పూతలపట్టు టిక్కెట్టు రేసులో పూర్ణం
పూతలపట్టు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తేంపల్లి పూర్ణం టికెట్ ని ఆశిస్తున్నారు. ఆయన కమర్షియల్ టాక్స్ విభాగం చిత్తూరులో విధులను నిర్వహిస్తున్నారు. తవణంపల్లి మండలం పైమాఘానికి చెందిన తేంపల్లి పూర్ణం నియోజకవర్గంలో అందరికీ చిరపరిచితుడు. ఆయన కుటుంబం తొలినుంచి కాంగ్రెస్ పార్టీకి అనంతరం వైయస్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ వస్తున్నారు. పూర్ణం తల్లిదండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు. వీరు ఏడుగురు అన్నదమ్ములు, 51 మంది కుటుంబ సభ్యలతో కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండటం విశేషం.
వాక్చాతుర్యము, సమాజసేవ, నాయకత్వ లక్షణాలు ఉన్న పూర్ణం ప్రస్తుతo కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ చిత్తూరు జిల్లా ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కుటుంబం మొత్తం విద్యావంతులు. తొలి నుండి కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర్ రెడ్డికి, ప్రస్తుతం జగన్, పెద్దిరెడ్డి కుటుంబానికి విధేయులుగా ఉంటున్నారు. వీరి కుటుంబ సభ్యులు గతంలో అరగొండ సర్పంచ్ లుగా కూడా పనిచేశారు. తమిళ మాల సామాజిక వర్గానికి చెందిన పూర్ణo, వైసిపి తరఫున 2013- 14 పూతలపట్టు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా కూడా పనిచేశారు. 18 నెలల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టి పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు.
ఆయనకు కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి, బంధు వర్గం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయనకు బి ఫారం కూడా అందజేశారు. అయితే వైసిపి విధానాలను నరనరాన జీర్ణించుకున్న పూర్ణ ఆ పార్టీ నుంచి పోటీ చేయలేదు. ఈ పర్యాయం పూతలపట్టు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, నారాయణస్వామిలను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. వారు కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుడైన తనకు టిక్కేట్ ఇస్తే నియోజకవర్గంలో గెలిచి పార్టీని పటిష్టం చేస్తానని పూర్ణం "చిత్తూరు న్యూస్" ప్రతినిధితో అన్నారు.