ఈ స్వామి మాకొద్దు !
వైసిపి నేతల తిరుగుబాటు
చక్రం తిప్పుతున్న జ్ఞానేంద్రరెడ్డి
తెర వెనుక ఉన్న రాజేష్
చిట్టా విప్పనున్న సుబ్రమణ్యం
టికెట్టు రేసులో హరికృష్ణ
పదేళ్లు ఎమ్మెల్యేగా, అయిదేళ్ళు డిప్యూటీ సిఎంగా ఉన్న కళత్తూరు నారాయణ స్వామి మీద నియోజక వర్గంలో తిరుగుబాటు ప్రారంభం అయ్యింది. ఒక వర్గం స్వామికి వ్యతిరేకంగా రోడ్డుకెక్కారు. నియోజకవర్గానికే పరిమితం అయిన అసమ్మతి సెగ శనివారం జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి తాకింది. రానున్న ఎన్నికల్లో మళ్ళి నారాయణ స్వామికే టిక్కెట్టు ఇస్తారని తెలియడంతో అసమ్మతి వర్గాలు ఒక్కరిగా భగ్గుమన్నాయి. నియోజకవర్గం నుండి పలువురు నేతలు, కార్యకర్తలు తిరుపతికి తరలి వెళ్లారు. ఈ స్వామి మాకొద్దు అంటూ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందు నినాదాలు చేశారు. నిరసన తెలియచేశారు. స్వామికి టిక్కెట్టు ఇస్తే తాము పార్టీ కోసం పనిచేసేది లేదని స్పష్టం చేశారు. స్వామికి తప్ప ఎవరికీ టిక్కెట్టు ఇచ్చినా, తాము గెలిపిస్తామని హామీ ఇచ్చారు.
జి డి నెల్లూరు వైసిపి నేతలు కొందరు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి వర్గం నేతలు శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని తిరుపతిలో కలసి పలు ఆరోపణలు చేశారు. నారాయణ స్వామి నిజమైన కార్య కర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టిడిపి నాయకులతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రెడ్డి సామాజిక వర్గం నాయకులను చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఆయనకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు టికెట్టు ఇస్తే ఒడిస్తామని హెచ్చరించారు.
వారికి తప్ప పార్టీ ఎవరికి టికెట్టు ఇచ్చినా గేలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసమ్మతి బృందానికి జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్ రెడ్డి, పెనుమూరు ఎంపిపి మహాసముద్రం హేమలత, మండల మాజీ కన్వీనర్ మహాసముద్రం సురేష్ రెడ్డి నాయకత్వం వహించారు. అమెరికాలో ఉన్న జ్ఞానేంద్ర రెడ్డి అక్కడి నుంచే అసమ్మతి చక్రం తిప్పుతున్నారు. జనవరి నాలుగవ తేదీన జ్ఞానేంద్ర రెడ్డి చిత్తూరుకు వస్తారు. టికెట్టు ఆశిస్తున్న నూకతోటి రాజేష్ వెనక ఉండి అసమ్మతి నేతలను నడిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా స్వామి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆయన అక్క కుమారుడు సుబ్రమణ్యం కూడా అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. స్వామికి టికెట్టు ఇస్తే తాను కుటుంబ సభ్యులతో కలసి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని అంటున్నారు. త్వరలో స్వామి అవినీతి కార్యక్రమాలపై మీడియా ముందు గళం విప్పేందుకు సిద్ధపడుతున్నారు. కాగా స్వామి వర్గం కూడా రంగంలోకి దిగి జ్ఞానేంద్ర వర్గంపై ధ్వజం ఎత్తే ప్రయత్నాలలో ఉన్నారు. స్వామిని జి డి నెల్లూరు నుంచి తప్పించి తిరుపతి లోక సభ ఎన్నికల్లో పోటీ పెట్టే అవకాశం ఉందని ఒక వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ హరికృష్ణ చాపకింద నీరులా టికెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి టికెట్టు ఇవ్వని పక్షంలో తన పేరును పరిశీలించమని కోరుతున్నారు. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డిని కలిసి తన మనసులో మాట చెప్పారు. ఆయన తల్లి డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒక సారి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. హరికృష్ణ గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు టికెట్టు వస్తే టిడిపిలో మద్దతు ఇవ్వడానికి ఒక వర్గం సిద్దంగా ఉంది.