నారాయణుడు హస్తినకు .. హరికృష్ణడు అసెంబ్లీకి...?
గంగాధర నెల్లూరు రిజర్వుడు నియోజక వర్గం రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నట్లు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సిఎం అయిన కె నారాయణ స్వామి టికెట్టు వ్యవహారం ఇప్పటి వరకు తేలలేదు. రెండు జాబితాలోనూ ఆయన పేరు రాలేదు. దీనితో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయనకు తిరుపతి లోక్ సభ టికెట్ ఇస్తారని అంటున్నారు. అక్కడ ఎంపిగా ఉన్న గురుమూర్తికి సత్యవేడు ఎమ్మెల్యే స్థానం కేటాయించనున్నారు. అయితే నారాయణ స్వామి మాత్రం తిరిగి తనకే టికెట్టు వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ప్రభుత్వ సలహా దారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి తీవ్ర స్థాయిలో స్వామికి టికెట్టు రాకుండా అడ్డుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన వర్గానికి చెందిన పలువురు నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కలిశారు. వారివెంట టికెట్టు ఆశిస్తున్న నూకతోటి రాజేష్ కూడా ఉండటం విశేషం. దీనితో స్వామి వర్గం ఆయనపై వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తని, పైగా తెలుగు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తని అంటున్నారు. స్వర్గీయ మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అక్క కుమారుడు కావటం అర్హతగా భవించలేమని అంటున్నారు. ఒక వేళ అతనికి టికెట్టు ఇస్తే పనిగట్టుకుని ఓడిస్తామని సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో కుతూహలమ్మ కుమారుడు డాక్టర్ ఆనగంటి హరికృష్ణ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అతని తండ్రిది జి డి నెల్లూరు కాబట్టి ఆయనను స్థానికునిగా గుర్తిస్తున్నారు. పైగా ఆయన గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. తనకు తెలియకుండా భీమినేని చిట్టిబాబు నాయుడును నియోజక వర్గం సమన్వయ కర్తగా నియమించడంతో మనస్తాపం చెంది పార్టీకి దూరం అయ్యారు.
అయితే అనూహ్యంగా ఆయన పేరు వైసిపి అధిష్టానం పరిశీలనలోకి వచ్చింది. సర్వేలో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిసింది. ఆయన ఇటీవల పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కలశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కుతూహలమ్మ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒక వర్గంగా ఉన్నారు. జ్ఞానేంద్ర రెడ్డి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించరని అంటున్నారు. నారాయణ స్వామికి టికెట్టు రాకపోతే చాలని భావిస్తున్నారు. కాగా హరికృష్ణ అయితే టిడిపిలో థామస్, చిట్టిబాబు వ్యతిరేకులు వైసిపికి మద్దత్తు ఇస్తారని నియోజక వర్గంలో బలంగా వినిపిస్తోంది. అయితే రాజకీయాలలో ఆఖరు నిమిషంలో కూడా మార్పులు జరగవచ్చు. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.