గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో ప్రధాన పార్టీల నేతలు గట్టి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే, మొదటికే మోసం వచ్చేటంత. ఇద్దరు నాయకులు రెడ్లకు వ్యతిరేకులుగా ముద్రపడుతున్నారు. నారాయణస్వామిని బహిరంగంగా ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నిలతీస్తున్నారు. ఇక థామస్ ను నియోజకవర్గంలోని రెడ్డి నాయకులు పట్టించుకోవడం లేదు. ముఖ్యనేతలను థామస్ కలవలేదు కూడా. ఆయనకు అండగా ఉన్న ఒక నాయకుడు మాజీ మంత్రి అమర్నధ రెడ్డినే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణ స్వామికి రక్తసంబంధీకుల నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. టిడిపి ఇంచార్జి డాక్టర్ వి ఎం థామస్ కు పార్టీలో ఒక వర్గం పూర్తి వ్యతిరేకంగా ఉంది. మండల పార్టీ అధ్యక్షులు దూరంగా ఉన్నారు. ఇద్దరు నేతల పట్ల రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు వ్యతిరేకత చూపుతున్నారు. దీనితో పిల్లుల పోరు కోతి తీర్చినట్టు ఇద్దరికీ టికెట్టు దక్కకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు.
నారాయణ స్వామి పట్ల తన ఇద్దరు చెల్లెళ్ళు, భావ మరిది మాజీ పి ఏ సుబ్రమణ్యం పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయనకు వైసిపి టికెట్టు వస్తే ఇంటింటికీ తిరిగి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సిద్ధ పడుతున్నారని సమాచారం. కాగా ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి, ఆయన వర్గం స్వామికి టికెట్టు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాగే నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధిక శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్టు దక్కదని అంటున్నారు. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు, గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ అనగంటి హరికృష్ణ పేరు బలంగా విని పిస్తోంది. అయితే కుతూహలమ్మ అక్క కొడుకు రాజేష్ కూడా టికెట్టు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉండగా టిడిపి ఇంచార్జి థామస్ పట్ల పార్టీలో కీలక నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆరు మండలాల అధ్యక్షులు ఆయనకు టికెట్టు వద్దని అంటున్నారు. అందరూ కలసి ఆ మేరకు అధిష్టాన వర్గానికి లేఖ రాశారని తెలిసింది. ఇటీవల ఎస్ ఆర్ పురం మండల కమిటీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, పెనుమూరు మండల కమిటీ అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేసారని అంటున్నారు. థామస్ స్వంత మండలం కార్వేటినగరం మండలానికి చెందిన మాజీ ఎంపీపీ రవికుమార్, మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముదాల శ్రీహరి తదితరులు వ్యతిరేకంగా ఉన్నారు. గ్యాస్ రవి కుమార్, పాల సముద్రం మాజీ జెడ్పీటీసీ రాజేంద్ర టికెట్టు రేసులో ఉన్నారు.
థామస్ మాజీ మంత్రి అమరనాద రెడ్డి ఫోటో బ్యానర్లలో వేయడం లేదని, నియోజక వర్గంలో రెడ్లకు వ్యతిరేకంగా ఉన్నారని ఆ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. వారం రోజుల కిందట తిరుపతిలోని ఒక హోటల్ లో జరిగిన వెదురుకుప్పం మండల పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఇది వరకు నియోజకవర్గానికి కీలకంగా వ్యవహరించిన ఒక నేత ఇంచార్జి థామస్ సమక్షంలోనే మాజీ మంత్రి అమరనాధ రెడ్డిపై విరచుకుపడినట్లు సమాచారం. ఆ నేత ఆదేశాల ప్రకారం నియోజకవర్గంలోని బ్యానర్లు, కట్ అవుట్లలో మాజీ మాత్రి ఫోటో పెట్టడం లేదని సమాచారం. థామస్ తో పోలిస్తే నారాయణ స్వామి వెయ్యి రెట్లు మేలని పరువురు రెడ్డి సామాజిక వర్గం ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ కు టికెట్టు కేటాయిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.పవన్ కళ్యాణ్ కూడా యుగంధర్ పట్ల సానుకూలంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారాయణ స్వామి, థామస్ కు టికెట్లు రాక పోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.