6, డిసెంబర్ 2023, బుధవారం

జనసేన కన్నా, బర్రెలక్క మిన్న


తెలంగాణా ఎన్నికలలో జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల కంటే కూడా స్వతంత్ర అభ్యర్థిగా నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్హాపూరు నుంచి పోటీ చేసిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు వచ్చిన ఓట్లే అధికం. ఆమెకు 5,754 ఓట్లు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ బరిలోకి దిగినప్పటికీ, కనీసం డిపాజిట్లను సైతం వెనక్కి తెచ్చుకోలేకపోయారు. స్వయంగా పవన్ కల్యాణే ప్రచారంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఎనిమిది నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే.. అన్ని చోట్లా ఓడిపోయారు. కనీసం గట్టి ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు. ఆయా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కంటే దారుణంగా వారికి ఓట్లు పడ్డాయి. కనీసం డిపాజిట్లు కూడా పవన్ కల్యాణ్ తిరిగి ఇప్పించలేకపోయారు 


కూకట్ పల్లిలో పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఒక్కరే చెప్పుకోదగ్గ ఓట్ల సంఖ్యను నమోదు చేశారు. ఆయనకు 39,830 ఓట్లు పోల్ అయ్యాయి. మిగిలిన ఏడు నియోజకవర్గాల్లోఎక్కడే గానీ జనసేన అభ్యర్థులను ఓటర్ల నుంచి ఆదరణ లభించలేదు. తాండూరు- నేమూరి శంకర్ గౌడ్ 4,087, కోదాడ- మేకల సతీశ్ రెడ్డి- 2,151, నాగర్ కర్నూల్- వంగ లక్ష్మణ్ గౌడ్ 1,955, ఖమ్మం- మిర్యాల రామకృష్ణ 3,053, కొత్తగూడెం- లక్కినేని సురేందర్ రావు 1,945, వైరా (ఎస్టీ)- డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్ 2,712, అశ్వారావుపేట (ఎస్టీ)- ఉమాదేవి 2,281 ఓట్లు పోల్ అయ్యాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కనీసం ఆ మాత్రం ఓట్లు అయినా పోల్ అయ్యాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల కంటే కూడా స్వతంత్ర అభ్యర్థిగా నాగర్ కర్నూల్ జిల్లాలోని కొడంగల్ నుంచి పోటీ చేసిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు వచ్చిన ఓట్లే అధికం. ఆమెకు 5,754 ఓట్లు పడ్డాయి.


 బర్రెలక్క (కర్నె శిరీష)- తెలంగాణ ఎన్నికల్లో ‘సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్’గా నిలిచిన నిరుద్యోగ అభ్యర్థి. బర్రెలక్క పోటీ వర్తమాన రాజకీయాలపై విసిగిపోయిన ప్రజలకు ప్రతీకగా చూస్తున్నారు. మోసపోయిన నిరుద్యోగుల గొంతుకగా ఆమె ఎన్నికలలో పోటీ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన ప్రభుత్వంపై ఆమె ఓ సామూహిక నిరసన గళమయ్యారు. సాధారణ ప్రజల మధ్య ఆమె మరీ సాధారణ యువతి. ఆమెకు ఇల్లు లేదు. డబ్బు లేదు. పార్టీ లేదు. అన్నింటికీ మించి ఉద్యోగం లేదు. అనేక పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన సగటు నిరుద్యోగి.  కొల్లాపూర్‌ నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు సామాజిక మాధ్యమాలలో మద్దతు వెల్లువెత్తింది. ఆమె గెలవాలని సామాజిక మాధ్యమాలలో చాలా మంది కోరుకున్నారు. రాజకీయాలంటే డబ్బుగా మారిపోయిన తరుణంలో కనీసం రోజు గడవడం కూడా కష్టమైన బర్రెలక్క ప్రజల దృష్టిని ఆకర్షించారు కానీ, ఎన్నికల రణరంగంలో పరాజితగానే నిలిచారు.


డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు (గేదెలు) కాసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, కేస్‌లో చిక్కుకున్నయువతి ‘బర్రెలక్క’. ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్ కావడంతో కర్నె శిరీష అనే ఆమె అసలు పేరు స్థానంలో బర్రెలక్క అనేది స్థిరపడిపోయింది. ఆమె బర్రెల వీడియో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందంటూ పోలీసులు అప్పట్లో కేసు పెట్టారు. ప్రభుత్వం, అధికార పార్టీయే తనపై కేసు పెట్టించిందంటూ, ఆ కేసు కారణంగా తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఆమె కన్నీరు పెట్టడంతో సమాజంలో ఆమెకు చాలా మంది మద్దతుగా నిలిచారు.


కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ నుంచి బీరం హర్షవర్థనరెడ్డి లాంటి వారి మధ్య బర్రెలక్క గెలవకపోవచ్చు. కానీ ఆమె సమాజంలోని చైతన్యస్థాయికి ప్రతీకగా నిలవగలిగారు. ప్రభుత్వం తప్పు చేస్తే అడిగగలిగిన సామాన్యులు కూడా ఉంటారని చెప్పడానికి బర్రెలక్క ఓ ఉదాహరణగా నిలిచారని ఆమె మద్దతుదారులు గర్వంగా చెప్పుకొంటున్నారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేనతో పోల్చుకుంటే, బర్రెలక్క నయమని రాజకీయ విశ్లేషకులు భవిస్తూన్నరు. జనసేనకు తెలంగాణాలో పట్టులేదు. పవన్ ఎక్కువగా పర్యటించలేదు. సరైన పునాది లేని చోట పోటీచేసి, నవ్వులపాలు కావడం కంటే, పోటి చేయకుండా ఉంటే గౌరంగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *