2, జనవరి 2024, మంగళవారం

మలుపు తిరుగుతున్న నగరి రాజకీయం


నగరి రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఫైర్ బ్రాండ్ మంత్రి రోజాకు సందేహంగా మారింది. మొదటి జాబితాలో ఆమె పేరు లేకపోవడం కూడా సందేహానికి బలం చేకూర్చుతుంది. జగన్ టికెట్టు వ్యవహారంలో చాలా లోతుగా ఆలోచించి, అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. మారిన రాజకీయాలలో  బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి, టిడిపి ఓట్లు కొల్ల గొట్టాలని చూస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కుప్పం, పలమనేరు స్థానాలను బీసీలకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నగరిలో కూడా రాజు లేదా బిసిలకు  అవకాశం కల్పించాలని  భావిస్తున్నారు. అయితే టిడిపిలో రెడ్డికి ఇస్తే వ్యూహం మారుస్తారు. 



నగరిలో తొలి నుంచి రాజుల ప్రభావం ఉంది గతంలో ముగ్గురు రాజులు ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ రాజుకు టికెట్టు ఇస్తే దాని ప్రభావం సత్యవేడు, జి డి నెల్లూరు నియోజకవర్గాలలో కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి కె ఎస్ శ్రీనివాస రాజు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. నగరి మండలానికి  చెందిన ఆయన టీటీడీ జె ఈ ఓ గా దాదాపు తొమ్మిది సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. ఆయన తండ్రి గోపాలరాజు గతంలో నగరి సమితి అధ్యక్షునిగా ఉన్నారు. గత ఎన్నికలలో ఆయన పేరు టిడిపిలో వినిపించింది. 



కాగా నగరి రాష్ట్ర ఈడిగ కార్పోరేషన్ చైర్ పర్సన్ కె జె శాంతి కూడా టికెట్టు రేసులో ఉన్నారు. ఆమె, ఆమె భర్త కె జె కుమార్ తొలి నుంచీ రోజాను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జగన్ నగరిలో రోజాతో కరచాలనం చేయించే ప్రయత్నం చేసినా శాంతి నిరాకరించారు. ఇప్పుడు ఎలాగైనా టికెట్టు సంపాదించాలని చూస్తున్నారు. 


వీరికి తోడు మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణం నాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్ కూడా ప్రయత్నాలు చేసున్నారు. ఆయన, కుటుంబం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టచ్ లో ఉన్నట్లు సమాచారం. గాలి జగదీష్ అభ్యర్థిత్వం కూడా పరిశినలో ఉన్నట్లు సమాచారం. జగదీష్ ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నారు. తెదేపాలో భాను ప్రకాష్ పెద్దపీట వేస్తున్న కారణంగా జగదీష్ వైసిపి వైపు మొగ్గుచుపుతున్నారు. ఆయనకు టిక్కెట్టు ఇస్తే నియోజకవర్గంలోని తెదేపా ఓట్లలో కూడా చీలిక తేవచ్చని చూస్తున్నారు


కాగా మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి కుమార్తె వాకాటి సత్య స్వరూప ఇందిర (ఇందిర ప్రియదర్శిని) పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఈ విషయమై చెంగా రెడ్డితో ప్రస్తావించారు అని ప్రచారంలో ఉంది.  


అలాగే చెంగా రెడ్డి అన్న కుమారుడు, శ్రీశైలం దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి కూడా టికెట్టు రేసులో ఉన్నారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  రోజాను కాదని, వీళ్ళలో ఎవరికైనా, ఇస్తారా? లేక రోజకే మళ్ళి టిక్కెట్టు దక్కుతుందా? అనే సస్పెన్స్ తొందరలో వీడనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *