తిరుపతిలో వారసత్వ రాజకీయాలు రాణించవా?
తిరుపతి రాజకీయాలు విలక్షణంగా ఉంటాయి. ఇక్కడ ఒక కుటుంబం కూడా రాజకీయ కుటుంబంగా నిలబడలేదు. ఇక్కడ వారసులకు రాజకీయాలు అచ్చిరావు అన్న సెంటిమెంటు బలంగా వినిపిస్తున్నది. తిరుపతి నియిజకవర్గం పరిధిలోనే తిరుమల కూడా వస్తుంది. తిరుపతి నుండి గెలుపొందిన వారికి కొన్ని సౌకర్యాలు ఉంటాయి. దేవస్థానం తరపున టిక్కెట్ల కేటాయింపు, ఇతర ఆలయ మర్యాదలు ఉంటాయి. వీటిని స్వార్థానికి వాడుకున్నా, ఇందులో అవినీతికి పాల్పడినా, స్వామి చూస్తూ ఊరుకోరని భక్తుల విశ్వాసం. అధికార పార్టీ MLA అయితే దేవస్థానం పాలకమండలిలో సభ్యులు కూడా కావచ్చు. ఇలా అయిన వారు అధికార దుర్వినియోగం చేసినా, అవినీతికి పాల్పడినా, మళ్ళి రాజకీయ భవిష్యత్తు ఉండదని అంటారు. TTD చైర్మన్, పాలకమండలి సభ్యులుగా పనిచేసిన పలువురు తరువాత రాజకీయంగా తెర మరుగయ్యారు. రాణించిన వారు చాలా అరుదు. దేవుని సొమ్ము అశించని వారికీ మాత్రమే భవిష్యత్తు ఉంటుందని భక్తులు నమ్ముతారు.
ఒక నాయకుడు కూడా తిరుపతి నుండి రెండు సార్లుకు మించి గెలవలేదు. వారసత్వ రాజకీయాలకు ఇక్కడ తావు లేదు. ఒక ఎమ్మెల్యే కొడుకు లేదా వారసులు ఎవరు ఇంతవరకు గెలవలేదు. వెంకట్రమణ భార్య సుగుణమ్మ ఒకరు మాత్రం భర్త చనిపోవడం వల్ల గెలిచారు. తరువాత ఓడిపోయారు. ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు. అలాగే సుగుణమ్మ మళ్ళీ టిక్కెట్టు ఆశిస్తున్నారు.
1952 లో ఇక్కడ ఎమ్మెల్యే అయిన కె వరదా చారి తరువాత ఒక సారి కూడా ఇక్కడ తిరిగి పోటీ చేసి గెలవలేదు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన కె ప్రమీలమ్మ 2019 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. 1955, 1962 లో ఎమ్మెల్యే అయిన రెడ్డివారి నాధముని రెడ్డి వారసులు ఎవరు తిరుపతి నుంచి ఎమ్మెల్యే కాలేదు. ఆయన కుమారుడు రాజశేఖర్ రెడ్డి 1983 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 1999లో పుత్తూరు నుంచి గెలిచారు. 1983లో ఎమ్మెల్యే అయిన ఎన్టీయార్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో గెలిచిన కత్తుల శ్యామల కుటుంబం మళ్ళీ కనిపించలేదు.
1967, 1978లో ఎమ్మెల్యే అయిన అగరాల ఈశ్వర రెడ్డి, 1972లో గెలిచిన విజయ శిఖామణి వారసులు ఎవరు రాజకీయాలలో లేరు.1985,1989 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మబ్బు రామి రెడ్డి వారసులు ఎవరు ఎమ్మెల్యే కాలేక పోయారు.ఆయన కుమారుడు దేవ నారాయణ రెడ్డి ప్రస్తుతం టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఉన్నారు. తిరుపతి లేదా చంద్రగిరి టిక్కెట్టు ఆశిస్తున్నారు. 1994లో ఎమ్మెల్యే అయిన ఏ మోహన్ తరువాత రాణించలేక పోయారు. 1999లో గెలిచిన చదలవాడ కృష్ణమూర్తి 2019లో పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు. 2004, 2014లో ఎమ్మెల్యే అయిన వెంకట్రమణ భార్య సుగుణమ్మ ఆయన మరణం వల్ల 2015లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2009 లో ఎమ్మెల్యే అయిన చిరంజీవి రాజీనామా చేయడంతో 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. తరువాత 2014లో ఓడినా, 2019లో ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి వైసిపి అభ్యర్థిగా పోటీ ఖాయం అని తెలుస్తోంది. అలాగే సుగుణమ్మ టిడిపి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న సెంటిమెంట్టి కొనసాగు తిందా ? లేక బ్రేక్ పడుతుందా ? అనేది తేలాలి అంటే ఎన్నికల వరకు ఆగాలి.