పూతలపట్టు బరిలో కొత్త ముఖాలు !
పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 3 పర్యాయాలు శాసనసభకు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు ఎన్నికల్లోను తెలుగుదేశం పార్టీ వరుసగా ఓటమిని చవిచూసింది. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి రవి కుమార్ విజయం సాధించారు. 2014 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్, 2019 ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థి ఎమ్మెస్ బాబులు విజయం సాధించారు. వరుసగా మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ ఓడినా, చంద్రబాబు ఈ నియోజకవర్గ మీద ప్రత్యేక దృష్టిని సారించలేదు. ఈ నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజిక వర్గ నేతలు ఉన్నారు. అయినా పార్టీ పరాజయం పాలు కావడం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. రానున్న ఎన్నికలలో కొత్త అభ్యర్థులను బరిలోకి దించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన పాత్రికేయుడు మురళీమోహన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆనగల్లు మునిరత్నంలో టికెట్ ని ఆశిస్తున్నారు.
సుదీర్ఘ విధానం తర్వాత పూతలపట్టు మండలానికి చెందిన పాత్రికేయుడు మురళీమోహన్ ను ఇన్చార్జిగా నియమించడం జరిగింది. నియోజకవర్గంలోని సీనియర్ దళిత నాయకులను కాదని పార్టీకి ఏమాత్రం సంబంధం లేని కొత్త వ్యక్తిని తీసుకుని వచ్చి ఇంచార్జ్ గా నియమించడంతో నియోజకవర్గంలో టిక్కెట్ నాశించిన దళిత నాయకులకు మింగుడు పడడంలేదు. ఆనాటి నుంచి కొంతమంది దళిత నాయకులు పార్టీకి అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరి కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మురళి మోహన్ ఇన్చార్జ్ అయిన తర్వాత పూతలపట్టులో జరిగిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభ విజయవంతమైంది. బహిరంగ సభలో పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిగా మురళీమోహన్ ను గెలిపించాల్సిందిగా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత జరిగిన ఆందోళన కార్యక్రమాలలో మురళీమోహన్ మీద 11 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఇందులో హత్యాయత్నం కేసు కూడా ఉండటంతో నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. బెయిల్ పొందిన తర్వాత మళ్లీ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. మురళీమోహన్ ను ఇన్చార్జిగా నియమించిన సమయంలో చిత్తూరుకు చెందిన ఒక విద్యా సంస్థల అధినేత ఎన్నికల ఖర్చు మొత్తం తాను భరిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే అతను మాట మార్చడంతో మురళీమోహన్ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్లను మురళీమోహన్ కు ఖరారు చేస్తారా లేక కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారా అనే విషయమై నియోజకవర్గంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
పూతలపట్టుకు చెందిన దళిత సంఘ నేత ఆనగల్లు మునిరత్నం (Anagallu Muniratnam) ఎన్నికల బరిలో ఉన్నారు. వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్ముగంకు కొడుకు వరసయ్యే మునిరత్నం దళిత సంఘ నేతగా చురుగ్గా పార్టీ, దళిత సంఘ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శాసనసభ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా, టిడిపి ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం ఎస్సి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మురళీమోహన్ ను ఇన్చార్జిగా నియమించినా తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా రోడ్డు మీదికి రాలేదు. రాజకీయ నేపథ్యం ఉన్న తనకు సీటును కేటాయించాల్సిందిగా కోరుతున్నారు.