జిల్లాలో 7 మంది ఇంచార్జిలకు టిక్కెట్లు హుళక్కేనా?
మూడు నియోజకవర్గాలలో పాతవారే
ఏడునియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులు
త్వరలో ఇన్చార్జిల మార్పుకు కసరత్తు
నిబంధనల మేరకే టిక్కెట్ల కేటాయింపు
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో సుమారు ఏడు మంది కొత్త అభ్యర్థులు తెర మీదికి రానున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న ఇన్చార్జిలలో సగం మందికి టిక్కెట్లు నమ్మకం లేదని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో నియోజకవర్గ ఇంచార్జిలను కూడా మార్పు చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. జిల్లాలో ఎక్కువగా యువతకు, పోరాట పటిమఉన్న వాళ్లకు, రెడ్ల సామాజిక వర్గానికి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తోంది. గతంలో లాగా ఒత్తిళ్లకు, మొహమాటానికి పోకుండా గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇందుకు రాబిన్ శర్మ టీం సర్వేతో పాటు మరో రెండు సంస్థలకు కూడా సర్వే బాధ్యతలను అప్పగించారు. ఈ బృందాలు జిల్లాలో సర్వేలను నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబు, పలమనేరు నుంచి అమర్నాథరెడ్డి, పీలేరు నుంచి కిషోర్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన వాళ్లకు టిక్కెట్లు డౌట్ అని అంటున్నారు. పార్టీ కొన్ని నిర్దిష్టమైన గైడ్ లైన్స్ పెట్టుకుని పార్టీ అభ్యర్థుల ఖరారు చేయనున్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలో క్రమంగా తెలుగుదేశం పార్టీ తన పట్టును కోల్పోతుంది. కావున ఈ పర్యాయం పట్టు నిలబెట్టుకోవడానికి చంద్రబాబు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
చంద్రబాబుకు బహుశా ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. ఆయన శాసనసభలో చేసినా సవాలును నిజం చేస్తూ ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగు పెట్టాలంటే జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకనగుణంగా జిల్లాలో అన్వేషణ కొనసాగుతోంది. తెలంగాణా ఎన్నికల ఫలితాలను బట్టి ఇక్కడ అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తారు. అక్కడ కొత్త వారు ఎక్కువగా విజయం సాధించారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం వారు 43 మంది గెలిచారు. ఇందులో కాంగ్రెస్ లో 26 మంది, బి ఆర్ ఎస్ లో 14 మంది, బిజెపిలో ముగ్గురు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నలుగురు గెలవగా, కాపు ఒకరు కూడా గెలవలేదు. జనసేన పోటీ చేసిన ఎనిమిది చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.
పునర్విభజన తరువాత చిత్తూరు జిల్లాలో 11 జనరల్, మూడు ఎస్సీ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇందులో ఆరు నియోజక వర్గాలలో టిడిపి మూడు సార్లు ఓడి పోయింది. రెడ్లు ఎక్కువ మంది గెలిచారు. 2009లో ఆరుగురు రెడ్లు, ముగ్గురు కమ్మ, బలిజ, ముస్లిం ఒక్కొక్కరు విజయం సాధించారు. 2014 లో ఏడుగురు రెడ్లు, ఇద్దరు బలిజ, కమ్మ, బిసి ఒకరు చొప్పున గెలుపు సాధించారు. 2019 లో ఏడుగురు రెడ్లు, కమ్మ, బలిజ, బిసి,ముస్లిం ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు అయ్యారు. టిడిపి అభ్యర్థులు 2009, 2014లో నలుగురు గెలవగా , 2019 లో చంద్రబాబు ఒకరే విజయం సాధించారు. ఇక మూడు ఎస్సీ నియోజక వర్గాలలో సత్యవేడులో రెండు సార్లు టిడిపి అభ్యర్థులు గెలవగా, జి డి నెల్లూరు, పూతలపట్టులో వరుస ఓటమి చవిచూశారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజక వర్గాలలో కొత్త వారు, రెడ్డి సామాజిక వర్గం వారికి ఎక్కువగా టిక్కెట్లు ఇవ్వనున్నారు. అలాగే గత ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టుపై వరుసగా రెండు సార్లు ఓడిపోయిన వారు, గత ఎన్నికల్లో 10 వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయిన వారికి టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు, పలమనేరులో అమరనాద రెడ్డి, పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డిలు పోటీ చేస్తారు. మిగిలిన చోట్ల ఇద్దరు, ముగ్గురి పేర్లు పరిశీలిస్తున్నారు. చిత్తూరు నియోజక వర్గంలో సి కె బాబు, కాజూరు బాలాజీ, కటారి హేమలత పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పుంగనూరులో చల్లా రామచంద్రా రెడ్డి, ఎన్ అనీషా రెడ్డి సోమల సురేష్ లలో ఒకరికి టిక్కెట్టు రావచ్చు.
మదనపల్లెలో దొమ్మల పాటి రమేష్, షాజహాన్ బాషా, శ్రీరామ్ చినబాబు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తంబళ్లపల్లెలో జి శంకర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, పర్వీన్ తాజ్, చంద్రగిరిలో పులివర్తి నాని, మబ్బు దేవ నారాయణ రెడ్డిలో ఒకరికి టిక్కెట్టు రావచ్చు. తిరుపతిలో సుగుణమ్మ, సూరా సుధాకర్ రెడ్డి, నరసింహ యాదవ్, శ్రీకాళహస్తిలో సుధీర్ రెడ్డి, ఎస్ సి వి నాయుడు పేర్లు పరిశీలిస్తున్నారు. సత్యవేడులో హెలెన్, జేడి రాజశేఖర్ లేదా ఆయన కుమార్తె మౌనిక, డాక్టర్ చందనలో ఒకరిని టిక్కెట్టు వరించవచ్చు. నగరిలో గాలి భాను ప్రకాష్, డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి లేదా ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డిలో ఒకరికి రావచ్చు. జి డి నెల్లూరులో థామస్ తో పాటు రాజేంద్ర, గ్యాస్ రవి పేర్లు పరిశీలిస్తున్నారు. పూతలపట్టు నియోజక వర్గంలో డాక్టర్ మురళి మోహన్ తో పాటు డాక్టర్ సప్తగిరి ప్రసాద్, ఆనగల్లు మునిరత్నం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే జనసేనకు తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, గంగాధర నెల్లూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో రెండు లేక మూడు స్థానాలు కేటాయించవచ్చు.