21న పిసిసి నూతన అధ్యక్షురాలిగా షర్మిల భాద్యతల స్వీకరణ
నూతన పిసిసి అధ్యక్షురాలుగా నియమితులైన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాలపట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వై ఎస్ షర్మిల ఈనెల 21వ తేదీన నూతన బాధ్యతలను చేపట్టమున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి పార్టీ సీనియర్ నేతలు మాణిక్యం ఠాగూర్, మయప్పన్ పాటు ఏపీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు కూడా హాజరుకానున్నారు ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చకచకా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలోనే కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంగళగిరి శాసనసభ్యులు ఆల్ల రామకృష్ణారెడ్డి తన ప్రయాణం వైఎస్ షర్మిల తోనే అని బహిరంగంగా ప్రకటించారు. కావున ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో చతికిలబడిన కాంగ్రెస్ పార్టీని తిరిగిపూర్వవైభవానికి తీసుకురావడానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర నూతన పిసిసి అధ్యక్షురాలుగా నియమించింది. ఈ మేరకు ఢిల్లీ హైకామెంట్ రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. ఆమె తెలంగాణలో స్థాపించిన తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, నాలుగో తారీఖున కాంగ్రెస్ పార్టీలో లాంచనంగా చేరారు. తర్వాత ఆమెను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణం ఈ ఈ ఆదేశాలు అమలులోకి వస్తుందని పేర్కొంది.
పిసిసి నూతన అధ్యక్షురాలుగా నియమితులైన వైయస్ షర్మిల సామాజిక మాధ్యమంలో తన మనోభావాలను పంచుకుంటూ తనకు అధ్యక్ష బాధ్యతను అప్పగించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్ లకు ధన్యవాదాలు తెలిపారు. తాను పూర్తి నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. పార్టీ పునర్ నిర్మాణానికితన వంతు పనిచేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని, వారి మద్దతుతో, వారి మనోభావాలకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దుతానన్నారు. రాష్ట్రంలోని సీనియర్ నాయకుల అనుభవాలు, నైపుణ్యాలను మేళవించి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికలలో పార్టీని విజయపథం వైపు నడిపి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యంగా వర్ణించారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కలను ఆయన బిడ్డగా సాకారం చేయడానికి చాయశక్తుల కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని ధీమాను వైయస్ షర్మిల వ్యక్తం చేశారు.