పూతలపట్టు వైసిపి అభ్యర్థిగా డా. సునీల్ ?
పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పేరు తెరమీదకి వస్తోంది. దాదాపుగా అయన అభ్యర్థిత్వం ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని నియోజకవర్గ వైసిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన 2014 ఎన్నికలలో పూతలపట్టు నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు 2019 ఎన్నికలలో జగన్ టికెట్ ను నిరాకరించారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న సునీల్ కుమార్ పేరు తిరిగి అనూహ్యంగా పూతలపట్టుకు ప్రతిపాదనలోకి వచ్చినట్లు సమాచారం.
2019 ఎన్నికల సమయంలో జగన్ ను కలువడానికి మూడు రోజులపాటు వైయస్ జగన్ ఇంటి వద్ద డాక్టర్ సునీల్ కుమార్ వేచి ఉన్నారు. ఆయనకు జగన్ ను కలవడానికి అనుమతి లభించలేదు. దీంతో మణికట్టు కోసుకొని ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారు. సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఆయన జగన్ కు ఒక లేఖ రాస్తూ తనకు టిక్కెట్టు ఇవ్వకపోయినా మీ మనిషిగా చూడాలని జగన్ ను కోరారు. తాను మరణించినా వైసిపికి ఓటు వేసి జగన్ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఆ విధేయత మళ్లీ డాక్టర్ సునీల్ కుమార్ కు పూతలపట్టు నియోజకవర్గ టిక్కెట్ పరిశీలనకు ఉపయోగపడింది. ప్రస్తుత MLA బాబును నియోజకవర్గంలోని ఒక వర్గం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మళ్ళి బాబుకు టిక్కెట్టు ఇస్తే పనిచేసేది లేదని తెగేసి చెప్పారు, ఇది కూడా సునీల్ కుమార్ కు కలిసి వచ్చినట్లు తెలుస్తుంది.