మారుతున్న మదనపల్లి వైసీపీ రాజకీయం
మదనపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోక్ రాజకీయం శరవేగంగా మారుతుంది. కొత్త అభ్యర్థులు రంగంలోకి వస్తున్నారు. ఇప్పటివరకు శాసనసభ్యుడిగా ఉన్న నవాజ్ అహమ్మద్ కు టికెట్ రాదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎమ్మెస్ దేశాయ్ తిప్పారెడ్డి, వైసీపీ యువజన నాయకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి, ముస్లిం నాయకుడు నిషార్ అహమ్మద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అభ్యర్థుల ఖరారు విషయమై అధికారిక సమాచారం ఏది బయటికి పొక్క లేదు. అంతర్గతంగా ఈ మూడు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసిపి ఏర్పడినప్పటి నుండి మదనపల్లి నియోజకవర్గంలో జరిగిన రెండు ఎన్నికలలో వైసిపి అభ్యర్థులే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో దేశాయి తిప్పారెడ్డి, 2019 ఎన్నికల్లో మహమ్మద్ నవాజ్ భాషలు ఎన్నికయ్యారు. ఈ పర్యాయం నవాజ్ భాషను మార్చనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దేశాయి తిప్పారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందగా, మరోసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. మంచి పేరున్న వైద్యులు. నియోజకవర్గంలో నిస్వార్థపరుడు, నిజాయితీపరుడుగా పేరు ఉంది. మొదటినుంచి వైసిపి పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నారు.
వైసిపి యువజన నాయకుడు మల్లెల పవన్ కుమార్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయన పదవులుఆశించకుండా పేదల సేవలే పరమార్థంగా పనిచేస్తున్నారు. జగన్ కు అండగా నిలుస్తున్నారు. ఇటీవల నాలుగు వేల మంది ఆటో డ్రైవర్లకు ఉచితంగా యూనిఫారం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు చీరలు కూడా పంపిణి చేశారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు.
మదనపల్లిలో పంచాయతీరాజ్ ఇంజనీర్ గా పనిచేసిన నిషార్ అహమ్మద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన పేరు దాదాపుగా ఖరారు అయినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. గత రెండు ఎన్నికల్లో కూడా ఆయన టిక్కెట్ నాశించారు. టికెట్టు వచ్చినట్టే వచ్చి చేజారడంతో నిరాశ చెందారు. ఈసారి ఎలాగైనా టికెట్ను దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో ఒక స్థానాన్ని ముస్లిం మైనారిటీలకు కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. గత ఎన్నికల్లో నవాజ్ అహమ్మద్ కు ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూడా జనాభా ఎక్కువగా ఉన్న మదనపల్లిను ముస్లింలకు కేటాయించవచ్చని భావిస్తున్నారు. అలా జరిగితే నిషార్ అహమ్మద్ పేరు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.