21, డిసెంబర్ 2023, గురువారం

ఆకలుండదూ......దప్పికుండదూ....... పక్క కుదరదూ.......నిదుర పట్టదు....

నరాలు తెగే టెంక్షన్ లో జిల్లా ఎమ్మెల్యేలు
జగన్ పిలుపు కోసం ఎదురుచూపులు
ఎం చెపుతారో అని గుండె దడ
సీటు ఇస్తారో లేదో అన్న బెంగ



ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీవ్ర టెంక్షన్ కు, వత్తిడికి, అభద్రతా భావానికి గురవుతున్నారు. కంటి నిండా కునుకు లేదు. క డుపు నిండా ఫుడ్ లేదు. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారు. కలలో కూడా జన్మోహన్ రెడ్డి కనిపించి భయపెడుతున్నారు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పిలుపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. బిక్కుబిక్కుమంటూ   కాలం గడుపుతున్నారు. జగన్ పిలిచి తనకు ఏం చెప్తారో అన్న దానిపైన నరాలు తెగే టెంక్షన్. ఈసారి తనకు టికెట్ వస్తుందా రాదా అన్నది బేతాళ ప్రశ్న.  టికెట్ వస్తే  పాత స్థానం నుంచి ఉంటుందా లేక కొత్త స్థానాన్ని కేటాయిస్తారా అన్నది అంతు చిక్కని వ్యవహారం. టిక్కెట్టు ఇవ్వకుండా మరో అభ్యర్థికి ఎక్కడ కేటాయిస్తారో అనే దిగులు. టిక్కెట్టు ఇస్తే ఏ నియోజకరర్గానికి ఇస్తారో, అక్కడ గెలుస్తామో లేదో అనే బెంగ. ఇలా  నరాలు తిరిగే టెన్షన్తో చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యేలు అనుభవిస్తున్నారు. ఇంత టెంక్షన్ జీవితంలో  వారు  ఎప్పుడూ అనుభవించి ఉండరు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానన్న ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారు. ఒక్కొక్క జిల్లాలోని ఎమ్మెల్యేలను, ఆశావహులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. కొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. వారి స్థానంలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. మరి కొందరికి స్థానచలనం ఉంటుంది. పక్క నియోజకవర్గాలను కేటాయిస్తున్నారు. పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు అవుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళన శాసనసభ్యులను కలవరపెడుతోంది. శాసనసభ్యులు తమ గాడ్ ఫాదర్స్ చుట్టూ తిరుగుతున్నారు. చిత్తూరు జిల్లాలోని శాసన సభ్యులు మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. సీటు పదిలంగా  ఉండాలని కనిపించిన దేవుళ్లకు మొక్కుతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 3 రిజర్వుడు స్థానాలు. గత ఎన్నికల్లో  కుప్పం మినహా అన్ని స్థానాలను వైసిపి కైవశం చేసుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో రాజకీయ జైతయాత్రను కొనసాగించింది. రానున్న ఎన్నికలలో పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం నుండి  ఎమ్మెల్సీ భరత్, చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, తిరుపతి నుంచి టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారుగా తెలుస్తోంది.

జిల్లాలోని ఇద్దరు మంత్రులకు ఈ పర్యాయం టిక్కెట్లు సందేహం అనే ప్రచారం జోరుగా సాగుతుంది. నగిరి శాసనసభ్యురాలు, వైసిపి ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా స్థానికంగా గట్టి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆమెకు సర్వే నివేదికలు కూడా అనుకూలంగా లేవని తెలుస్తుంది. ఆమె బదులు శ్రీశైల దేవస్థానం పాలకమండలి చైర్మన్ చక్రపాణి రెడ్డిని బరిలోకి దించాలని ఒక వర్గం భావిస్తుంది. దీంతో మంత్రి రోజా భవిష్యత్తు డోలాయమానంలో  పడింది. ఆమెకు శ్రీకాళహస్తి టికెట్ ఇస్తారని కొందరు, పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటారని మరి కొందరు అంటున్నారు. తిరిగి పార్టీ అధికారంలోకి వస్తే రోజాకు ఎమ్మెల్సీగా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. మంత్రి రోజాకు శ్రీకాళహస్తి సీటు కేటాయిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డి పరిస్థితి ఏమిటన్నది అర్థం కావడం లేదు. బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద ఆరోపణలు  ఉన్నాయి. అయినా జగన్ కు సన్నిహితుడు కావడంతో తనకు సీటు గ్యారెంటీ అని భావిస్తున్నారు. 

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సొంత నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గానికి, నారాయణస్వామి వర్గానికి పడడం లేదు. నారాయణస్వామి రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకి అనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దీంతో ఈ పర్యాయం నారాయణ స్వామికి టికెట్ దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు. నారాయణస్వామిని తిరుపతి లేక చిత్తూరు పార్లమెంటుకు పోటీ చేయించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. లేకుంటే గతంలో పోటీ చేసి గెలిచిన సత్యవేడు నియోజకవర్గం పోటీ చేయడానికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తుంది. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం సంబంధించిన నివేదికలు కూడా అంత అనుకూలంగా లేవని తెలుస్తోంది. సత్యవేడు అభ్యర్థి మార్పు  ఉంటుందని భావిస్తున్నారు. గంగాధర నెల్లూరు నుంచి నారాయణస్వామిని తప్పిస్తే ఆయన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు అయితే మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అక్క కుమారుడు రాజేష్ కుమార్ కు టికెట్ దక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

జిల్లా కేంద్రమైన చిత్తూరులో బలిజ సామాజిక వర్గానికి చెందిన జంగలపల్లి  శ్రీనివాసులు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు ఈ సారి టిక్కెట్టు సందేహమనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు బదులుగా ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయనంద రెడ్డికి టికెట్ ఇస్తారానే  ప్రచారం నడుస్తోంది. అయితే మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో చిత్తూరు టికెట్టును తిరిగి దక్కించుకోవడానికి  శ్రీనివాసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు అండగా మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్, మున్సిపల్ వైస్ మేయర్ చంద్రశేఖర్ రెడ్డి,  మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ కుమారుడు భూపేష్ అండగా ఉన్నారు. ఎక్కడో ఒక చోట బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి ఉన్న కారణంగా జంగాలపల్లి  శ్రీనివాసులుకు  పలమనేరుకు టిక్కెట్టు కేటాయిస్తారనే ప్రచారం ఉంది. పలమనేరు ఎమ్మెల్యే వెంకడే గౌడ మీద పలు ఆరోపణలు ఉన్నాయి. నివేదికలు కూడా ఆయనకు అనుకూలంగా లేదని సమాచారం. పలమనేరులో మాజీ మంత్రి మంత్రి అమర్నాథ రెడ్డికి ధీటైన అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. జంగాలపల్లి శ్రీనివాసులతోపాటు ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరిన సుభాష్ చంద్రబోస్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది

మైనారిటీలకు పట్టు ఉన్న మదనపల్లి నియోజకవర్గంలో కూడా అభ్యర్థి మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నవాజ్ భాషా స్థానంలో మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, గతంలో పంచాయతీరాజ్ ఇంజనీర్ గా పనిచేసిన నిషార్ మహమ్మద్  పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సినీ నటుడు ఆలీని కూడా రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తంబళ్లపల్లె నుండి మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా  ఉన్నారు. ఆయనకు కూడా స్థానచలనం ఉండవచ్చని భావిస్తున్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని తిరిగి కొనసాగిస్తారని ఒక వర్గం భావిస్తుండగా అక్కడ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని ఎదుర్కొనే ధీటైన అభ్యర్థి కోసం అన్వేషణ  సాగుతోంది. అవసరమైతే పెద్ద రెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరు పోటీ చేసి అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.

పూతలపట్టు నియోజకవర్గంలో కూడా అభ్యర్థి మార్పు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుపైన వ్యతిరేకత ఉండటంతో పాటు నివేదికలు కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఒక వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ఆయనకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని తెగేసి అధిష్టానంకు చెప్పారు.  మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మానవ హక్కుల నేత రమాదేవిల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *