నగరి వైసీపీ అభ్యర్థిగా గాలి జగధీష్ ?
నగరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన, కుటుంబం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టచ్ లో ఉన్నట్లు సమాచారం. గాలి జగదీష్ అభ్యర్థిత్వం పట్ల వైసీపీ నేతలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు జగదీష్ అభ్యర్థిగా ఖరారు కాలేదు. దాదాపుగా ఖరారు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండవ కుమారుడైన గాలి జగదీష్ తొలినుంచి సేవా భావం కలిగి ఉన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం, నగరి అభివృద్ధి నిమిత్తం రాజకీయంగా అరంగ్రేటం చేయాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో తనకంటూ భారీగా అనుచరగణం ఉంది. జగదీష్ అన్న గాలి భానుప్రకాష్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నగరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో రోజా చేతిలో ఓడిపోయారు. ఆయన ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికలలో తిరిగి టిక్కెట్టును ఆశిస్తున్నారు. అయితే, జగదీష్, అయన తల్లి, మాజీ ఎమ్మెల్సీ సరస్వతమ్మ భానుప్రకాష్ ను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. వీరు ఇద్దరు ఒకటిగా తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం తొలుత ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం సానుకూలంగా స్పందించలేదు. దీంతో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో పలుమార్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసినట్టు సమాచారం. అయన కూడా సానుకూలంగా స్పందించి, కొద్దిరోజుల సమయం కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నగిరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా నియోజకవర్గంలో గట్టి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ఆమెకు మళ్ళి టికెట్ ఇస్తే గెలుస్తుందన్న నమ్మకం లేకపోవడంతో వైసిపి నాయకులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నారు. తొలుత శ్రీశైల దేవస్థానం ఆలయ పాలక మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి పేరును కూడా పరిశీలించినట్లు సమాచారం. అయితే ఆయనకు ఒక వర్గం వ్యతిరేకంగా ఉండడంతో గాలి జగదీష్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విషయమే మంత్రి రోజా గూడా స్పందించారు. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా, వారి విజయానికి కృషి చేస్తానని తిరుమలలో ఆమె స్పష్టం చేశారు. మంత్రి రోజా సేవలను పార్టీ ప్రచార ర్తగా వాడుకోనున్నారని కొందరు చెబుతుండగా, ఆమెను నగరి నుంచి శ్రీకాళహస్తికి మార్చనున్నారని మరికొందరు అంటున్నారు. ఇలా నగరి టిక్కెట్టు రోజాకు డోలాయమానంలో ఉండడంతో, నగరి నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా కొత్త ముఖం రానున్నట్లు తెలుస్తోంది. ఆ కొత్త ముఖం గాలి జగదీష్ కావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.