స్నేహం చిగురించేనా ! పగ కొనసాగేనా ?
ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి తాజా కరచాలనంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండేళ్లుగా ఇద్దరు నేతలు రాజకీయంగా కత్తులు దూచుకుంటున్నారు. ఒకప్పుడు మంచి మిత్రులు అయిన వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభం అయ్యింది. పెనుమూరు మండలంలో అధిపత్యపోరుకు భీజం పడినా, నియోజకవర్గం మొత్తం వ్యాపించింది. ఇరువురూ క్యాబినెట్ హోదా కలిగిన వారు. ఇద్దరూ సేతయ్యలే! ఎవరి మాటా వినరు. కావున జిల్లాలో మంత్రులు కానీ, నాయకులు కానీ కలుగచేసుకోలేదు. చివరకు వ్యవహారం తేడేపల్లికు చేరింది. దీంతో ముఖ్యమంత్రి ఇద్దరినీ కలిసిపోమ్మని ఆదేశించారు. ఈ నేపధ్యంలో జగన్ రాక సందర్భంగా విమానాశ్రయంలో ఇద్దరి చేతులు కలిశాయి. అయితే మనసులు కలిసినట్లు లేదని, మాటల్లో ఆప్యాయత, అనురాగం కనిపించలేదని దగ్గర నుండి వీరిని గమనించిన వారు వ్యాఖ్యానించారు. దీంతో మనస్పూర్తిగా కలిసారా? మొక్కుబదిగానా ? అనే చర్చ ప్రారంభం అయ్యింది.
జ్ఞానేంద్ర రెడ్డి తన స్వంత మండలం అయిన పెనుమూరు మండల రాజకీయాల్లో నారాయణ స్వామి జోక్యం ఉండకూడదని ఆశించారు. అయితే ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం సి విజయానంద రెడ్డి సూచన మేరకు పెనుమూరు మండల కన్వీనర్ గా ఉన్న జ్ఞానేంద్ర రెడ్డి బంధువు సురేష్ రెడ్డిని తొలగించి కామసాని విజయకుమార్ నియమించారు. దీనితో వర్గ పోరు మొదలయ్యింది. జ్ఞానేంద్ర రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆయన అన్న కుమారుడు దయాసాగర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సురేష్ రెడ్డి భార్య హేమలత రెడ్డి ఎంపిపి గా ఉన్నారు. పదవులు అన్నీ ఒకే కుటుంభానికి ఎందుకు అంటూ స్వామి వర్గం నిలదీశారు.
దీనితో జ్ఞానేంద్ర రెడ్డి వర్గం, స్వామి వర్గం మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలయ్యింది. నారాయణ స్వామికి టికెట్టు వద్దంటూ జ్ఞానేంద్ర వర్గం పట్టు పట్టారు. తమను కాదని టికెట్టు ఇస్తే ఎన్ని కొట్లయినా ఖర్చు పెట్టిన ఓడిస్తామని సవాళ్లు విసిరారు. దీనితో నారాయణ స్వామికి చిత్తూరు లోక్ సభ టికెట్టు, ఎంపీ రెడ్డెప్పకు జి డి నెల్లూరు అసెంబ్లీ టికెట్టు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని స్వామి పట్టుపట్టడంతో జగన్ సరే అన్నారని తెలిసింది. జ్ఞానేంద్ర రెడ్డితో కలిసి పొమ్మని సలహా ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు తిరుపతి విమానాశ్రయంలో పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు.
అయితే జ్ఞానేంద్ర రెడ్డి స్వభావం తెలిసిన వారు మాత్రం ఇది తాత్కాలికమే అంటున్నారు. ఆయన గతంలో డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మను కూడా ఇలాగే వేధించారని అంటున్నారు. కాగా స్వామి కూడా జ్ఞానేంద్ర రెడ్డికి ఏ మాత్రం తీసిపోరని ఒక నాయకుడు చెప్పారు. గతంలో ఆయన తన రాజకీయ గురువైన మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి పైనే పోటీకి సిద్ధం అయ్యారని గుర్తు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పాత స్నేహం చిగురించిందా లేక కొత్త పగ కొన సాగుతుందా వేచి చూడాల్సిందే.