తిరుపతి తెదేపాలో కోవర్టులు ఉన్నారా ?
సుబ్బి పెళ్లి వెంకీ చావుకు వచ్చిందన్నట్లుగా తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి తయారయ్యింది. తిరుపతి మున్సిపాలిటీలో జరిగిన 4050 వేల కోట్ల టిడిఆర్ బాండ్ల కుంభకోణం విషయాన్ని నెల్లూరులోని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరయణ రెడ్డి బయటపెట్టారు. దీంతో తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకుల చిత్తశుద్ధిని శంకించాల్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. తిరుపతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదన్న విషయంపైన అధిష్టానం ఆరా తీస్తోంది.
తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో అతిరథ మహారధులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పరసా రత్నం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సూరా సుధాకర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శులుగా దంపూరి భాస్కర్, బుల్లెట్ రమణ, విజయలక్ష్మి, వినుకొండ సుబ్రహ్మణ్యం ఉన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్.బి. సుధాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్చార్జిగా సుగుణమ్మ, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా రవి నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పట్టణ అధ్యక్షుడుగా చినబాబు ఉన్నారు. పట్టణ కార్యవర్గం ఉంది. మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన ఏకైక కార్పొరేటర్ ఆర్ సి మ్న
మునికృష్ణ ఉన్నారు.
ఇంతమంది నేతలు ఉంటున్నా, టిడిఆర్ బాండ్ల కుంభకోణం గురించి పసిగట్టకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుంది. కొంతమంది నాయకులకు ఈ విషయం తెలిసినా, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో లాలూచీపడి ఈ వ్యవహారాన్ని దాచి పెట్టారన్న సందేహం కూడా అధిష్టానానికి కలుగుతుంది. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంటరీ కమిటీని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది.
తిరుపతిలో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు వారి పదవులను అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకుల నుండి లబ్ధి పొందుతునట్లు తెలుస్తోంది. ఇందుకు ఆనుగుణంగా తిరుపతి మున్సిపాలిటీలో కానీ టిటి దేవస్థానంలో గాని ఏం జరిగినా వాటి గురించి పల్లెత్తు మాట కూడా అనడం లేదని భావిస్తున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవకతవకల గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదన్న సందేహం ఉంది. ఒక నేత మున్సిపల్ కాల్వ మీదనే ఇంటిని నిర్మించినట్లు సమాచారం. మరో నేతకు వివాదాస్పదమైన భూములు ఉన్నట్లు తెలుస్తోంది. కావున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి, అక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా విమర్శించడం లేదని సమాచారం. వాళ్ళ అవినీతి, ఆక్రమణల మీద పేపర్లలో వార్తలు వస్తున్నా, స్థానిక నాయకుల్లో మాత్రం స్పందన లేదని తెలుస్తోంది. తాము విమర్శిస్తే తమ ఆస్తులకు ఎక్కడ నష్టం కలుగుతుందో అన్న ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది నాయకులు వైసిపి నాయకులతో లాలూచీపడి కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రాంతీయ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఇందుకు అవసరమైన భవనాన్ని సిద్ధం చేయాల్సిందిగా పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ విషయమై రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి కూడా ఒక పర్యాయం తిరుపతిలో పర్యటించారు. అయితే ఇప్పటివరకు ఈ కేంద్రానికి అవసరమైన భవనాన్ని ఖరారు చేయలేదు. అలాగే తిరుపతి పట్టణంలో పార్లమెంటరీ పార్టీ కార్యాలయం, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నాయి. వీటిని ఎప్పుడు తెలుస్తారో కూడా తెలియదు. ఇవి అప్పుడప్పుడు మాత్రమే తెరచుకుంటాయని సమాచారం. ఈ విషయాల పార్టీ అధిష్టానం మీద సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తిరుపతి పట్టణానికి సంబంధించిన నాయకుల మీద చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది.