తెదేపా టిక్కెట్ల రేసులో రెడ్ల జోరు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో టిక్కెట్లను ఆశిస్తున్నా రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు.జిల్లాలోని కుప్పం, మదనపల్లి మినహా అన్ని నియోజకవర్గాల్లో రెడ్లు ఈ పర్యాయం టిక్కెట్ల రేసులో ఉన్నారు. జిల్లాలో సగం వరకు టిక్కెట్లను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించ వచ్చానే ఊహాగానాలు ఉన్నాయి. కావున జగన్ మోహన్ రెడ్డిని కాదని ఆయన సామాజిక వర్గం తెదేపాలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ఒక రకంగా జగన్ మీద తిరుగుబాటుగా భావిస్తున్నారు. వైసీపీలో ఒక రెడ్డి పెత్తనమే కొనసాగుతున్నది. ఆయన చెప్పిన వారికే టిక్కెట్టు లభిస్తుంది. ఆయన వేరే బలమైన రెడ్డిని ఎదగడానికి వీలులేకుండా తన మనుషులకే టిక్కెట్లు ఇప్పించుకుంటున్నారు. కావున ఎక్కువ మంది రెడ్లు తెదేపా వైపు చూస్తున్నారు. తొమ్మిది నియోజక వర్గాలలో రెడ్లు టిడిపిలో టిక్కెట్టు కోసం ప్రయత్నం చేయడమే ఇందుకు తార్కాణం. చంద్రబాబు నాయుడు కూడా ఈ సారి జిల్లాలో ఉన్న 14 స్థానాలలో కనీసం ఆరింటిని రెడ్లకు కేటాయించాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
2019 ఎన్నికల్లో రెడ్ల ప్రాబల్యం ఉన్న రాయలసీమ టిడిపి బాగా దెబ్బతిన్నది. నాలుగు జిల్లాలలో ఉన్న 52 స్థానాలలో వైసిపికి 49 టిడిపికి మూడు వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజక వర్గాలలో 13 చోట్ల వైసిపి గెలిచారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు), ఆర్ కె రోజా రెడ్డి ( నగరి) మంత్రులుగా ఉన్నారు. పెద్దిరెడ్డి ద్వారక నాధ రెడ్డి (తంబళ్లపల్లె), చింతల రామచంద్రా రెడ్డి (పీలేరు), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(చంద్రగిరి), భూమన కరుణాకర్ రెడ్డి ( తిరుపతి), బియ్యపు మధుసూదన రెడ్డి (శ్రీకాళహస్తి) ఎమ్మెల్యేలుగా గెలిచారు. టిడిపి చంద్రబాబు నాయుడు ఒకరి గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో ఏడుగురు అంటే సగం మంది రెడ్లు గెలవడం విశేషం. రిజర్వేషన్ ఉన్నందున ముగ్గురు ఎస్సీలు గెలిచారు. కమ్మ, బలిజ, బిసి, మైనారిటీలు ఒక్కొక్కరు చొప్పున గెలిచారు.
ఈ నేపథ్యంలో వజ్రాన్ని వజ్రంతో కోయాలి, ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టు రెడ్ల వర్గీయులపై రెడ్లనే పోటీ పెట్టాలని టిడిపి సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి టిడిపి టిక్కెట్లు దక్కే అవకాశం ఉంది.ఇప్పటికే పీలేరులో జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమనేరులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ అమరనాధ రెడ్డి పోటీ చేస్తారని తేలిపోయింది. ఇక చిత్తూరులో సి కె జయచంద్రా రెడ్డిని పోటీ పెడితే మంచిదని కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. నగరిలో రోజాపై పోటీ చేయడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ కుమారుడు జె సి ఐ జాతీయ డైరెక్టర్ ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి సిద్ధపడుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి తిరిగి పోటీ చేయాలని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు.
తిరుపతి స్థానానికి రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, చంద్రగిరి స్థానానికి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మబ్బు దేవ నారాయణ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పై పోటీకి ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి, మాజీ ఇంచార్జి ఎన్ అనీషా రెడ్డి పోటీ పడుతున్నారు. తంబళ్లపల్లె టిక్కెట్టు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇస్తే బాగుంటుందని ఒక వర్గం భావిస్తోంది. అయితే ఇతర సామాజిక వర్గాలకు టిక్కెట్లు సామాజిక వర్గాలకు టిక్కెట్లు కేటాయింపు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని రెడ్లకు కనీసం ఆరు స్థానాలు కేటాయించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.