సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత ప్రయాణం !?
సంక్రాంతి నుంచి మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించినట్లు సమాచారం. రానున్న ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జగన్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. మొదటి మహిళలను ఆకట్టుకోవడానికి వారికీ ఉచిత ప్రయాణం కల్పించే విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, సంక్రాంతి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.
ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చింది. ఇందుకు మంచి స్పందన లభించింది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని ఎన్నికల ప్రణాళికలో చేర్చారు. కావున వారికి అవకాశం ఇవ్వకుండా ముందుగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించి ఆ క్రెడిట్ కొట్టేయాలని జగనన్న ఆలోచిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ అధికారుల నుండి నివేదికను కోరినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో పాసులు కలిగిన వ్యక్తులు పది లక్షల మంది వరకు ఉంటారు. ఇందులో నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. స్వతంత్ర సమారా యోధులకు, జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఆర్టీసీకి రోజువారి ఆదాయం 17 కోట్ల రూపాయలు వస్తుంది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీకి రోజుకు ఆరు కోట్ల రూపాయల ఆదాయం గండిపడుతుంది. ఈ ఆదాయాన్ని ఎలా సమకూర్చాలని విషయంపై ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతుంది. ఇతర రాష్ట్రాలలో అమలు జరుగుతున్న ఉచిత రవాణా విధానాన్ని అధ్యయనం చేస్తున్నారు. అక్కడి అధికారులతో కూడా మాట్లాడి సాధ్యసాద్యాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఒక బృందం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను సందర్శించే అవకాశం ఉంది. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలోనే ముఖ్యమంత్రి ఈ పధకం గురించి ఒక ప్రకటన చేస్తారని సమాచారం. చెల్లెమ్మలకు సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అంకితం చేయనుంది.