![](https://blogger.googleusercontent.com/img/a/AVvXsEgYST1akgmRHtLQcVNfl7nqzRX4krhyoPr7mSH4iGx1ULsUdc1zycT0_rQus6ipLr7pZYb5nNP86Ei2FvGBayvxSixpuxpmcD2ki9fuSMRD4RHG3AaCqJnkG3jQBLBrII-GRjNsVxn0XoXPuoakr0kwMbgRx92sjcaMihTLQ5sMlWHKHBm1MuJaOao89VM)
రానున్న ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి కలిసి పోటి చేయడం చారిత్రక అవసరమని జనసేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న జగన్ ను 10 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉంచడమే తన లక్ష్యంగా తెలిపారు. తనను ప్రధాని మోడీ, బీజేపీ జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధం చేసుకున్నారని వివరించారు. కొందరు నాయకులు, కార్యకర్తలు పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలంటి వారు పార్టీని వదలి వెళ్ళాలని కోరారు. 2004 ఎన్నికలలో తెదేపా, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ముగించుకుని ఏపీలో జనసేన విస్తృత భేటీలో పాల్గొనేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు. జనసేనకు ఇవాళ ఆరు లక్షల కార్యకర్తల బలం ఉందని, యువతలో తమ పార్టీకి ఉన్న ఫాలోయింగ్ చూసి ఢిల్లీ పెద్దలే ఆశ్చర్యపోయారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇంతమంది యువత మద్దతు ఉందనే గర్వం రాకూడదన్నారు. తమ పార్టీకి యువత చూసే తెలంగాణలో 8 సీట్లలో పోటీ చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పుడు ఏపీలోనూ జనసేనను బలోపేతం చేసుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన భేటీలో సొంత పార్టీ నేతల తీరుపై పవన్ కాస్త అసహనం వ్యక్తం చేశారు. తనకొక భావజాలం ఉందని, దాన్ని అర్ధం చేస్కోపోతే ఎలా అని మండిపడ్డారు. ఎన్నికలకు వంద రోజులే సమయం ఉందని, ఎలక్షనీరింగ్ చాల ముఖ్యమని నేతలకు సూచించారు. శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టాను. తాను పార్టీని నడుపలేనని చాలామంది అన్నారు. 2019 నుంచి ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుంటే ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసే వాళ్లమని.. కానీ ఇతర పార్టీల నుంచి నేను నాయకులను తీసుకోలేదని తెల్చిచెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచే దళిత సంఘాలు, బీసీల నాయకులతో తిరిగానని అన్నారు.
తెలంగాణలో రెండు ఎన్నికలు గెలిచిన బీఆర్ఎస్ మూడో ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని చెప్పారు. వెనుకబడిన వర్గాలు నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. కులాలకు కేటాయించి నిధులు అ కులాలకు వెళ్లడం లేదన్నారు. అధికారం చూడని వారికి అధికారం ఇవ్వడమే నిజమైన సాధికారత అని తెలిపారు. తాను ఒంటరి తనాన్ని అనుభవించానని అవమానాలు కూడా పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన మాట నెలబెట్టుకోలేనేమో అని అనుక్షణం భయపడ్డానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఏపీలో అధికార వైసీపీకి ఓ భావజాలం అంటూ లేదని పవన్ విమర్శించారు. ఎందుకు పనిచేస్తున్నారో వైసీపీ నేతలకు తెలియదని, అన్నను ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తున్నామంటారని పవన్ ఆక్షేపించారు. కానీ జనసేన పార్టీ అలా కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు సీరియస్ గా పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు. గతంలో ఏపీ ప్రభుత్వం సినిమాలు ఆపినా, బెదిరింపులకు దిగినా తాను స్వయంగా పోరాడానని, అంతే తప్ప బీజేపీ పెద్దల వద్దకు వెళ్లి సాయం అడగలేదన్నారు.