జిల్లాలో ముగ్గురు ఇంచార్జిలు ఔట్ - ఐదుగురు డౌట్ !?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి ఇంచార్జిలలో ముగ్గురు ఔట్, ఐదుగురికి టికెట్టు డౌట్ అన్న చర్చ సాగుతున్నది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన అనంతరం పార్టీ వర్గాలలో రకరకాల విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం ఆయన హెలికాప్టర్ లో వచ్చినపుడు పలువురు స్వాగతం పలికారు. ఆ సందర్భంలో ఆయన ఒక్కొక్కరి పట్ల ఒక్కో విధంగా వ్యవహరించారు. అతి కొద్ది మందిని మాత్రమే బాగున్నావా అంటూ పలకరించారు. కొందరికి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కొందరిని చూసి చూడనట్టు వ్యవహరించారు.
సోమవారం ఇంటివద్ద కూడా ఆయన కొందరి పట్ల సానుకూలంగా స్పందంచారని తెలిసింది. జిల్లాలో ఉన్న 14 నియోజక వర్గాలలో చిత్తూరుకు ఇంచార్జి లేరు. మిగిలిన 13 నియోజక వర్గాలలో ముగ్గురు ఇంచార్జిల పనితీరు అధ్వాన్నంగా ఉందని అంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఐ వి ఆర్ ఎస్ సర్వేలో ఈ ముగ్గురికి కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని అంటున్నారు. దీనితో ఆ ముగ్గురిని ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పిస్తారని తెలిసింది. ఇందులో ఒక ఇంచార్జికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. మిగిలిన ఇద్దరితో అన్యమనస్కంగా మాట్లాడారని అంటున్నారు. ఇక ఐదు నియోజక వర్గాల ఇంచార్జిలకు టికెట్టు రావడం అనుమానమే అంటున్నారు. ఇందులో ఇద్దరు, ముగ్గురికి జనసేన గండం తప్పదని అంటున్నారు.
జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఇతర ఎమ్మెల్యేలను ఒక మాట కూడా విమర్శించని వారి పట్ల కొంత అసహనం ప్రదర్శించారని ఒక నాయకుడు తెలిపారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పదవి పొందిన జీడి నెల్లూరు నియోజకవర్గ ఒక నాయకుడు ఎదురు పడగానే మొన్న కుప్పంలో కలిసావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు ? అన్నారట. ఒక మాజీ ఇంచార్జి అయిన మహిళా నాయకురాలు, ఆమె భర్త కనిపించగానే అభిమానంగా పలకరించి అందరిని కలుపుకొని పని చేయమని సూచించారని సమాచారం. చంద్రబాబు సహా ఐదుగురికి మాత్రమే టికెట్టు ఖాయం అంటున్నారు. చిత్తూరు టికెట్టు కోసం ఆరు మంది క్యూలో ఉన్నారు.
రాష్ట్ర కమిటీలో ఉన్న ఇద్దరు నాయకులకు టికెట్టు వచ్చే అవకాశం ఉందంటున్నారు. వైసిపి అభ్యర్థుల విషయంలో ఇక ఎలాంటి మార్పులు ఉండక పోవచ్చు అంటున్నారు. దీనితో వారిని అన్ని విధాలా సమర్థ తంగా ఎదుర్కొనే వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రెడ్లు, యువకులు, మహిళలు, బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చూస్తున్నారు. తెలంగాణా ఎన్నికల ఫలితాలను బట్టి కొత్త వారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తారు.