13, జనవరి 2024, శనివారం

తిరుపతి టిడిపి టిక్కెట్టుపై వీడని ఉత్కంఠ !


- పోటీకి పవన్ విముఖత
- రెడ్డి నేత కోసం అన్వేషణ


తిరుపతి టిడిపి టికెట్టు ఎవరికి అన్న ఉత్కంఠ కార్యకర్తల్లో  రోజు రోజుకూ పెడుతోంది. రోజుకు ఒక పేరు తెర మీదకు వస్తోంది. టీడీపీలో ఎం జరుగుతోందో తెలియక నాయకులు, కార్యకర్తలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సంక్రాంతికి నారావారిపల్లెకు రానున్న చంద్రబాబు ఈ విషయమై క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు.
వైసిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేయనున్నారు. కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గా, అభినయ్ డిప్యూటీ మేయర్ గా పజల్లో చొచ్చుకు పోతున్నారు. గెలుపు ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే టిడిపిలో అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు.

 పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ పోటీ చేయడం తమకు వరమని వైసిపి నేతలు భావిస్తున్నారు. 2009లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన  పిఆర్పీ అధినేత చిరంజీవి తరువాత రాజీనామా చేసిన విషయం గుర్తు చేస్తున్నారు. పవన్ గెలిస్తే ఆయన అందుబాటులో ఉండరు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనితో అభినయ్ రెడ్డి కూడా పవన్ అభ్యర్ధి అయితే సంతోషం అంటూ ప్రకటించారు. అయితే ఇక్కడ బలిజ ఓట్లు అధికంగా ఉన్నందున జనసేన అభ్యర్థికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పవన్ కానప్పుడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ లేదా తిరుపతి కన్వీనర్ కిరణ్ రాయల్ కు టికెట్టు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 

అయితే స్థానిక టిడిపి నేతలు సీటు వదులుకోవడానికి సిద్దంగా లేరు. ఆరు గాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో పోగొట్టుకున్న చందంగా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బలిజ సామాజిక వర్గానికి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ, మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ ఊకా విజయకుమార్, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం టికెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. నియోజక వర్గం ఇంచార్జిగా ఉన్న సుగుణమ్మ విషయమై రెండు రోజుల క్రితం కార్యకర్తల ఐ వి ఆర్ ఎస్ సందేశాలు వచ్చాయి. సుగుణమ్మ పని తీరు బాగుంటే ఒకటి నోటా అయితే రెండు నొక్కమని సందేశంలో కోరారు. అయితే దాని ఫలితాలు ఎవరికి తెలియలేదు.

ఇదిలా ఉండగా రెడ్డి మీద రెడ్డిని పోటీ పెడితే మంచిదని ప్రశాంత్ కిషోర్ సూచించినట్టు తెలిసింది. దీనితో నగరంలో ఉన్న రెడ్డి నేతల పేర్లు పరిశీలిస్తున్నారు. ఇందులో రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవ నారయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కుమారుడు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.

కాగా బీసీ కోటాలో  పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ కూడా టికెట్టు ఆశిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా నారా వారిపల్లెకు వస్తున్న చంద్రబాబును ఆశావహులు అందరూ కలిసే అవకాశం ఉంది. ఆయన కూడా ఇప్పటి వరకు తిరుపతి విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. త్వరలో ఈ ఉత్కంఠకు తెరదింపుతారని పరిశీలకులు భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *