తెదేపా కార్యకర్తల్లో జోష్ నింపిన యువగళం సభ
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభ ‘యువగళం - నవశకం’ కార్యకర్తల్లో జోష్ నింపింది. అంచనాలకు మించి జనం రావడంతో రానున్న ఎన్నికలలో పార్టీ విజయం ఖాయం అన్న నమ్మకం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కుదిరింది.
విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో బుధవారం జరిగిన ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో పాటు రెండు పార్టీలకు చెందిన నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. లోకేష్ నాయకత్వం మీద కార్యకర్తలకు నమ్మకం కుదిరింది. భవిష్యత్తు నాయకుడుగా లోకేష్ కార్యకర్తల గుండెల్లో స్థానం సంపాదించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పాదయాత్ర అనుభవాలు ప్రేక్షకులకు కన్నీళ్ళు తెప్పించాయి. ఆయన జగన్ పాలనపై చేసిన విమర్శలు, హెచ్చరికలు ప్రకంపనాలు సృష్టించాయి.
జగన్ ఐపీఎల్ కోడికత్తి వారియర్స్ టీమ్ అంటూ లోకేష్ ప్రకటించిన పేర్లు విని సభలో చప్పట్లు మార్మోగాయి. కోడికత్తి వారియర్స్ ఆటగాడు అవినాశ్‌రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు, గంట స్టార్ అవంతి, ఆల్‌రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, పించ్ హిట్టర్ బియ్యపు మధుసూధన రెడ్డి అంటూ హేళన చేశారు.
చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ తరహాలో మరిన్ని పథకాలు ప్రకటిస్తామని చంద్రబాబు ప్రకటించారు. త్వరలో అమరావతి, తిరుపతిలో పవన్ తో కలిసి సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఆయా సభల్లో టీడీపీ-జనసేన ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేలు భృతి ఇస్తామని చెప్పారు. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తామని తెలిపారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ అవినీతి, అక్రమ పాలన అంతం చేయడానికి పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. 2019 లో జరిగిన చిన్న పొరపాటు వల్ల జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం జగన్ ను ఓడించక తప్పదన్నారు. అలాగే జనసేన పి ఎ సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, సినీ నటుడు బాలకృష్ణ, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరుల ప్రసంగాలు ఆకట్టు కున్నాయి. మొత్తం మీద ముగింపు సభ అనూహ్య విజయవంతం కావడంతో రెండు పార్టీల కార్యకర్తల్లో నూతన ఉత్సాహం, ఉత్తేజం నింపింది. వచ్చే ఎన్నికల్లో అధికారం వస్తుందన్న నమ్మకం ద్విగునీకృతం అయ్యింది.
చిత్తూరు నుండి ప్రత్యేక రైలులో టీడీపి కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. రైలును GJN ట్రస్ట్ తరపున తెదేపా నాయకుడు గురజాల జగన్మోహన్ నాయుడు ఏర్పాటు చేశారు.