ఎమర్జింగ్ టెక్ హబ్ గా తిరుపతి !
టెక్నాలజీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిని ఎమర్జింగ్ టెక్ హబ్ గా డెలాయిట్-నాస్కామ్ సంస్థలు ఉమ్మడిగా ప్రకటించాయి. అలాగే తిరుపతి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ హబ్ గా ఎదుగుతున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి. తిరుపతితో పాటు విశాఖ, విజయవాడలను కూడా ఎమర్జింగ్ టెక్ హబ్స్ గా ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాలు అభివృద్ధి, ఉపాధి కల్పన మీద డెలాయిట్-నాస్కామ్ ఉమ్మడిగా అధ్యయనం చేశాయి. విభజన తర్వాత ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో వెనుకబడినట్లు కనిపిస్తున్నా, ఏపీలో మూడు నగరాలు టెక్నాలజీ హబ్ లుగా ఎదుగుతున్నట్లు డెలాయిట్-నాస్కామ్ రిపోర్ట్ పేర్కొంది. ఆయా నగరాల్లో సాఫ్ట్ వేర్ పరిశ్రమలు, ఉత్పత్తి, ఎగుమతులు ఇలా పలు అంశాల్ని దృష్టిలో ఉంచుకుని వీటిని ఎమర్జింగ్ టెక్ హబ్స్ గా ప్రకటించింది.
ఈ నగరాల్లో టెక్నాలజీ మార్కెట్లో కొత్త సంస్ధల ప్రవేశం, విద్యావంతులైన సిబ్బంది.. ఈ రంగంలో మరింత మందిని ఆకర్షించేలా చేస్తున్నట్లు డెలాయిట్-నాస్కామ్ ఉమ్మడిగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అలాగే ఈ రిపోర్టులో ఏపీలో టూటైర్ నగరాలుగా ఉన్న విజయవాడ, విశాఖ, తిరుపతి టెక్ హబ్ లుగా ఎలా ఎదుగుతున్నాయో కూడా వివరించారు. వీటి ప్రకారం ఈ నగరాల పట్ల ఆకర్షితులవుతున్న సంస్ధలు, అవి కల్పిస్తున్న ఉద్యోగావకాశాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో తెలిపారు.
తిరుపతిలో మెడికల్ ట్రాన్ స్క్రిప్షన్, రెవెన్యూ సైకిల్ మేనేజ్ మెంట్ రంగాల్లో తిరుపతి బాగా ఎదుగుతోందని తెలిపింది. ఐఐటీతో పాటు ఇన్ హౌస్ ఇంక్యుబేటర్ల నుంచి లభిస్తున్న ప్రోత్సాహంతో తిరుపతిలో స్టార్టప్ లు బాగా అభివృద్ధి చెందుతున్నట్లు డెలాయిట్-నాస్కామ్ అధ్యయనం తెలిపింది. అలాగే వైజాగ్ పోర్ట్ అండ్ లాజిస్టిక్ హబ్ గా ఎదుగుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది. పలు ఈకామర్స్-లాజిస్టిక్ సెంటర్లకు విశాఖ కేంద్రంగా మారిందని తెలిపింది. ప్రధాన మార్కెట్లకు విశాఖతో ఉన్న కనెక్టివిటీ ఉపయోగపడుతోందని వెల్లడించింది.
విజయవాడనే తీసుకుంటే హార్డ్ వేర్, ఐటీ, ఫుడ్ టెక్, సాఫ్ట్ వేర్, డేటా స్టార్టప్స్ రంగాల్లో నగర ప్రాధాన్యం పెరుగుతుందని ఈ రిపోర్ట్ తెలిపింది. ప్రత్యేక ఆర్ధిక మండళ్లలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రీమియర్ సంస్ధలు, పెట్టుబడుల రాక టెక్నాలజీ మ్యాప్ లో విజయవాడకు చోటు కల్పించాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.