19, డిసెంబర్ 2023, మంగళవారం

ఇన్చార్జిలు మాత్రమే - అభ్యర్థులు కాదు !?



చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఇంచార్జిలకు చుక్కేదురవుతోంది. ఇప్పటి వరకు తమను తాము అభ్యర్థులుగా ప్రకటించుకున్నారు. పోటికి సిద్దం అయ్యారు. ఇందుకు అవసరమైన వనరులను కూడా సమకూర్చుకుంటున్నారు. గెలిచినా, ఓడినా నియిజకవర్గంలో తిరుగు ఉండదని ఆశపడ్డారు. గెలిస్తే MLA అవుతారు. ఓడినా, పార్టీ అధికారంలోకి వస్తే ఇన్చార్జిగా ఉంటారు. MLAతో సమానంగా అధికారాలు చేలాయించవచ్చు. అధినేత దయదలస్తే, నామినేటెడ్ పదవి వరిస్తుందని కలలు కన్నారు. వారి ఆశల మీద చంద్రబాబు చన్నీళ్ళు చల్లారు. నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరు మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనుకున్న విధంగా ఇన్చార్జిలు పనిచేయడంలేదని వారితోనే అన్నట్లు సమాచారం.


 చిత్తూరు పార్లమెంటు పరిధిలో టిడిపి టిక్కెట్ల లొల్లి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్న ఏడు స్థానాలలో చిత్తూరు మినహా మిగిలిన ఆరు స్థానాలలో పార్టీ ఇంచార్జిలు ఉన్నారు. వీరంతా తమను తాము ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించుకున్నారు. అయితే కుప్పంలో చంద్రబాబు, పలమనేరు నియోజక వర్గంలో అమరనాద రెడ్డికి తప్ప మిగిలిన వారికి టిక్కెట్ వచ్చే అవకాశం లేదంటున్నారు. ఈ విషయం ఇటీవల చెన్నై విమానాశ్రయంలో  తనను కలిసిన నేతలకు చంద్రబాబు సూచన ప్రాయంగా చెప్పారని తెలిసింది. ఆయనను జి డి నెల్లూరు ఇంచార్జి డాక్టర్ థామస్, నగరి ఇంచార్జి గాలి భాను ప్రకాష్, పులివర్తి నాని ఇతర నాయకులు కలిశారు. వారితో మాట్లాడుతూ చంద్రబాబు, మూడు నియోజక వర్గాలలో పార్టీ 20 శాతం కూడా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పూతలపట్టు, చిత్తూరు నియోజక వర్గాల పట్ల ఆయన పెదవి విరిచారని అంటున్నారు. ఇటీవల లోకేష్ టీమ్ చేసిన సర్వేలో కూడా ఇదే అంశాలు వెల్లడి అయ్యాయని సమాచారం. ఈ నేపథ్యంలో  ఐదు నియోజక వర్గాలలో కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. 


చిత్తూరులో తిరిగి మాజీ ఎమ్మెల్యే సి కె బాబును తీసుకుని రావాలని ఒక వర్గం ప్రయత్నం చేస్తున్నది. లాగే కాజూరు బాలాజీ, కటారి హేమలత, గురుజాల జగన్మోహన్ నాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. పూతలపట్టులో ఇంచార్జి డాక్టర్ మురళితో పాటు డాక్టర్ సప్తగిరి ప్రసాద్, పుష్పరాజ్ పేర్లు పరిశీలిస్తున్నారు. జి డి నెల్లూరులో థామస్ కంటే పాలసముద్రం రాజేంద్ర, గ్యాస్ రవి మేలంటున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ ను పోటీ పెడితే మంచిదన్న వాదన బలంగా వినిపిస్తోంది. 


చంద్రగిరిలో పులివర్తి నానితో పాటు మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుమారుడు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దేవ నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామనాయుడు మనవడు ఇందుశేఖర్ పేరు తెరపైకి వచ్చాయి. నగరిలో ఇంచార్జి గాలి భాను ప్రకాష్ ను సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, సిద్దార్థ విద్యా సంస్థల అధినేత అశోక్ రాజు పేర్లు పరిశీలిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *