నిరాశపరిచిన చంద్రబాబు సంక్రాంతి పర్యటన !
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి సందర్భంగా తన స్వగ్రామం నారావారి పల్లెకు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. మంగళవారం పెద్దలకు బట్టలు పెట్టి సాయంత్రం తిరిగి మంగళగిరి వెళ్లి పోయారు. అయితే గంపడంత ఆశతో టికెట్ల కోసం వెళ్ళిన నేతలు దర్శనం చేసుకుని నిరాశతో వెనుదిరిగారు.
ఈ పర్యటనపై ఒక ఆశావహ నేత మాట్లాడుతూ మా నేత రానూ వచ్చారు.. పోనూ పోయారు.. అంటూ నిరాశగా వ్యాఖ్యానించారు. మూడు నెలల్లో ముంచుకు వస్తున్న సాధారణ ఎన్నికల్లో టికెట్ల కోసం పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి తరువాత చంద్రబాబు మొదటి జాబితా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. కనీసం 30 స్థానాలలో అభ్యర్థులను ప్రకిటిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు నియోజక వర్గాలకు చెందిన ఆశావహులు చంద్రబాబును కలిసేందుకు క్యూ కట్టారు. అయితే ఆయన అందరితోనూ అంటి ముట్టనట్లు వ్యవహరించారని తెలిసింది. ఎవరి పట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించ లేదని అంటున్నారు.
తిరుపతి నియోజక వర్గం నుంచి ఎక్కువ మంది ఆశావహులు బాబును కలిశారు. ఇంచార్జి సుగుణమ్మ, పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి,ఊకా విజయకుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం, మరో ఇద్దరు ముగ్గురు నేతలు కలిశారు. చంద్రగిరి ఇంచార్జి పులివర్తి నాని భార్య సుధా రెడ్డి, ఇందు శేకర్, సోమల సురేష్ రోజంతా అక్కడే ఉన్నారు. నగరి ఇంచార్జి గాలి భాను ప్రకాష్, శ్రీకాళహస్తి ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు, తంబళ్లపల్లె ఇంచార్జి శంకర్ యాదవ్ తొలిరోజే కలిశారు. చిత్తూరు టికెట్టు ఆశిస్తున్న జగన్ మోహన్ నాయుడు, సి ఆర్ రాజన్ కూడా కలిశారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు రెండు రోజులు అక్కడే ఉన్నారు. జి డి నెల్లూరు ఇంచార్జి తన మద్దతు దారులతో సహా రెండవ రోజు కలిశారు. అలాగే జనసేన నేత పొన్న యుగంధర్ కూడా బాబును కలిశారు.
అమరనాద రెడ్డి రెండవ రోజు కలిసినట్టు తెలిసింది. పుంగనూరు ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి, టికెట్టు ఆశిస్తున్న అనీషా రెడ్డి, సోమల సురేష్ కలిశారు. ఇంకా ఇతర నియోజక వర్గాల నుంచి పలువురు కలిశారు. అయితే ఎవరికి ఎలాంటి హామీ లభించ లేదని తెలిసింది. ఇదిలా ఉండగా చంద్రబాబు విడుదల చేసే మొదటి జాబితాలో పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమనేరు నుంచి అమరనాద రెడ్డి పేర్లు మాత్రం ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.