మా దేవుడు మీరే మాస్టరూ....
మీకు సైకిల్ ఉందా, ప్రజలకు సేవ చేయాలని వచ్చారా, అయితే టిక్కెట్టు ఇస్తాను పోయి ప్రచారం చేసుకోండి.. అన్నయ్యా ఖర్చులకు కొంత డబ్బు ఇస్తారా ? అనగానే ఆ కరపత్రాల కట్ట తీసుకుని వెళ్లి పంచి పెట్టండి, నా పేరు చెప్పి ఓట్లు అడగండి ఎమ్మెల్యేగా గెలిచి రండి. ఇది 1983 ఎన్నికల సమయంలో తెలుగు దేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఎమ్మెల్యే అభ్యర్థులతో అన్న మాటలు. చాలా మంది సాధారణ వ్యక్తులు ఎన్టీఆర్ మనసు మెప్పించి ఎమ్మెల్యేలు అయ్యారు. ఒకరు టిక్కెట్టు వచ్చిన తరువాత కొత్త బట్టలు కొనుక్కుని సాధారణంగా ప్రచారం చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అర్టీసీ కండక్టర్ ఉద్యోగం చేసుకుంటున్న ఒక బిసి సామాజిక వర్గం వ్యక్తి అన్న ఆశీస్సులతో శాసన సభలో అడుగు పెట్టారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారు కూడా సైకిల్ గుర్తుతో గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు.
అప్పటి వరకు అగ్రకుల పెత్తం దారులు, భూస్వాములు, పేరున్న న్యాయవాదులు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపిలుగా పోటీ చేసేవారు. ఎన్టీఆర్ టిడిపి స్థాపించి పేదలు, బడుగు బలహీనవర్గాల వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో రాజకీయ వటవృక్షాలు ఎన్నో నేలకూలాయి. గ్రామాలలో తిరుగులేని అధికారం చెలాయించే అనేక మంది చెల్లని కాసులయ్యారు. తెలుగు దేశం పార్టీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఎందరో దళితులు, బిసిలు, ఇతర బలహీన వర్గాల వారు అధికారంలో భాగస్వాములు అవుతున్నారు. దీనికి పునాది వేసిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నది అందరికి తెలుసు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అప్పటి వరకు చక్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. 1977ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జనతా పార్టీ గాలి వీచినప్పటికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న 42 లోక్ సభ స్థానాలలో 41 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. నద్యాల నుంచి జనతా అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికైన నీలం సంజీవ రెడ్డి తరువాత ఆయన ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. 1978 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా జనతా పార్టీకి 60 స్థానాలు వచ్చాయి.
అయితే 1982లో ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలను చిత్తుగా ఓడించింది. ఎన్టీఆర్ ప్రభంజనంలో హేమా హేమీలు అంతా చిత్తు చిత్తు అయ్యారు. దేశ వ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయన స్పూర్తితో మన వారు జాతీయ రాజకీయాలలో రాణిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని ఆయన సమకాలికుల్లో అతనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. వటవృక్షం లాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మాణం చేశారు. సేవ, సమానత్వం, పట్టుదల, క్రమశిక్షణకు మారు పేరైన ఆయన మార్పుకు స్వీకారం చుట్టారు. అస్థిర కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందించారు.
ఓడిపోయిన సమయంలో కూడా ప్రభావవంతమైన ప్రతిపక్ష నాయకునిగా నిలబడ్డారు. తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చారు. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన ఘనత ఆయనదే. రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని మాట నిలబెట్టుకున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా అన్నదే.
దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చిన మహా నేత అయన. ఎందరో కొత్తవారిని, యువకులను, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయన. ఇప్పటి తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు ఇతర ప్రముఖ నేతలు చాలా మందిని ప్రజలకు పరిచయం చేసిన ఆధునిక రాజకీయ మార్గ దర్శకులు ఎన్టీఆర్. నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్ అంటూ రాజనీతి ప్రదర్శించారు. మహిళలకు ఆస్తి హక్కు, స్తానిక సంస్థల్లో వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్ల కల్పన ఆయన సాహసోపేత నిర్ణయాలకు తార్కాణం. పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం ఆయన సామాజిక స్పృహకు గీటురాయి.
దేవుని పట్ల భక్తి, బుద్ధుని పట్ల అపార గౌరవం ఉన్న ఎన్టీఆర్ ప్రజలను దేవుళ్ళుగా సమాజాన్ని దేవాలయంగా
భావించారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా ఒక సామాజిక వర్గం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడం జరిగేది. నందమూరి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల వారు అధికారం అందుకున్నారు. అన్న మొట్ట మొదటి సారిగా అన్ని కులాల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు. అయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి ఆ వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. తెలంగాణాలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న పటేల్, పట్వారి వ్యవస్థలను రద్దు చేశారు. దీనితో తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారారు. అధికార వికేంద్రీకరణ కోసం మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ప్రస్తుత టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆదర్శాలను ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా బలహీన వర్గానికి చెందిన అచ్చెన్నాయుడును అధ్యక్షునిగా నియమించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా బిసి సామాజిక వర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను అధ్యక్షునిగా పెట్టారు. శనివారం రాజమండ్రిలో జరిగిన మహానాడు ప్రతినిధుల సభలో ప్రముఖ దళిత నేత వర్ల రామయ్య చేత జాతీయ కార్యదర్శి నివేదిక చదివించారు. పలువురు దళిత, బిసి, ఇతర సామాజిక వర్గాల నాయకులకు పార్టీలో ప్రాధాన్యత కల్పించారు.సామాజిక సమతుల్యత పాటించడంలో టిడిపికి ఎవరూ సాటి కాదని నిరూపించారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో తరిద్దాం....
NTR అమర్ రహే