పూతలపట్టు టిక్కెట్టు రేసులో డా.లోకవర్ధన్
పూతలపట్టు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త అభ్యర్థులు రంగంలోకి వస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 15 మంది అభ్యర్థులు పూతలపట్టు వైసిపి టిక్కెట్టును ఆశిస్తున్నట్లు సమాచారం. ఇందులో సర్పంచులు, MPTC సభ్యులు, ZPTC సభ్యలు, MPPలు, సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇందులో అభ్యర్థుల వడబోత కొనసాగుతోంది. నియోజకవర్గ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని అభ్యర్థిని ఖరారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్తగా కలికిరి మండలానికి చెందిన ప్రభుత్వ డాక్టర్ పూజారి లోకవర్ధన్ పేరు తెర పైకి వచ్చినట్లు తెలుస్తోంది.
రాజకీయ చైతన్యం కలిగిన పూతలపట్టు నియోజకవర్గంలో గత మూడు ఎన్నికలలో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి ఒకసారి పోటీ చేసిన అభ్యర్థికి మరోసారి అవకాశం రావడం లేదు. ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్న ఎమ్మెస్ బాబు మీద పలు అవినీతి ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఆయనకు రానున్న ఎన్నికలలో టికెట్ ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిచి తెలియజేశారు. దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులను చిన్న చూపు చూస్తుందని, అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. అంతకుముందే పూతలపట్టు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు రానున్న ఎన్నికలలో ఎమ్మెస్ బాబుకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని బహిరంగంగా ప్రకటించారు.
ఎమ్మెస్ బాబు స్థానంలో గతంలో వైసిపి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ సునీల్ పేరు పరిశీలనలోకి వచ్చింది. అయన అన్ని విధాలుగా సిద్దం అయ్యారు. అయితే ఎమ్మెస్ బాబు వర్గం ఆయన మీద విమర్శలు, ఆరోపణలు ఎక్కు పెట్టింది. రానున్న ఎన్నికల్లో సునీల్ కు టికెట్ ఇస్తే తాను పనిచేసేది లేదని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన అధిష్టానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కలికిరికి చెందిన ప్రభుత్వ డాక్టర్ లోకవర్ధన్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది.
పూజారి లోకవర్ధన్ ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవల డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య కలికిరి జడ్పిటిసి సభ్యురాలుగా గెలుపొందారు. లోకవర్దన్ కు మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలతో సన్నీ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి పెద్దిరెడ్డి కూడా లోకవర్ధన్ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, పీలేరు శాసన సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పూజారి విష్ణువర్ధన్ స్థానికుడు కాదు. స్థానికేతరులకు టిక్కెట్టు ఇవ్వాలనుకుంటే పూతలపట్టు నియోజకవర్గం నాయకులు ఎలా స్పందిస్తారో వేసి చూడాలి.