8, జనవరి 2024, సోమవారం

నగరి టిక్కెట్టుకు కండిషన్స్ అప్లై


నగరి తెలుగుదేశం పార్టీ టికెట్ విషయంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి బానుప్రకాష్ ప్రస్తుతానికి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన టికెట్ రేసులు ముందున్నారు. ఆయన స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొడుకు కావడం ప్లస్ పాయింట్. అయితే గాలి బానుకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అలాగే నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు ఎవరు ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని పోటీదారులు ఆరోపిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత మళ్లీ గాలి భానుప్రకాష్ కు టికెట్ కావాలంటే కొన్ని షరతులను విధించినట్లు తెలుస్తోంది.

దీని ప్రకారం తల్లి సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ ను వెంట తీసుకురావలసిందిగా కోరినట్లు సమాచారం. గాలి జగదీష్ వైసీపీలో టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లితో పాటు టిక్కెట్టు కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసినట్లు సమాచారం. అలాగే  నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు గంధంనేని రమేష్ చంద్రప్రసాద్, ఏ ఎం రాధాకృష్ణ, అశోక్ రాజు, పాకా రాజాలు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరి గత ఎన్నికల్లో కూడా పనిచేయలేదని సమాచారం.  వారితో భానుకు మంచి సంబంధాలు లేవు. గంధంనేని రమేశ్చంద్ర ప్రసాద్ గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. ఏ ఎం రాధాకృష్ణ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. అశోక రాజు గతంలో చంద్రబాబు పి ఏ గా పనిచేశారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ కళాశాలను నడుపుతున్నారు. పాకా రాజా గతంలో నగరి అధ్యక్షుడుగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారు కూడా ప్రతిపాదిస్తున్నట్లు సిఫార్సులు తెమ్మనట్లుగా తెలుస్తోంది. 

నగరి నియోజకవర్గం టిడిపి ఇంచార్జి గాలి భానుప్రకాష్ కు ఇంటిపోరు శాపంగా మారిందని అంటున్నారు. ఆయన తల్లి, మాజీ ఎమ్మెల్సీ సరస్వతమ్మ, తమ్ముడు జగదీష్ కలసి వస్తేనే టికెట్టు విషయం పరిశీలిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో వారు ఇద్దరు భానుకు వ్యతిరేకంగా పనిచేశారు. గంధమనేని రమేష్ ప్రసాద్, ఎ ఎం రాధాకృష్ణ, పాకా రాజా ఇతర సీనియర్ నేతలు పనిచేయలేదు. దీంతో ఆయన వైసిపి అభ్యర్థి ఆర్ కె రోజా చేతిలో 2708 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన తండ్రి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ కూడా రోజా చేతిలో 858 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇప్పటికీ సరస్వతమ్మ, జగదీశ్ భానును వ్యతిరేకిస్తున్నారు. ఒక దశలో జగదీష్ కు టికెట్టు ఇమ్మని కోరారు. ప్రతికూల వాతావరణం కనిపించడంతో వైసిపికి దగ్గర అయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కలసి టికెట్టు ప్రయత్నం చేస్తున్నారు. 

రోజాకు పార్టీలో వ్యతిరేకత ఉన్నందు వల్ల తమకు టికెట్టు వస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో భానుప్రకాష్ కు చంద్రబాబు కండీషన్ పెట్టినట్టు తెలిసింది. దీనితో ఫిబ్రవరి ఏడవ తేదీ జరిగే ముద్దుకృష్ణమ నాయుడు వర్ధంతి సభలో  ముగ్గురు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీకి దూరంగా ఉన్న సీనియర్ నేతలు కలసి రావడం లేదు. భానుకు తప్ప ఎవరికి టికెట్టు ఇచ్చనా గెలుపుకు కృషి చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో భాను బిజీగా ఉన్నట్లు తెలిసింది. కొందరు ముఖం చాటేస్తున్నట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *