పూతలపట్టులో అసమ్మతికి జైకొట్టిన అధిష్టానం
పూతలపట్టు నియోజకవర్గంలో అసమ్మతికి వైసీపీ అధిష్టానం తలొగ్గింది. ప్రస్తుత శాసన సభ్యుడిగా ఉన్న ఎమ్మెస్ బాబును పక్కన పెట్టంది. గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన డాక్టర్ సునీల్ కు మరో మారు టికెట్టును ఖరారు చేసింది. ఐరాల మండలం ఎం. పైపల్లికి చెందిన డాక్టర్ సునీల్ 2014 ఎన్నికలలో పూతలపట్టు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు 2019 ఎన్నికలలో జగన్ టికెట్ ను నిరాకరించారు. ఒక రోజంతా జగన్ నివాసం ముందు కుటుంబ సభ్యులతో పాటు పడిగాపులు పడినా, అప్పట్లో సునీల్ కు జగన్ దర్శన భాగ్యం కలగలేదు. దీంతో చేతిని కోసుకొని సునీల్ ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేశారు. స్థానికంగా ఎమ్మెస్ బాబు మీద ఉన్న వ్యతిరేకత సునీల్ కు కలిసి వచ్చింది. అనూహ్యంగా ఆయన పేరు తెర మీదికి వచ్చింది. ఆయనను కొంత మొత్తం అధిష్టానం డిపాజిట్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. దానిని కూడా సునీల్ నెరవేర్చినట్లు తెలిసింది. పూతలపట్టు నియోజకవర్గానికి డజను మందికి పైగా అభ్యర్థులు టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు. అందులో డాక్టర్ సునీల్ విజేత కావడం గమనార్హం.
పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు మీద నియోజకవర్గానికి చెందిన ఒక వర్గం తిరుగుబాటు భావుటా వేగురవేసింది. విమర్శలను ఎక్కుపెట్టింది. మాజీ ఎంపీపీ సుగుణాకర్ రెడ్డి, ఎంపిటిసి లోకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కృపా సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు దయాసాగర్ రెడ్డి, నాయకులు మునిరత్నం, వెంకటముని శెట్టి, ప్రభాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, చిట్టి రెడ్డి తదితరులు చిత్తూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పూతలపట్టు MLA MS బాబు మీద తిరుగుబాటు భావుటా ఎగురవేశారు. మళ్ళి MS బాబుకు టిక్కెట్టు ఇస్తే అయన విజయానికి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే ఐదు మండలాల్లో వర్గాలు పెట్టి, కాణిపాకం టెండర్లను టిడిపికి అమ్ముకున్నారని విమర్శలు గుప్పించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్ చైర్మన్ శైలజ చరణ్ రెడ్డి కూడా కాణిపాకంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు అనుచరుల గుండ్లపల్లి ఎంపీటీసీ సభ్యుడి తల్లిదండ్రులపై దాడి చేసి కొట్టారని ఆరోపించారు. తనకు ఘన విజయం అందించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి గూండాగిరి చేస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు తమకు వద్దని స్పష్టం చేశారు. అయితే తాము జగన్మోహన్ రెడ్డికి, జిల్లాకు చెందిన వైఎస్ఆర్సిపి ముఖ్య నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విధేయులుగా ఉంటామని, వారి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ జోనల్ చైర్మన్ శైలజ చరణ్ రెడ్డి తెలిపారు.