22, డిసెంబర్ 2023, శుక్రవారం

టిడిపి టికెట్లపై బిసి నేతల ఆశలు !


బడుగు, బలహీన వర్గాల ఆత్మ గౌరవం నుండి పుట్టిన తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బిసి నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ సారి ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇస్తే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం. లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయవంతం కావడంతో గెలుపుపై నమ్మకం బలపడింది. ఈ నేపథ్యంలో పార్టీకి వెన్నెముక లాంటి బీసీలకు ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ మంది బీసీలకు అవకాశాలు కల్పిస్తే మంచిదని భావిస్తున్నారు. ఆమేరకు చంద్రబాబుతో కలిసినపుడు తన అభిప్రాయం చెప్పినట్టు తెలిసింది. చంద్రబాబు కూడా అదే ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  ఆరు చోట్ల బీసీల పేర్లు తెరపైకి వచ్చాయని అంటున్నారు. ఉన్న 14 స్థానాలలో మూడు స్థానాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేశారు. మిగిలిన 11 లో బీసీలకు ఆరు స్థానాలు కేటాయించాలని ఆ వర్గం నేతలు పట్టు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో టిడిపికి తిరుగులేని మద్దతు ఇస్తున్న యాదవ సామాజిక వర్గం నుంచి ఇద్దరు నేతలు టికెట్టు రేసులో ఉన్నారు. తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ ఈ సారి ఎలాగైనా తిరుపతి టికెట్టు సాధించాలని పట్టు పడుతున్నారు. ఒక వేళ ఇక్కడ వీలు కాకుంటే చంద్రగిరి అయినా పరవా లేదన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు. గతంలో తుడ అధ్యక్షునిగా ఉన్నారు. ఇప్పుడు పార్లమెంటు అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు. ఇక అదే సామాజిక వర్గానికి చెందిన జి శంకర్ కు తంబళ్లపల్లె స్థానం ఖాయం అంటున్నారు. ఆయన గత ఎన్నికల్లో  టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్నారు.

కాగా వన్నె రెడ్డి సామాజిక వర్గం నేతలు కూడా రెండు స్థానాలు ఆశిస్తున్నారు.  తమ సామాజిక వర్గానికి చెందిన భరత్, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంకు వైసిపి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది. కుప్పంలో ఆ వర్గీయుల ఓట్లు గణనీయంగా ఉన్నందున చంద్రబాబుపై పోటీ చేయడానికి భరత్ ను రంగంలోకి దింపుతారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవా రెడ్డి శ్రీకాళహస్తి స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తమ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయని తనకు టికెట్టు ఇస్తే గెలిచి చూపిస్తానని అంటున్నారు. ఆయనకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు. కాగా అదే సామాజిక వర్గానికి చెందిన తిరుచానూరు మాజీ సర్పంచ్ CR రాజన్ ఇటీవల పార్టీలో చేరారు. ఆయన చిత్తూరు టికెట్టు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ కమ్మ లేదా బలిజ సామాజిక వర్గానికి టికెట్టు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. దీనితో ఆయన పేరు చంద్రగిరి నియోజకవర్గం జాబితాలో చేరింది. అక్కడ ఆయన స్థానికుడు కావడం పైగా వారి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం వల్ల అవకాశం ఇస్తే మంచిదని ఒక వర్గం భావిస్తున్నది.

మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం  స్థానం కోసం సిద్దార్థ విద్యా సంస్థల అధిపతి  అశోక రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన ఆయన గతంలో కూడా టికెట్టు కోసం ప్రయత్నించారు. ఆ సామాజిక వర్గం వారికి టికెట్టు ఇస్తే దీని ప్రభావం సత్యవేడు, జి డి నెల్లూరు నియోజక వర్గాలలో కలసి వస్తుందని భావిస్తున్నారు.

మదనపల్లె నియోజకవర్గంలో పోటీ చేయాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆసక్తి చూపుతున్నారు. అయన తోగట, పద్మశాలి కులానికి చెందిన వారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఉత్తేజ పరుస్తూ పార్టీకి సేవలు అందిస్తున్నారు. సాధారణంగా ప్రతి పార్టీ తమ యువజన విభాగం అధ్యక్షునికి టికెట్టు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. పైగా అక్కడ బీసీల ఓట్లు అధికంగా ఉన్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *