బీసీలను ఆదుకుంటున్న వైసీపీ... వాడుకుంటున్న టీడీపీ
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా క్రమంగా రాజ్యాధికారంలో బీసీలకు వాటాను పెంచుతోంది. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రం బిసిలను స్వార్థానికి వాడుకుంటోంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం మాటలకే పరిమితమైంది. చేతలలో బీసీలకు న్యాయం చేయడంలో విఫలమైంది. టిక్కెట్లు ఇస్తే గెలవరు, సర్వేలు మీకు కనుకూలంగా లేవు, డబ్బులు పెట్టలేరు. అంటూ ఏయో సాకులు చెప్పి టిడిపి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. అదే వైసిపి పార్టీ బీసీలను అక్కున చేర్చుకుంటుంది. అధికారిక పదవులను అందజేస్తుంది. బడుగులు రాజకీయంగా ఎదగడానికి దోహదం చేస్తోంది.
బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవమే లక్ష్యంగా పుట్టిన తెలుగుదేశం పార్టీలో చిత్తూరు జిల్లాలో బీసీలకు అడుగడుగునా అవమానాలు, నిరాశే ఎదురవుతున్నాయి. అగ్రవర్ణాలతోపాటు అధికారాన్ని అనుభవించలేక పోతున్నారు. ఏవో కుంటి సాకులు చెబుతూ బీసీలను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలు చాలా ఆవేదనకు గురవుతున్నా, అధిష్టానం వారిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎంతసేపు బీసీలను ఓట్ల బ్యాంకుగా చూడడం తప్ప బీసీలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన లేదు. అలా జిల్లాలో రెండు కులాలు తప్ప, వేరే కులాలను అధికారంలో భాగస్వామ్యం చేసిన సంఘటనలు లేవు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన మొదటిలో పుంగనూరు నుంచి భాగ్గిడి గోపాల్ కు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయనకు పార్టీలో పొగపెట్టారు. చంద్రబాబు అధ్యక్ష భాధ్యతలు చేపట్టిన అనంతరం కుప్పం నియోజకవర్గానికి చెందిన గౌనివారి శ్రీనివాసులును తెలుగుదేశం పార్టీ అందలమెక్కించింది. ఆయన పార్టీ పరంగా జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే టిటిడి బోర్డు సభ్యుడిగా, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఏకకాలంలో పని చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా పనిచేశారు. తర్వాత తిరుపతికి చెందిన నరసింహ యాదవ్ కు తుడా చైర్మన్ పదవిని ఇచ్చారు. తంబళ్ళపల్లి నియోజకవర్గం నుండి శంకర్ యాదవ్ కు MLA గా అవకాశం ఇచ్చారు. శ్రీకాళహస్తికి చెందిన మునిరామయ్య కు MLAగా అవకాశం లభించింది. తెలుగుదేశం పార్టీలో గాండ్ల, యాదవ రెండు కులాలు మాత్రమే అధికారంలో భాగస్వామ్యం అయ్యాయి. మిగిలిన కులాలతో ఓట్లు వేయించుకోవడం తప్ప తెలుగుదేశం పార్టీ ఏనాడు గుర్తించిన పాపాన పోలేదు.
అధికార వైసీపీ పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ కొనసాగుతున్నారు. అలాగే ఆయనను ఎమ్మెల్సీగా అందలమెక్కించారు. అదే సామాజిక వర్గానికి చెందిన సిపాయి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆయన్ని పిలిసి ఎమ్మెల్సీ చేశారు. గత ఎన్నికలలో పలమనేరు నియోజకవర్గం నుంచి వెంకట గౌడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రానున్న ఎన్నికలలో బీసీ అభ్యర్థులుగా కుప్పం నుంచి భరత్, పలమనేరు నుంచి వెంకటే గౌడ పోటీ చేయనున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్ చైర్మన్ గా గోవింద శ్రీనివాసులు పనిచేస్తున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా ఏం రెడ్డమ్మను నియమించారు. రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ గా చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా నగరికి చెందిన శాంతిని నియమించారు.
ఇలా చూస్తే చిత్తూరు జిల్లాలో బీసీలకు వైసీపీ పార్టీని సామాజిక న్యాయం చేసినట్లు విధితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ మాటలకే పరిమితం అవుతోంది తప్ప చేతలలో కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ మళ్ళి బీసిల పాట పాడుతోంది. ఈ నెల నాలుగో తేదీన రాష్ట్రస్థాయి బీసీల సమావేశం ఏర్పాటు చేశారు. బీసీలకు ప్రత్యేక మ్యనిఫేస్టును ఈ సమావేశంలో ప్రకటించనున్నారు. వీటి మీద జిల్లాలోని బీసీలు పెదవి విరుస్తున్నారు. బీసీలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాల్సిందిగా కోరుతున్నారు. జిల్లాలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కుదరని పక్షంలో ఎమ్మెల్సీలుగా, రాష్ట్రస్థాయి చైర్మన్లుగా నియమించాలని కోరుతున్నారు. బీసీలకు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీసిలకు ఎంతవరకు న్యాయం చేస్తుందో వేచి చూడాల్సిందే.