస్ నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన తర్వాత ఆయన ఇదివరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న చిట్టిబాబు మీదనే ఎక్కువ ఆధారపడ్డారు. దీంతో నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు ఒకరిద్దరు మినహా మిగిలినవారు థామస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి NB సుధాకర్ రెడ్డి కూడా థామస్ అభ్యర్థి అభ్యర్థిత్వంపై అంత సుముఖంగా ఉన్నట్లు లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న  సీనియర్ నేత ఆముదాల శ్రీహరి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయన TDP ఆవిర్భావంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. యూనివర్సిటీలో చంద్రబాబుతో కలిసి ఒకే  గదిలో ఉన్నారు. బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు.




చిత్తూరు జిల్లాలో పుంగనూరు తరువాత జి డి నెల్లూరు నియోజక వర్గం వైసిపికి బలమైన స్థావరం. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కళత్తూరు నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోజా తరువాత, చంద్రబాబు నాయుడును ఎక్కువగా విమర్శిస్తుంటారు. ఇక్కడ ఎలాగైనా నారాయణ స్వామిని ఓడించి టిడిపి అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు అధిక శాతం ఉన్నందున బలమైన  అభ్యర్దిని రంగంలో దించి ఎస్సీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో చీలిక తేవాలని వ్యూహం పన్నారు. అందుకే మూడేళ్ల క్రితం పెనుమూరుకు చెందిన సైకాలజిస్ట్ ఎన్ బి సుధాకర్ రెడ్డిని పిలిచి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. అయితే ఆయన నియోజక వర్గంలోని కమ్మ సామాజికవర్గం నేతల తీరు నచ్చక నియోజక వర్గానికి రావడం మానేశారు. ఆయనకు నియోజక వర్గంలో భారీగా బందుగణం ఉంది.





ఆరు నెలల క్రితం చెన్నైలో సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్న డాక్టర్ వి ఎం థామస్ కు నియోజక ఇంచార్జి బాధ్యత అప్పగించారు. అయితే ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు తొలుత ఆయనను వ్యతిరేకించారు. తరువాత ఒకరిద్దరు సర్దుకున్నప్పటికి  మిగిలిన వారు కలసి రావడం లేదు. కాగా పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, పుత్తూరుకు చెందిన డాక్టర్ రవికుమార్ ( గ్యాస్ రవి) టిక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రాబిన్ శర్మ బృందం రకరకాల సర్వేలు చేయిస్తున్నారు. గతంలో వేపంజేరి నియోజక వర్గంగా ఉన్న దీనిని 2008లో జి డి నెల్లూరుగా ఏర్పాటు చేశారు. జి డి నెల్లూరు, పెనుమూరు మండలాలను అలాగే ఉంచి పూతలపట్టు మండలాన్ని పూతలపట్టు నియోజక వర్గంలో, గుడిపాలను చిత్తూరులో కలిపారు. కొత్తగా నగరి నుంచి కార్వేటినగరం, పుత్తూరు నుంచి వెదురుకుప్పం, ఎస్ ఆర్ పురం, పాలసముద్రం మండలాలను కలిపారు.



టిడిపి ఏర్పాటు అయిన తరువాత 1983 లో జరిగిన ఎన్నికల్లో తలారి రుద్రయ్య, 1994 లో ఆర్ గాంధీ టిడిపి టిక్కెట్టు పై గెలిచారు. 1985, 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ గుమ్మడి కుతూహలం గెలిచారు. ఆమె మంత్రి డిప్యూటీ స్పీకర్ పదవులను నిర్వహించారు. ఎమ్మెల్యే కాక ముందు చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. నియోజక వర్గం పునర్విభజన తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలం టిడిపి అభ్యర్ధి ఆర్ గాంధీపై 10,826 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కె నారాయణ స్వామి టిడిపి అభ్యర్ధి డాక్టర్ గుమ్మడి కుతూహలం పై 20,565 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి నారాయణ స్వామి టిడిపి అభ్యర్ధి కుతూహలం కుమారుడు డాక్టర్ హరికృష్ణ పై 45,594 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.




ఐదు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఒక సారి జెడ్ పి చైర్ పర్సన్ గా, మంత్రి, డిప్యూటీ స్పీకర్ పదవులను నిర్వహించిన కుతూహలం కూడా టిడిపి టిక్కెట్టుపై ఇక్కడ గెలవక పోవడానికి కేవలం రెడ్లు, ఎస్సీలు ఎక్కువగా ఉండటం కారణంగా చెపుతున్నారు. టిడిపి ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్దులు కేవలం రెండు సార్లు గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు సార్లు, వైసిపి అభర్ధులు రెండు సార్లు విజయం సాధించారు. 1983 లో ఎన్టీఆర్ ప్రభంజనం పనిచేసిందని అంటున్నారు. 1994 ఎన్నికల్లో అప్పటి లోక్ సభ సభ్యుడు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి కుతూహలంను కాదని శోభకు కాంగ్రెస్ టిక్కెట్టు ఇప్పించారు. అయితే కుతూహలం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 15 వేల ఓట్లు సాధించారు. దీనితో టిడిపి అభ్యర్థి  ఐదు వేల పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుత కూడా జ్ఞానేంద్ర రెడ్డి నారాయణ స్వామికి వ్యతిరేకంగా ఉన్నందున తమకు ఉపయోగ పడవచ్చని టిడిపి వారు భావిస్తున్నారు. అయితే టిడిపిలో కూడా వర్గపోరు అధికంగా ఉన్నందున అందరిని కలుపుకు పోయే అభ్యర్థికి టిక్కెట్టు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు.



ప్రస్తుతం ఇన్చార్జి అయిన డాక్టర్ థామస్ తనకే టిక్కెట్టు వస్తుందని బహిరంగంగా చెపుతున్నారు. కార్వేటినగరం మండలానికి చెందిన ఆయన చెన్నైలో సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నారు. బాగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. తన భార్య, తమ్ముడు, కొందరు కార్యకర్తలను వెంటబెట్టుకుని  ప్రచారం చేస్తున్నారు. థామస్ కు మండల పార్టీ అధ్యక్షులు సహకరించపోవడం మైనస్ అయితే, చిట్టి బాబు పూర్తిగా సహకరించడం ప్లస్. తను క్రిస్టియన్ అని బహిరంగంగా ప్రకటించడం, చెన్నైలో ఒక మహిళా డాక్టర్ మీద హత్యాయత్నం చేశారని కేసు నమోదు కావడం భవిషత్తులో ఆయనను ఇబ్బంది పెట్టవచ్చు. వివాదాలు ఎలా ఉన్నా, ప్రచార కార్యక్రమాలలో థామస్ దూసుకుపోతున్నారు. ఆర్థికంగా బాగుండటం ఆయనకు  కలిసివచ్చే అంశం.



పాల సముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర టిక్కెట్టు రేసులో ఉన్నారు. ఆయన ఎంపీపీ జెడ్పీటీసీ గా గెలిచారు. యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడుగా సేవలు అందించారు. విద్యా వేత్త అయిన ఆయన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు.



వీరితో పాటు డాక్టర్ పచ్చికాపల్లం రవి కుమార్ టిక్కెట్టు ఆశిస్తున్నారు.  ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశీస్సులు ఉన్నాయి. మంచి విద్యా వేత్త అయిన ఆయన తొలి నుంచి పార్టీలో ఉన్నారు. పుత్తూరులో నివాసం ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు. 




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *