5, డిసెంబర్ 2023, మంగళవారం

హైదరాబాదులో కనిపించని చంద్రబాబు చరిష్మా !?

BRSకు జైకోట్టిన భాగ్యనగరం 
జనసేనకు డిపాజిట్ల గల్లంతు 
గెలిచిన అత్యధికులు రెడ్లే 
కొత్త అభ్యర్దులదే విజయం 
పాతకాపులు ఇంటి బాట




ఆయనే  హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టారు. బిల్ క్లింటన్ ను తీసుకువచ్చారు. హైదరాబాదును ఐటీ హబ్ గా తీర్చిదిద్దారు. హైటెక్ సిటీని నిర్మించారు. వేలాదిమంది ఐటీ ఉద్యోగులు లక్షలాది రూపాయల వేతనాలను తీసుకుంటున్నారు. ఆయన అరెస్టు అయితే హైదరాబాద్ కన్నీరు కార్చింది. ఐటీ ఉద్యోగులు మొట్టమొదటిసారిగా రోడ్డెక్కి ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. హైదరాబాదు నుంచి రాజమహేంద్రవరానికి కార్లతో ర్యాలీగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన వాటిని అన్నిటిని చ్చేదించి గమ్యం చేరారు.  ఆయన కోసం ఉద్యోగాలను ఎగ్గొట్టి ఆందోళనలు చేశారు. పోలీసుల లాఠీఛార్జ్ ను  లెక్కచేయలేదు. నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయలేదు. ర్యాలీలు, ప్రదర్శనలతో కధం దొక్కారు. మెట్రో రైల్లో నిరసన తెలియజేశారు. బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆయన కీర్తిని వేయినోళ్ల పొగిడారు. ఆయన అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే ఆయనే అన్నట్లు నినాదాలు మారు మోగాయి. నవయుగ వైతాళికుడు, ఆధునిక ఐటీ రంగ సంఘ సంస్కర్త, సెల్ ఫోన్ ను పరిచయం చేసిన దార్శనికుడు, ఇలా ఆయనకు ఇవ్వని బిరుదులు లేవు. పొగడని నోరు లేదు. ఆయన మాటే వేదమన్నారు. ఆయన బాటే ఆదర్శం అన్నారు. ఆయన ఎయిర్ పోర్టులో దిగితే, హైదరాబాద్ అంతా తరలివచ్చింది. దారి పొడవునా పూల వాన కురిసింది. అడుగడుగునా నీరాజనాలు, ఘన స్వాగతాలు లభించాయి. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఐదారు గంటల సమయం పట్టింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించారని తెలంగాణా పోలీసులు కేసును కూడా నమోదు చేశారు...  చివరకు ఎన్నికలు వచ్చేసరికి ఆయన ఆవేదనను అర్థం చేసుకోలేదు. ఆయన శిష్యునికి అండగా నిలవలేదు. అయన మద్డదు ఇచ్చిన నాయకునికి, పార్టీకి ఓట్లు వేయలేదు. ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీని చిత్తుగా ఓడించారు. ఆయన మద్దతు ఇచ్చిన పార్టీని కూడా ఓడించారు. ఆయన వ్యతిరేకి జై కొట్టారు.  ఆయనను అవమానపరిచిన పార్టీని నెత్తిన పెట్టుకున్నారు. సొంత సామాజిక వర్గమే అయన అభిస్టానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఆయన మరెవరో కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత ... IT ఉద్యోగుల ఆరాధ్య దైవం ... నారా చంద్రబాబు నాయుడు.

 
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీని ఆలోచనలో పడవేసాయి. అక్కడ కాంగ్రెస్ విజయం వెనుక చంద్రబాబు, టిడిపి అభిమానులు, కమ్మ సామాజిక వర్గం ఉందన్న ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది.  దీనికి  అనేక ఉదాహరణలను విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాదులో ఉన్న 15 నియోజక వర్గాలలో ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. అందులో బి ఆర్ ఎస్, ఎం ఐ ఎం చెరి ఏడు స్థానాలలో, బిజెపి ఒక స్థానంలో గెలిచారు. ఎపి నుంచి వలస వెళ్లిన వారు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిలో కూడా బిఆర్ఎస్ అభ్యర్థి ఎం కృష్ణా రావు గెలిచారు. ఆయన 2014 లో టిడిపి టిక్కెట్టుపై గెలిచి, బిఆర్ఎస్ లో చేరారు. 2009లో లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ విజయం సాధించారు.

జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కలేదు. కూకట్ పల్లిలో మాత్రం28,330 వేల ఓట్లు వచ్చాయి. మిగిలిన ఏడింటిలో తాండూరులో 2818 ఓట్లు, కోదాడలో 758, నాగర్ కర్నూలులో 1876, ఖమ్మంలో 1,461, కొత్తగూడెంలో 1,693, వైరాలో 2257, అశ్వారావుపేటలో 228 ఓట్లు వచ్చాయి. దీనితో జనసేన వల్ల ఏపీలో గెలుస్తామని భావించడం తప్పని తేలిపోయింది. ఇక సీట్లు, ఓట్ల శాతం చూస్తే కూడా కాంగ్రెస్ విజయాన్ని పెద్దగా ఊహించు కోవలసిన పనిలేదు అంటున్నారు. కాంగ్రెస్ కు 39.40 శాతం ఓట్లు, 64 స్థానాలు వచ్చాయి. బి ఆర్ ఎస్ కు 37.35 శాతం ఓట్లు, 39 సీట్లు వచ్చాయి. అంటే కేవలం 2.05 శాతం ఓట్ల తేడాతో బి ఆర్ ఎస్ అధికారం కోల్పోయింది. కాగా111 స్థానాల్లో పోటి చేసిన బిజెపికి 13.90 శాతం ఓట్లు 8 సీట్లు వచ్చాయి. 7 చోట్ల పోటి చేసిన ఎంఐఎంకు  2.22 శాతం ఓట్లు 7 సీట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిఐపి కి ఒక స్థానం వచ్చింది. బిజెపి ఎక్కువ శాతం ఓట్లు చీల్చడం వల్లే టి ఆర్ ఎస్ ఓడిపోయిందని పరిశీలకులు భావిస్తున్నారు. కె సి ఆర్ ఒక  మెట్టు దిగి బిజెపితో పొత్తు పెట్టు కుంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

రెడ్లదే ఆధిపత్యం 
తెలంగాణ ఎన్నికల్లో రెడ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 119 స్థానాలలో 43 మంది రెడ్డి సామాజిక వర్గం వారు గెలిచారు. ఇందులో కాంగ్రెస్ లో 26 మంది, బి ఆర్ ఎస్ లో 14 మంది, బిజెపిలో ముగ్గురు ఉన్నారు. అలాగే వెలమలు 13, బిసిలు 19, ఎస్సీలు19, ఎస్టీ 12, ముస్లింలు 7గురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాగా కమ్మ సామాజిక వర్గం నాలుగు, బ్రాహ్మణ, వైశ్య  సామాజిక వర్గం వారు ఒక్కొక్కరు చొప్పున గెలిచారు.

కొత్త వారికే ఆదరణ ఎక్కువ
అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులు, సీనియర్ నాయకులు ఎక్కువగా ఓడి పోయారు. అన్ని పార్టీలలో కలసి కొత్తవారు అధిక శాతం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బి ఆర్ ఎస్ లో 18 మంది కొత్త వారికి టిక్కెట్లు ఇస్తే అందులో 12 మంది గెలిచారు. పాత వారిలో ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. బిజెపి లో గెలిచిన వారిలో సగం మంది కొత్తవారు ఉన్నారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు బండి సంజయ్, ఈటల రాజేంద్ర, ధర్మపురి అరవింద్, బాబూ రావు, రఘునందన రావు ఓడిపోవడం గమనార్హం. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అధిక శాతం కొత్తవారు కావడం విశేషం.

ఆచి తూచి అభ్యర్థుల ఎంపిక
తెలంగాణ ఎన్నికలను విశ్లేషిస్తే ఎపి లో టిడిపి అధికారంలోకి రావడం అంత సులభం కాదు. జగన్ మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత వల్ల గెలవాలి అనుకుంటే వీలు కాదని అంటున్నారు. కొందరు టిడిపి సీనియర్ నాయకుల మనోగతం ప్రకారం చంద్రబాబు తక్షణ కొన్ని చర్యలు తీసుకోవాలి. టిడిపి పార్టీ, అభ్యర్థుల పట్ల సానుకూల వాతావరణం నెలకొల్పవలసిన అవసరం ఉంది. ఎపి లో కూడా గత ఎన్నికల్లో 51 మంది రెడ్డి సామాజిక వర్గం వారు ఎన్నికయ్యారు. ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరులో కొంత భాగం రెడ్ల ప్రాబల్యం ఉంది. కాబట్టి ఈ జిల్లాలలో రెడ్డి సామాజిక వర్గం వారికి ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలి. 1983, 1985, 1994 ఎన్నికలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 నుండి 70 మంది వరకు TDPలో టిక్కెట్లు ఇచ్చారు. కావున పార్టీకి అధ్యధిక సీట్లు వచ్చాయి.  స్వంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువ మంది రెడ్లను బరిలో దింపాలి. జగన్ ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మచ్చిక చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా ఆధారపడకుండా, బిసిలు జారిపోకుండా జాగ్రత్త పడాలి. రేవంత్ రెడ్డి లాగా పోరాడే వారికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి. కాకా రాజకీయాలు చేసే వారిని పక్కన పెట్టాలి. 

వరుసగా రెండు సార్లు ఓడి పోయిన వారికి, గత ఎన్నికల్లో 10 వేల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోయిన వారికి టిక్కెట్లు ఇవ్వకూడదు. వ్యూహకర్త రాబిన్ శర్మను పక్కన పెట్టి, రేవంత్ రెడ్డి వ్యూహకర్త సునీల్ కొనుగోలు సేవలు వినియోగించు కోవాలి. నెలాఖరులోగా సమర్థులైన వారిని ఇంచార్జిలుగా నియమించాలి. కనీసం సగం పార్లమెంటు అధ్యక్షులను మార్చాలి. పార్టీ కార్యాలయం, బయట ఉన్న కోవర్టులను ఏరి వేయాలి. కనీసం జనవరి నుంచి అయినా వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, ప్రజా సమస్యలపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *