28, డిసెంబర్ 2023, గురువారం

పెద్దిరెడ్డి పార్లమెంటుకు - మిధున్ రెడ్డి పీలేరుకు ... !?

పుంగనూరుకు సుధీర్ రెడ్డి
తంబళ్ళపల్లికి ద్వారకనాధ రెడ్డి 
పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్యాక్ 


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పుంగనూరు, పీలేరు, రాజంపేట పార్లమెంట్   రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. ఈ పర్యాయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సుముఖంగా లేరని సమాచారం. ఆయన కొడుకు మిథున్ రెడ్డి పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయించాలన్న ప్రయత్నం జరుగుతుంది. అలాగే పుంగనూరు నియోజకవర్గంలో నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోటిలో నిలుపాలని  ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకనాథరెడ్డిని మరో మారు పోటీ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పర్యాయం రాజంపేట పార్లమెంటు నుండి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అలా కుదరని పక్షంలో రాజ్యసభకు వెళ్లడానికి ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం.

పీలేరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడుసార్లు విజయం సాధించారు 1989, 1999, 2004 సంవత్సరాలలో అక్కడనుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. పుంగనూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కూడా పుంగనూరు నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన పుంగనూరు నుండి 2009, 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, రెండుసార్లు వైసిపి అభ్యర్థిగా గెలుపొందారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి పార్లమెంటుకు పోటి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డిని ఓడించడానికి  దీటైన అభ్యర్థిగా రామచంద్రారెడ్డి అయితే బాగుంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ తరఫున రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు. ఈ ఎన్నికలలో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలనేది కూడా మిథున్ రెడ్డి సలహా మీదనే ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో, అభ్యర్థులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత మిథున్ రెడ్డి వద్దకు పంపుతున్నారు. ఆయన ఈసారి పీలేరుకు పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చింతల రామచంద్రారెడ్డి పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. కిషోర్ కుమార్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడానికి మిథున్ రెడ్డి అయితే ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే మిథున్ రెడ్డి పార్లమెంటుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

పెద్దిరెడ్డి కుటుంబం నుంచి తమ్ముడు ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆయనను మరోసారి అక్కడనుండి పోటీ చేయించాలని చూస్తున్నట్లు సమాచారం. అలాగే పుంగనూరు నుంచి కొత్తగా మరో తమ్ముడు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని రంగంలోకి దించనున్నట్లు సమాచారం. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీకి బలమైన పునాదులు వేయడంతో సుధీర్ రెడ్డి గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెద్దిరెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఆమోద ముద్ర వేస్తారో, ఈ ఫ్యామిలీ ప్యాక్ ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాల్సిందే.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *