29, డిసెంబర్ 2023, శుక్రవారం

జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఖరారు ?

8 మంది పాతవారిని కొనసాగింపు 
6 నియోజకవర్గాలకు కొత్త ముఖాలు 
ఇందులో ఇద్దరు వారసులు 
నలుగురు ఎమ్మెల్యేలు అవుట్ 
8 మంది రెడ్లు, ఇద్దరు బీసీలు 
బలిజలకు రిక్తహస్తం 


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసిపి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఒక జాబితా అనధికారికంగా సామాజిక మధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం జిల్లాలో ఎనిమిది మంది పాతవారిని కొనసాగించినట్లు సమాచారం. ఆరు చోట్ల కొత్త అభ్యర్థులు రంగంలోకి వచ్చారు. అందులో ఇద్దరు వారసులు కాగా, నలుగురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టినట్లు అయింది. జిల్లాలో మంత్రులు రోజా, నారాయణ స్వామికి టిక్కెట్టు సందేహమని  జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. మంత్రులు ఇద్దరికీ టికెట్లు ఖరారు అయినట్లు తెలుస్తుంది. దీంతో జిల్లాలో ముగ్గురు మంత్రులు తిరిగి పోటీ చేయనుండగా, తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నారు. జిల్లాలో ఇద్దరు బిసిలకు టిక్కెట్టు ఇవ్వగా, బలిజ సామాజిక వర్గానికి మొండి చేయి చూపింది. 8 మంది రెడ్లకు, ఒక మైనారిటీకి టిక్కెట్టు లభించినట్లయ్యింది.


పుంగనూరు నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాలుగో పర్యాయం పోటీ చేయనున్నారు. అక్కడ నుండి మూడు పర్యాయాలు పోటీ చేసి విజయం సాధించారు. నాలుగో పర్యాయం కూడా విజయం సాధించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడం రామచంద్రారెడ్డికి ప్లస్ పాయింట్. 


 నగరి నియోజకవర్గానికి నుంచి ఎట్టికేలకు మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె మూడవ సారి అదృష్టాన్ని నగరి నుండి పరీక్షించుకోనున్నారు. ఒక దశలో రోజాకు టిక్కెట్ రాదన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. స్థానికంగా వ్యతిరేకత ఉన్నా, అక్కడ బలమైన మరో అభ్యర్థి లేకపోవడం రోజాకు కలిసివచ్చింది.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి మరో మారు మంత్రి నారాయణస్వామి ఎన్నికల బరిలో దిగనున్నారు. ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి వర్గం నారాయణస్వామిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఆయన కుమార్తె కృపాలక్ష్మి, కుతూహలమ్మ కొడుకు హరికృష్ణ, అక్క కొడుకు రాజేష్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం నారాయణస్వామి వైపు ముగ్గు చూపినట్లు సమాచారం.

తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ రెడ్డి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయన తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా పని చేస్తున్నారు. ఆయన తండ్రి టిటిడి చైర్మన్ గా కొనసాగుతున్నారు. కరుణాకర్ రెడ్డి రాజకీయ వారసుడిగా అభినయ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు.


చంద్రగిరి నుండి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారసుడుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. మోహిత్ రెడ్డి తుడా చైర్మన్ గా పనిచేస్తున్నారు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సేవలను పార్టీ పరంగా ఉపయోగించుకోనున్నారు. ముఖ్యమంత్రికి చెవిరెడ్డి నమ్మినబంటు.

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానంద రెడ్డి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులును కొనసాగించాలని మొదట భావించినప్పటికీ, తర్వాత అధిష్టానం  విజయానంద రెడ్డి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. విజయనంద రెడ్డికి ఉన్న ఆర్థిక బలం, అంగ బలం దృష్ట్యా ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి ఈ పర్యాయం ఎమ్మెల్సీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ ఎన్నికల గోదాలోకి దిగనున్నారు. ఆయన పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా  ప్రకటించారు. ఆయన విజయం సాధిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని కుప్పం ప్రజలకు హామీ ఇచ్చారు. ఈయన బిసి వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన వారు.


పలమనేరు నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే వెంకటే గౌడను తిరిగి కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆయన మీద ఆరోపణలు ఉన్నా, అక్కడ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడం, వెంకటే గౌడ ఆర్థిక పరిపుష్టి కలిగి ఉండడంతో ఆయనను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన మాజీ మంత్రి అమర్నాథ రెడ్డితో మరో తలపడనున్నారు.


మదనపల్లి నుంచి కొత్త అభ్యర్థిని అధిష్టానం రంగంలోకి దించుతున్నారు. పంచాయతీరాజ్ విభాగంలో డిఇగా పని చేసిన నిషార్ అహమ్మద్ కు టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఆయనకు గత రెండు పర్యాయాలు టిక్కెట్టు వచ్చినట్లే వచ్చి చేజారింది. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే నవాజ్ భాషా, మాజీ MLA దేశాయి తిప్పారెడ్డిని కాదని నిషార్ అహమ్మద్ ను  తీసుకువచ్చారు.


తంబళ్లపల్లె నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకనాథరెడ్డి మరో మారు పోటీ చేయనున్నారు. ఆయనను  మార్చుతారని అనుకున్నా, అక్కడ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో ద్వారకనాథరెడ్డిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్కడ కూడా దేశం పార్టీకి బలమైన నాయకత్యం లేకపోవడం ద్వారక నాధరెడ్డికి ప్లస్ కావచ్చు.

పీలేరు నియోజక వర్గానికి చింతల రామచంద్రారెడ్డి పేరు ఖరారు అయింది. ఆయన మరో మారు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఆయన ఎన్నికల బరిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని ఎదుర్కొనున్నారు. తొలుత చింతల స్థానంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను పోటికి దించుతారని ప్రచారం జరిగింది.


శ్రీకాళహస్తి నుంచి మరోమారు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎన్నికల గోదాలోకి దిగనున్నారు. ఆయనను మార్పు చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే అక్కడ సరైన అభ్యర్థి లేకపోవడంతో అధిష్టానం బియ్యపు మధుసూదన్ రెడ్డి పట్ల మొగ్గు చూపినట్లు సమాచారం. అయన ముఖ్యమంత్రికి సన్నిహితుడు.

సత్యవేడు నియోజకవర్గం నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం పట్ల వ్యతిరేకత ఉండటంతో గురుమూర్తిని రంగంలోకి దించారని తెలిసింది. గురుమూర్తి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. డాక్టర్ గా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం తిరుపతి MPగా ఉన్నారు.


పూతలపట్టు నియోజకవర్గం నుంచి అందరూ ఊహించినట్లు గానే ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబును అధిష్టానం పక్కన పెట్టింది. ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ ని తెరపైకి తీసుకువచ్చింది. సునీల్ గతంలో పూతలపట్టు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెస్ బాబు మీద పలు ఆరోపణలు, విమర్శలు ఉన్న కారణంగా ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ జాబితా కూడా 100 శాతం కరెక్ట్ కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇందులో కుప్పం, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి, తంబళ్లపల్లి, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాల నుంచి మార్పు ఉండదని తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాలలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉండవచ్చునని  ఊహిస్తున్నారు. ఇదే తుది జాబితా అయ్యే అవకాశాలు కూడా లేక పోలేదు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *