10, జనవరి 2024, బుధవారం

చిత్తూరు టీడీపీలో తెలంగాణ ఫార్ములా !

ఐవిఆర్ఎస్ సర్వేలు ప్రారంభం
మూడు చోట్ల కొత్త వారు ?
 జి డి నెల్లూరు జనసేనకు ?


టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు పార్ల మెంట్ నియోజక వర్గంపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నట్లు సమాచారం. ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ధీటైన అభ్యర్థులను పెట్టాలని కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణా ఫార్ములా అమలు చేయాలని భావిస్తున్నారు.  కొత్తవారు, విద్యావంతులలైన వారిని బరిలో దింపాలని చూస్తున్నారు. ఏడు నియోజక వర్గాలలో పూతలపట్టు, జి డి నెల్లూరు నియోజక వర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేశారు. మిగిలిన ఐదింటిలో రెండు కమ్మ, రెండు రెడ్డి, ఒకటి బలిజ  లేదా బిసి సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్నారు. ఎస్సీ నియోజక వర్గాలలో కూడా సమర్ధులను ఎంపిక చేయాలని  నిర్ణించుకున్నట్లు తెలిసింది. 

ఈ నేపథ్యంలో ఐవిఆర్ఎస్ సర్వేలు మొదలు పెట్టారు. కుప్పంలో చంద్రబాబు పోటీ చేస్తారు. లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తున్నారు. పలమనేరు టికెట్టు ఎన్ అమరనాద రెడ్డికే అనడంలో అనుమానం లేదు.
చిత్తూరులో బిసి సామాజిక వర్గానికి చెందిన సి ఎస్ రాజన్, గురజాల జగన్ మోహన్ నాయుడు పేర్లతో ఐవిఆర్ఎస్ సర్వే చేశారు. వీరిలో ఎవరి పట్ల ప్రజలు మొగ్గు చూపారు అన్నది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. అయితే వైసిపి అభ్యర్థిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం సి విజయానంద రెడ్డి పోటీ చేస్తున్నందున మాజీ ఎమ్మెల్యే సి కె బాబు అయితే మేలని పలువురు అంటున్నారు. జి డి నెల్లూరు నియోజకవర్గంలో ఇంచార్జి డాక్టర్ థామస్ పని తీరుపై సర్వే నిర్వహించారు. మీ నియోజక వర్గం అభ్యర్థిగా థామస్ కావాలనుకుంటే ఒకటి, వద్దనుకుంటే రెండు నొక్కండి అంటూ వాయిస్ మెసేజ్ లు వచ్చాయి. ఇక్కడ ఆయన పనితీరు బాగా లేదని ఫలితం వస్తే ఆ స్థానం జనసేన అభ్యర్థి డాక్టర్ పొన్న యుగంధర్ కు  కేటాయించే అవకాశం ఉంది. 

చంద్రగిరిలో  ఇంచార్జి పులి వర్తి నానీకి డోకా లేదంటున్నారు. అయితే ఆయన వ్యతిరేకులు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామ నాయుడు మనవడు ఇందు శేకర్ పేరు సూచిస్తున్నారు. నగరిలో గాలి భాను ప్రకాష్ సరిపోరని భావిస్తున్నారు. ఆయన తండ్రి ఒకసారి, ఆయన ఒక సారి ఓడిపోయినందున మూడో సారి ప్రయోగం మంచిది కాదని భావిస్తున్నారు. భానుకు కుటుంబసభ్యులు సహకరించడం లేదు. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు కూడా కలిసి రావడం లేదు. దీంతో ఇక్కడ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి కుమారుడు హర్ష వర్ధన్ రెడ్డిని పోటీ చేయిస్తే మంచిదని భావిస్తున్నారు.  వీరికి జి డి నెల్లూరు, చంద్రగిరిలో బలమైన బంధు వర్గం ఉంది. కాగా సిద్దార్థ విద్యాసంస్థలు అధినేత ఏ. అశోక్ రాజు పేరు కూడా పరిశీలనలో ఉంది. 

పూతలపట్టు ఇంచార్జి డాక్టర్ మురళి తగిన స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం లేదని సమాచారం. ఇక్కడ ఆయన పని తీరుపై  ఐవిఆర్ఎస్ సర్వే చేశారు. అర్ధగంట తరువాత  ఆయనతో పాటు ఆనగల్లు మునిరత్నం, జగపతి పేర్లు ఐవిఆర్ఎస్ లో చోటు చేసుకున్నాయి. ఇప్పటి పరిస్థితులను విశ్లేషిస్తే చిత్తూరు, పూతలపట్టు, నగరిలో కొత్తవారికి అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. జి డి నెల్లూరు నియోజక వర్గాన్ని జనసేన పార్టీకి  కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *