దళిత ఎమ్మెల్యేలు కావడం నేరమా? పాపమా?
దళితులుగా పుట్టడం పాపమా ? మేము చేసుకున్న నేరమా ? మాకు శాపమా? అన్న పూతలపట్టు శాసనసభ్యులు ఎం. ఎస్. బాబు ఆవేదన వెనక ఎన్నో బయటికి చెప్పుకోలేని ఆవేదనలు, అవమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఒక బాబు ఆవేదన మాత్రమే కాదు. జిల్లాలోని దళిత నాయకుల, ప్రజాప్రతినిధుల ఆవేదన. జిల్లాలో దళిత ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. దళితుల అంటే తమ కింద పాలేర్లు అన్న అభిప్రాయం ఇంకా కొందరిలో ఉంది. వారికి సొంత వ్యక్తిత్వం ఉండకూడదనే అభిప్రాయం ఇప్పటికీ అగ్రవర్ణాలలో గూడకట్టుకున్నట్టు తెలుస్తోంది. దళితులు స్వతంత్రంగా నిర్ణయాలు కూడా తీసుకోకూడదని, వారు అభివృద్ధి చెందకూడదని భావిస్తున్నట్లు విధితం అవుతోంది.
చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంట్ స్థానాలను ఎస్సీలకు రిజర్వు చేశారు. తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా గురుమూర్తి, చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా రెడ్డప్ప గెలుపొందారు. పూతలపట్టు నుంచి ఎమ్మెస్ బాబు, సత్యవేడు నుంచి ఆదిమాలం ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గంగాధర నెల్లూరు నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన నారాయణస్వామిని మంత్రి పదవి వివరించింది. మంత్రి పదవితో పాటు ఉపముఖ్యమంత్రి హోదా కూడా లభించింది. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. సమితి అధ్యక్షుడిగా, సత్యవేడు ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నిరంతరం పార్టీ సేవలో తరించారు. పార్టీకి వీర విధేయుడుగా ఉంటూ వస్తున్నారు. జగనన్న ఉపముఖ్యమంత్రి హోదా ఇవ్వడంతో నారాయణస్వామి పొంగిపోయారు. నా చర్మం తీసి చెప్పులు కుట్టే ఇచ్చినా జగన్ ఋణం తీర్చుకోలేదని ఎంతో విధేయతతో నారాయణస్వామి అన్నారంటే, అయన హృదయం ఎంత ద్రవించిందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి నారాయణస్వామికి జిల్లాలో అడుగడుగునా అవమానాలు, పరాభవాలే ఎదురవుతున్నాయి. అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు కూడా అదే పరిస్థితి. ఇందులో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పరిస్థితి కొంత మెరుగు.
జిల్లాలో పేరుకు ఎమ్మెల్యేలు, మంత్రులైన పెత్తనం అంతా ఒక సామాజిక వర్గానిదే. వారి చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. వారు గీసిన గిర దాటడానికి వీలు లేదు. వాళ్ల చేయమన్న పనులు చేయాలి. రమ్మన్న చోటికి వెళ్లాలి. చెయ్యత్తమంటే ఎత్తాలి. పొగడమంటే పొగడాలి, తిట్టమంటే తిట్టాలి. తిడితే పడాలి. అంతకుమించి స్వతంత్రంగా వ్యవహరించే అధికారం ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా కనిపించడం లేదు. జిల్లాలో ఒక మంత్రి మరో మంత్రిని హోదాలో తన కంటే పెద్ద అయినా, బుద్ధి జ్ఞానం ఉందా అంటూ ప్రశ్నించే స్థాయికి వెళ్లిందంటే ఆ వర్గం పెత్తనాన్ని అర్థం చేసుకోవచ్చు. నారాయణ స్వామికి కొంతకాలం సాఫీగా కొనసాగినా, తర్వాత పక్కలో బల్లెంలా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి తయారయ్యారు. ఒక చిన్న వివాదం, గోటితో పోయేదానికి గొడ్డలితో సమాధానం చెప్పినట్లుగా నియోజకవర్గంలో అసంతృప్తిని రాజేశారు. మంత్రి హోదాలో ఎక్కడికి వెళ్ళినా అవమానాలు నిత్యకృత్యమయ్యాయి. నారాయణస్వామి దళిత ద్రోహి అంటూ ముద్ర వేయడంలో సఫలీకృతులయ్యారు. ఈ వివాదం నారాయణస్వామి ఎమ్మెల్యే టికెట్టుకే ఎసరు పెట్టే వరకు వెళ్ళింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రికే టిక్కెట్టు రాకుండా చేయడానికి ఒక వర్గం గట్టి ప్రయత్నాలు చేస్తుంది.
పూతలపట్టు శాసనసభ్యుడు ఎమ్మెస్ బాబుకు కూడా ఇదే పరిస్థితి. నియోజకవర్గంలో ఒక వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అసమ్మతి పేరుతో సమావేశాలనునిర్వహించారు. పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి అవినీతి అంటూ ఎద్దేవ వేశారు. శాసనసభ్యుడు పర్సంటేజీ లేనిదే పనులు మంజూరు చేయడం లేదని, ప్రతి పనికి డబ్బులు ఆశిస్తున్నారని ప్రచారం చేశారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని టామ్ టామ్ వేశారు. మళ్లీ ఎన్నికలలో ఎమ్మెస్ బాబుకు టిక్కెట్టు ఇస్తే, తాము పని చేసేది లేదని అధిష్టానికి హెచ్చరికలు పంపారు. దీంతో అధిష్టానం కూడా మెత్తబడింది. చావు కబురు చల్లగా చెప్పినట్టు పార్టీ అధినేత తాడేపల్లికి పిలిచి పనితీరు బాగా లేదనీ, టిక్కెట్టు ఇవ్వలేనని చెప్పారు. దీంతో నియోజకవర్గంలో అసమ్మతి కుంపట్లు చల్లారాయి.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మీద కూడా ఆరోపణలు చేశారు. ఆయనకు పనితీరు బాగాలేదని, నివేదికలు బాగాలేదని రానున్న ఎన్నికలలో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదంటున్నారు. దాదాపుగా ఆదిమూలంకు కూడా టిక్కెట్లు లేనట్లే తెలుస్తుంది. ఇటవల తిరుపతిలో ఒక మంత్రి కళ్ళకు మొక్కి, టిక్కెట్టు అడగడం కలసివేసింది. ఆయన స్థానంలో తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని పోటీ చేయించాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు దళిత శాసనసభ్యులు ఉండగా ముగ్గురి పరిస్థితి ఒకేలా ఉంది. జిల్లాలో అవినీతి తిమింగలాలు చాలానే ఉన్నాయి. వాటిని గురించి రోజూ సామాజిక మాధ్యమాలలో, పత్రికలలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కోట్ల రూపాయలను దోచుకున్న ఘనులు ఈ జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే వారెఎవరికి నివేదికలు వ్యతిరేకంగా రాలేదు. రావు కూడా. వారి పనితీరుబాగాలేదని ఎవరూ చెప్పరు. అంత ధ్యైర్యం ఎవరికీ లేదు. టికెట్లు మళ్లీ మళ్ళి వారికే ఖరారు అవుతాయి. దళిత శాసనసభ్యులు ఏం చేసినా తప్పే. డేగ కళ్ళతో పర్యవేక్షణ ఉంటుంది. వారి మీద నివేదికల మీద నివేదికలు వెళ్తాయి. వారిని అవినీతిపరులుగా ముద్ర వేస్తారు. మేము దళితులు కావడమే మాకు శాపంగా మారుతోందని పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మాటలు అనడం వెనక ఎంత ఆవేదన ఉందో, ఎన్ని అవమానాలు భరించారో అర్థం చేసుకునే మనసుంటే ఒకసారి ఆలోచించండి.