సీమలో రెడ్లకు పట్టంకట్టనున్న టిడిపి !
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 175 నియోజక వర్గాలలో 50 స్థానాలు రెడ్లు గెలిచారు. ఇందులో ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో 26 స్థానాల్లో విజయం సాధించారు. కర్నూలులో 8, కడపలో 7 చిత్తూరులో 7 అనంతపురంలో 4 స్థానాలలో రెడ్డి సామాజిక వర్గం వారు గెలిచారు. రాయలసీమలో ఉన్న 52 స్థానాల్లో సగం సీట్లు రెడ్లు గెలవడం విశేషం. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి మెజారిటీ సాధించడంలో రెడ్లు ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ సామాజిక వర్గాల వారు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. టిడిపికి కమ్మ సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలిచింది. బీసీల్లో మెజారిటీ ఓటర్లు టిడిపి వైపు నిలిచారు. కాపు, బలిజ ఓట్లు అన్ని వైపుల చీలి పోయాయి. ఇప్పుడు జనసేన పార్టీతో పొత్తు కుదరడం వల్ల కాపు, బలిజ ఓట్లు టిడిపికి కలసి వస్తాయి.
అయితే వచ్చే ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గం సీట్లు పెరిగితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కులాల సమతుల్యత సాధించడానికి రెడ్లకు అధిక స్థానాలు ఇవ్వాలని భావిస్తున్నారు. రెడ్లు ఎక్కువ మంది గెలిస్తే జనసేన పార్టీని కంట్రోల్ లో పెట్టవచ్చని తలపోస్తున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమలో టిడిపి కేవలం మూడు స్థానాలకు పరిమితం అయ్యింది. చంద్రబాబు స్వంత జిల్లా అయిన చిత్తూరులో ఉన్న 14 స్థానాలలో ఆయన ఒకరే గెలిచారు. ఈ జిల్లాలో కూడా రెడ్డి సామాజిక వర్గం వారు 7 మంది గెలిచారు. ఈ సారి చిత్తూరులో బలిజ సామాజిక వర్గానికి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులును కాదని జగన్ విజయానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు. అన్ని కోణాలలో పరిశీలిస్తే రాయల సీమలో కనీసం 25 స్థానాలు అయినా రెడ్లకు ఇస్తే మంచిదని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కనీసం 6 స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది.