4, జనవరి 2024, గురువారం

జిల్లాలో షర్మిల వెంట నడిచేదెవరు ?

 



వై ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా కంగ్రెస్ లో ఒక్క సారిగా చలనం వచ్చింది. కోమాలో ఉన్న కాంగ్రెస్ కు కదలిక వచ్చినట్లు అయ్యింది. షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టగానే మసకబారిన కొందరు నేతలు తిరిగి కాంగ్రెస్ ద్వారా వెలుగులోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. వైసిపి, టిడిపిలో టికెట్టు రాని కొందరు గోడ దూకడానికి చూస్తున్నారు. ఏ పార్టీలోను ఇమడలేక రాజకీయాలకు దూరంగా ఉన్న వారు తిరిగి క్రియాశీలకం కానున్నారు. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకుల్లో మొదట కదలిక ప్రారంభం అయ్యింది. నియోజకవర్గస్థాయి నాయకులు షర్మిల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు జిల్లా కాంగెస్ పార్టీ అధ్యక్షుడు పోటుగాని భాస్కర్ కు టచ్ లోకి వస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 16న పలమనేరులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించనున్నట్లు పార్థసారధి రెడ్డి ప్రకటించారు.


అంద్రుల అభిస్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రతేక తెలంగాణను ఇవ్వడంతో రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీని ప్రజలు బొంద పెట్టారు. జిల్లాలోని ముఖ్యనాయకులు అందరూ అ పార్టీ నుండి దూరం జరిగారు. కొందరు తెదేపాలో చేరగా, ఎక్కువ మంది వైసిపిలో చేరారు. ప్రస్తుతం వైసిపిలో ఉన్న 90 శాతం నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ నుండి వెళ్ళిన వారే. షర్మిల చేరికతో సమయం కోసం ఎదురు చూస్తున్న కొందరు మాజీలు అస్త్రాలను దుమ్ము దులిపి యుద్దానికి సిద్దం అవుతున్నారు. అధిష్టానం కూడా  కొందరు కీలక నేతలను గుర్తించి బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 


చిత్తూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలలో చక్రం తిప్పిన మాజీ మంత్రి రెడ్డి వారి చంగారెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం ప్రారంభం అయ్యిందని అంటున్నారు. ఆయన కూతురు సత్య స్వరూప ఇందిర గతంలో నగరి నుంచి పోటీ చేశారు. ఈ సారి వైసిపి టికెట్టు ఆశిస్తున్నారు. అయితే అక్కడ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తే మంచిదని భావిస్తున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి కె జయాచంద్రా రెడ్డి (సి కె బాబు)ను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ జిల్లా అధ్యక్షునిగా చేస్తే పార్టీకి ఊపిరి పోసినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వై ఎస్ రాజశేఖర రెడ్డికి నిజమైన అభిమాని. అయితే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆయనకు వైసిపిలో చోటు లేకుండా చేశారు. దీనితో ఆయన బిజెపిలో చేరారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. అయితే వర్గ రాజకీయాల వల్ల క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. ఆయనకు టిడిపిలో టికెట్టు ఇప్పించాలని ఒకవర్గం ప్రయత్నం చేస్తున్నది. మరో వర్గం అడ్డు పడుతున్నది. ఈ నేపథ్యంలో ఆయనకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించి ఎమ్మెల్యేగా పోటీ పెడితే తప్పకుండా గెలుస్తారని భావిస్తున్నారు.


 మాజీ ఎమ్మెల్సీ, మాజీ మదనపల్లి మునిసిపల్ చైర్మన్ నరేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ సుబ్రమణ్యం రెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షులు సుధాకర్, అవిలాల రాజశేఖర్ రెడ్డి  తదితరుల మీద పార్టీ దృష్టి పెట్టింది. తిరుపతిలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి, మాంగాటి గోపాల్ రెడ్డి, దొడ్డారెడ్డి  రామ్ భూపాల్ రెడ్డి ఇతర నేతలు కాంగ్రెస్ ను నడిపిస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా  పోటీ చేసి ఓడిపోయిన వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.



ఈ విషయమై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ... జిల్లాలో కాంగ్రెస్ కు తిరిగి పూర్వ వైభవం వస్తుందన్నారు. షర్మిల పార్టీలో చేరడం శుభచూచకంగా వర్ణించారు. ఇప్పటికే పలువురు ద్వితీయ స్థాయి నాయకులు టచ్ లోకి వచ్చారన్నారు. పార్టీని వీడిన అందరూ తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తారన్నారు. అందరిని కలుపుకొని రానున్న ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తామని చెప్పారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటి చేస్తామని, కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని భాస్కర్ ధీమను వ్యక్తం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *