సత్యవేడులో మహిళలకే ఛాన్స్ !
టిడిపికి కంచుకోట అయిన ఎస్సీ రిజర్వు నియోజక వర్గం సత్యవేడులో పట్టు సాధించడానికి ఆచితూచి అభ్యర్దిని ఎంపిక చేయడానికి చంద్రబాబు అన్వేషణ ప్రారంభించారు. ఇంచార్జి గా ఉన్న జేడీ రాజశేఖర్ ను రెండేళ్ల క్రితం తొలగించి మాజీ ఎమ్మెల్యే హేమలతకు బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజులకే ఆమె బదులు ఆమె కుమార్తె హెలెన్ ను ఇంచార్జి గా నియమించారు. అయితే చెన్నైలో ఉన్న ఆమె అనుకున్న రీతిలో పనిచేయడం లేదని, ఆమె సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉన్నాయని, ఆమెను నమ్ముకుంటే నష్ట పోతామని కొందరు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పైగా జేడీ రాజశేఖర్ సమాంతరంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. దీనితో అభ్యర్ధి ఎంపిక విషయంలో చంద్రబాబు మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా జేడీ రాజశేఖర్ కుమార్తె మౌనిక, మాజీ జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ కూతురు డాక్టర్ చందన పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంచార్జి హెలెన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె తల్లి హేమలత గతంలో టిడిపి టిక్కెట్టుపై ఎమ్మెల్యే అయ్యారు. తాను ఇంచార్జి అయినప్పటి నుంచి నియోజక వర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక స్థానమైన మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తు ఉన్నందున ఆమెకు తప్పకుండా టిక్కెట్టు వస్తుందని అంటున్నారు.
జేడీ రాజశేఖర్ తో పాటు ఆయన కుమార్తె, రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి మౌనిక పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఆర్కిటెక్చర్ ఇంజనీరు అయిన ఆమె తండ్రితో పాటు నియోజక వర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. చక్కగా మాట్లాడగల యువతి అయిన ఆమెను అభ్యర్థిగా పోటీ పెడితే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు.
కొత్తగా తిరుపతిలో డెంటిస్ట్ గా ఉన్న డాక్టర్ పి చందన స్రవంతి పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆమె ఇటీవల చంద్రబాబు, లోకేష్ లను కలసి అభ్యర్థిత్వం కోరింది. ఆమె తండ్రి రాజశేఖర్ గతంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఆమె తల్లి డాక్టర్ నాగభూషమ్మ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె భర్త పుష్యమిత్ర న్యాయవాదిగా ఉన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.