22, జనవరి 2024, సోమవారం

పూతలపట్టు వైసీపీ ఇంచార్జి సునీల్ కు తప్పని అసమ్మతి



పూతలపట్టు వైకాపా అభ్యర్థి సునీల్ కు తప్పని అసమ్మతి సెగ  తప్పడం లేదు. పూతలపట్టు 
నియోజకవర్గం లో వైకాపా సమన్వయకర్తగా నియమితులైన డాక్టర్ ఎం సునీల్ కుమార్ కు నియోజకవర్గంలోని మండలాల్లో వర్గ పోరు తప్పడం లేదు. సునీల్ కుమార్ సమన్వయకర్తగా నియమితులైనప్పటి నుంచి పార్టీలోని కొంతమంది నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో ఉంటూ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు టిక్కెట్టు ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా, ఆయనకు నియోజకవర్గంలో మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తూ వచ్చింది. దీంతో పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలు ఎమ్మెస్ బాబుకు అనుకూలంగా లేదంటూ అధిష్టానం టిక్కెట్ ఇవ్వకుండా నిరాకరించింది. 

ఈ నేపథ్యంలో పలువురు నాయకులు, ఆశావహులు పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం నుంచి టిక్కెట్లు ఆశిస్తూ పెద్ద ఎత్తున పైరవీలు సాగించారు. టికెట్ ఆశిస్తున్న ఆశావాహులందరూ తమ తమ గాడ్ ఫాదర్ ల ద్వారా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. ఈ మేరకు పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, అరగొండ పైభాగం చెందిన తేంపల్లి పూర్ణం, ఉత్తర బ్రాహ్మణ పల్లెకు చెందిన మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు రమాదేవి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కోడిగుట్ట వెంకటేష్ తదితరులు టికెట్ కోసం పైరవీలు సాగించారు. తమ తమ వర్గ సమీకరణల ద్వారా తమకు టికెట్టు కేటాయించాలని అధిష్టానాన్ని మొరపెట్టుకున్నారు. 

అయితే ఎట్టకేలకు పూతలపట్టు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు స్థానంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సునీల్ కుమార్ ను అధిష్టానం సమన్వయకర్తగా నియమించింది.  సమన్వయకర్తగా నియమితులైన సునీల్ కుమార్ మొట్టమొదటిసారిగా గత పది రోజుల క్రితం కాణిపాకం ఆలయ దర్శనార్థం రావడం జరిగింది. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరైనప్పటికీ, ఒక వర్గం అసమతితో సునీల్ కుమార్ పర్యటనకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. అలాగే సమన్వయకర్తగా నియమితులైన సునీల్ కుమార్ పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా ఆయా మండలాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఆదివారం కాణిపాకంలో నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అనుకున్న స్థాయిలో నాయకులు, కార్యకర్తలు హాజరు కాకపోవడంతో అసమ్మతి బట్ట బయలైంది. పదుల సంఖ్యలో మాత్రమే సునీల్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

ఇదేవిధంగా తవణంపల్లి, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల్లోని పలువురు సునీల్ కుమార్ కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాలు చెందిన నాయకుల వద్దకు పరుగులు తీస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటూ మద్దతు కూడా కట్టేందుకు సునీల్ కుమార్ ప్రయత్నిస్తుండగా, వారు ముఖం చాటేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ సమన్వయకర్త నియామకంపై అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టు విశ్వసినీయంగా తెలుస్తోంది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పరిస్థితులు ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *