గాలి చంద్రగిరికి - 'పులి' చిత్తూరుకు ?
జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు
తెదేపాలో కూడా అభ్యర్థుల బదిలీకి అవకాశాలు
వ్యతిరేకత ఉన్న వారికీ బదిలీ ఫార్ముల అమలు
అభ్యర్థులను వదులుకోకుండా సర్దుబాలు ఫార్ముల
చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాలలో టిడిపి వైసిపి ఫార్ములాను అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వంత నియోజక వర్గాలలో వ్యతిరేకత ఉన్న వారిని వైసిపి మరొక చోటికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ సిఎం నారాయణ స్వామికి జి డి నెల్లూరు టికెట్టు కాదని చిత్తూరు లోక్ సభ స్థానం కేటాయించారు. లోక్ సభ సభుడు ఎన్ రెడ్డెప్పను జి డి నెల్లూరు ఎమ్మెల్యేగా బరిలో దింపుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల అదే ఫార్ములా అమలు చేశారు.
ఈ నేపథ్యంలో టిడిపి అధిష్టానం నగరి ఇంచార్జి గాలి భాను ప్రకాష్ కు చంద్రగిరి, చంద్రగిరి ఇంచార్జి పులివర్తి నానికి చిత్తూరు టికెట్టు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెుస్తోంది. 2009 లో నగరి నుంచి టిడిపి తికెట్టుపై గాలి ముద్దుకృష్ణమ నాయుడు కాంగ్రెస్ అభ్యర్ధి రెడ్డివారి చెంగా రెడ్డిపై 1308 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే ఆయన 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆర్ కె రోజా చేతిలో 858 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 లో ఆయన కుమారుడు గాలి భాను ప్రకాష్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి రోజా చేతిలో 2708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయనకు తన తల్లి, మాజీ ఎమ్మెల్సీ సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు ఓడించడానికి సిద్దంగా ఉన్నారు. అలాగే నియోజక వర్గంలో ఉన్న సీనియర్ నాయకులు గందమనేని రమేష్ చంద్ర ప్రసాద్, ఎ ఎం రాధాకృష్ణ, పాకా రాజా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గాలి భాను ప్రకాష్ ను చంద్రగిరి పంపాలని భావిస్తున్నారు. ఆయన స్వంత మండలం రామచంద్రా పురం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నందున ఆయన అక్కడ స్థానికుడు అవుతారు.
కాగా చంద్రగిరి ఇంచార్జి పులివర్తి నానిని చిత్తూరు అభ్యర్థిగా రంగంలోకి దించలాన్న ఆలోచన ఉంది. ఆయన చిత్తూరులో కాపురం ఉన్నారు. తొలి నుంచీ చిత్తూరు సీటును ఆశిస్తున్నారు. పైగా ఆయన పట్ల చంద్రగిరిలో ఒక వర్గం వ్యతిరేకంగా ఉంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ కుమారి ఇక్కడ టిడిపి అభ్యర్థి రోజాపై 10,980 ఓట్ల ఆధిక్యత సాధించారు. 2014 లో అరుణ కుమారి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 4,518 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 లో టిడిపి అభ్యర్థి పులివర్తి నాని చెవిరెడ్డి చేతిలో 41,755 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. దీనితో ఆయనను అక్కడి నుంచి మార్చడమే మంచిది అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా నగరికి టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కుమారుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు. చంద్రగిరి అయినా తాను పోటీకి సిద్దంగా ఉన్నానని హర్ష వర్ధన్ చెప్పినట్టు తెలిసింది. సుధాకర్ రెడ్డికి చంద్రగిరి, జి డి నెల్లూరు నియోజక వర్గాలలో బలమైన బంధువర్గం ఉంది. పైగా తొలి నుంచి వైకాపా నేతలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు.

