17, జనవరి 2024, బుధవారం

జ్ఞానేంద్రరెడ్డితో అమీతుమీ తేల్చుకోనున్న నారాయణస్వామి వర్గం


గంగాధర నెల్లూరు వైసీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇరువురు నేతలు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం అయ్యారు. పరస్పరం సర్దుకుపోవాలన్న పార్టీ పెద్దల ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయలేదు. ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి తీరుపై ఉప ముఖ్య మంత్రి కె నారాయణ స్వామి వర్గం నేతలు బుధవారం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయనతో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితిలో కూడా జ్ఞేనేంద్రరెడ్డితో కలిసి పని చేసేది లేదని స్పష్టం చేశారు. ఆయనతో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పుత్తూరులోని మంత్రి నారాయణస్వామి నివాసంలో   ఆరు మండలాల నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సమావేశంలో జ్ఞేనేంద్ర రెడ్డి మీద స్వామి వర్గీయులు విమర్శల వర్షం కురిపించారు. 


తన అభ్యర్థిత్వానికి అడ్డు పడుతున్న జ్ఞానేంద్రతో ఎలా వ్యవహరించాలి అన్న అంశంపై స్వామి అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. పెనుమూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ జ్ఞానేంద్ర అడుగులకు మడుగులు ఒత్త వలసిన పని లేదన్నారు. ఆయన తన స్వార్థం కోసం పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాట విని స్వామిని కాదంటే పార్టీల ఘోరంగా నష్టపోతుందని చెప్పారు. ఆయనకు స్వంత మండలంలోనే పలుకుబడి లేదన్నారు. పెనుమూరు  మండల కన్వీనర్ కె విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబానికి మండలంలో 500 ఓట్లు కూడా లేవని ఎద్దేవా చేశారు. ఆయన మాట వినేవారు ఎవరు లేరని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని పెత్తనం చేశారని చెప్పారు. ఇప్పుడు వైసిపి నీడలో తన బంధువులకు పదవులు ఇప్పించుకున్నారని అన్నారు. 

జ్ఞానేంద్ర తన స్వంత గ్రామం గుంటి పల్లెలో వార్డు సభ్యుడుగా గెలిస్తే తాను సన్యాసం తీసుకుంటానని  అదే గ్రామానికి చెందిన ఎం మురళి రెడ్డి సవాలు విసిరారు. దళిత నాయకుడు బాబు మాట్లాడుతూ జ్ఞానేంద్ర దళిత ద్రోహి అన్నారు. ఆయన మాట విని కొత్త అభ్యర్థికి టికెట్టు ఇస్తే దళితులు మూకుమ్మడిగా తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. జిల్లా నాయకుడు కృష్ణా రెడ్డి, ఎంపీటీసీ యశోదా రెడ్డి స్వామికే తమ మద్దతు తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడు నారాయణ స్వామికే టికెట్టు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.

 సమావేశంలో జి డి నెల్లూరుకు చెందిన సి డి సి ఎం ఎస్ మాజీ అధ్యక్షుడు వేల్కూరు బాబు రెడ్డి మాట్లాడుతూ జ్ఞానేంద్ర రెడ్డి స్వభావమే అంత అన్నారు. మాజీ ఎ ఎం సి చైర్మన్ చిన్నమ రెడ్డి మాట్లాడుతూ ఆయన మాజీ మంత్రి కుతూహలమ్మకు  ఇలాగే ద్రోహం చేశారని తెలిపారు. ముని రాజా రెడ్డి, పూర్ణ చంద్రా రెడ్డి తదితరులు మాట్లాడుతూ జ్ఞానేంద్ర రెడ్డిని పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. సమావేశంలో పెనుమూరు, జి డి నెల్లూరు పాలసముద్రం, ఎస్ ఆర్ పురం, కార్వేటినగరం,  వెదురుకుప్పం మండలాల పార్టీ కన్వీనర్లు, ఐదుగురు జెడ్పీటీసీలు, నలుగురు ఎంపిపిలు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. పెనుమూరు జెడ్పీటీసీ,ఎంపీపీ పాలసముద్రం ఎంపీపీ పాల్గొన లేదు. జ్ఞానేంద్ర రెడ్డి, ఆయన బంధువులకు దమ్ముంటే పదవులకు రాజీనామా చేయాలని కొందరు సవాలు విసిరారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *