నారా లోకేష్ కు CID నోటిసులు
తెలుగుదేశం పార్టీ యువ నేత ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ సిఐడి పోలీసులు మరోమారు నోటీసులు జారీ చేశారు. నారా లోకేష్ తమను, ఇతర అధికారులను బెదిరిస్తున్నారని, ఇది బెయిల్ నిబంధనలకు వ్యతిరేకమని నోటీసులో పేర్కొన్నారు. లోకేష్ అరెస్ట్ చేసి, విచారణ జరపడానికి అనుమతించాల్సిందిగా కోర్టును కోరారు.
నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం నుంచి రెడ్ బుక్ ప్రస్తావన తీసుకువస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను వేధించిన వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరి భరతం పడతామని హెచ్చరిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి 'నేను నాన్న లాగా మంచోడిని మాత్రం కాను. ఎవరిని వదిలేది లేదు' అంటూ హెచ్చరికలు జారీ చేశారు. లోకేష్ పాదయాత్రలో కూడా అడుగడుగునా పోలీసులు ఆటంకాలు సృష్టించారు. అనుమతి నిరాకరించడం, మైక్ లాక్కోవడం, వాహనాలను సీజ్ చేయడం, తను మాట్లాడడానికి నిలుచున్న స్టూల్ ను కూడా స్వాధీనం చేయడం వంటి విపరీత చర్యలకు పాల్పడ్డారు. దీంతో లోకేష్ తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి రెడ్ బుక్ ప్రస్తావని తీసుకువచ్చారు. పాదయాత్ర ప్రారంభం నుంచి, ముగింపు తన దృష్టికి వచ్చిన మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులకు, బేధింపులకు పాల్పడుతున్న అందరి పేర్లను రెడ్ బుక్కులో నమోదు చేశానని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి భరతం పడతానని యువగళం ముగింపు సమావేశంలో కూడా హెచ్చరించారు. లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు అధికార యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టించాయి. అన్ని విభాగాల్లో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఎవరి పేరు ఉందొ అన్న అనుమానం ప్రతి అధికారిని వేధిస్తోంది. దీంతో సిఐడి పోలీసులను కూడా ఈ అనుమానం వెంటాడుతోంది.
నారా లోకేష్ రెడ్ బుక్ హెచ్చరికల కారణంగా అధికార యంతాంగం సక్రమంగా విధులను నిర్వహించలేకపోతుందని, ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని సిఐడి పోలీసులు సిఐడి కోర్టుకు తెలియజేశారు. రెడ్ బుక్కులో ఏముందో బహిరంగపరచాల్చిన అవసరం ఉందని కోరారు. లోకేష్ కు బెయిల్ మంజూరు సమయంలో సాక్షులను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలు చేపట్టకూడదని షరతులు విధించారు. అయితే రెడ్ బుక్కు కారణంగా లోకేష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, ఫలితంగా షరతుల ఉల్లంఘన కిందకు వస్తుందని సిఐడి పోలీసులు పేర్కొన్నారు. నారా లోకేష్ ను అరెస్టు చేసి, విచారణ జరపడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. సిఐడి కోర్టు ఈ కేసును జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.