మారుతున్న సత్యవేడు టిడిపి రాజకీయం
సత్యవేడు వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెదేపాలో చేరడం ఖరారు అయ్యింది. దీంతో సత్యవేడు తెదేపా రాజకీయం వేడెక్కింది. ఇప్పటి వరకు సత్యవేడు టిక్కెటు రేసుల్లో నియోజకవర్గ ఇంచార్జి హెలన్ హేమలత, జేడీ రాజశేఖర్ తో పాటు ఆయన కుమార్తె, రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి మౌనిక, తిరుపతిలో డెంటిస్ట్ గా ఉన్న డాక్టర్ పి చందన స్రవంతి పేరు పరిశీలనలో ఉన్నాయి. అదిమూలం తెదేపాలో చెరనుండటంతో పార్టీ టిక్కెట్టు ఎవరిని వరిస్తుందన్న ఉత్కంట నెలకోంది. ఆదిమూలం MLA టిక్కెట్టును ఆశించి పార్టీలో చేరుతున్నారు. మంగళవారం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిక, టిక్కెట్టు విషయమై చర్చ జరిగినట్లు సమాచారం.
టిడిపికి కంచుకోట అయిన ఎస్సీ రిజర్వు నియోజక వర్గం సత్యవేడులో విజయం సాధించడానికి ఆదిమూలం చేరిక ఉపయోగపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్ది ఎంపిక చేయడానికి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇంచార్జి గా ఉన్న జేడీ రాజశేఖర్ ను రెండేళ్ల క్రితం తొలగించి మాజీ ఎమ్మెల్యే హేమలతకు బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజులకే ఆమె బదులు ఆమె కుమార్తె హెలెన్ ను ఇంచార్జి గా నియమించారు. అయితే చెన్నైలో ఉన్న ఆమె అనుకున్న రీతిలో పనిచేయడం లేదని, ఆమె సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉన్నాయని, ఆమెను నమ్ముకుంటే నష్ట పోతామని కొందరు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పైగా జేడీ రాజశేఖర్ సమాంతరంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. దీనితో అభ్యర్ధి ఎంపిక విషయంలో చంద్రబాబు మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిమూలం పార్టీలో చేరనుండటంతో సత్యవేడు రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి.
ఆదిమూలం గతంతో తెదేపాలో ఉన్నారు. పార్టీ తరపున ZPTCగా ఎన్నికయ్యారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా తెదేపా అభ్యర్థి తలారి ఆదిత్య చేతిలో ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి జెడి రాజశేఖర్ మీద గెలుపొందారు. అయన కుమారుడు సుమన్ నారాయణవనం ZPTCగా ఉన్నారు.