బీసీల ఆశలపై నీళ్లు చల్లిన జయహో బీసీ !
విజయవాడలో గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్యర్యంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలను నిరాశ గురిచేసింది. జయహో పేరుతో తెలుగుదేశం పార్టీ బీసీ సదస్సును నిర్వహించింది. ఇందులో ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బిసి శ్రేణులకు దశ నిర్దేశం చేశారు. పార్టీలోని బీసీ నాయకులు కూడా తమ సందేశాలను చక్కగా వినిపించారు. పార్టీ కోసం పనిచేసి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఇందుకు ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఒక్కొక్క ప్రచార రధాన్ని ఇచ్చి పంపారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్రస్థాయి బీసీ సదస్సు అంటే ఎన్నో ఆశలతో రాష్ట్రం నలుమూలల నుండి బీసీ సోదరులు తరలి వెళ్లారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సదస్సులో చంద్రబాబు నాయుడు తమకు వరాల వర్షం కురిపిస్తారని భావించారు. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే, పార్లమెంటు సభ్యుల టిక్కెట్లలో బీసీలను భాగస్వామ్యం చేస్తారని ఊహించారు. అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కొత్త పథకాలను, మేనిఫెస్టోను ప్రకటిస్తారని భావించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, రాష్ట్రస్థాయి డైరెక్టర్లు పోస్టులలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తామని భావించారు. అయితే ఈ సమావేశంలో ఈ అంశాల పైన చంద్రబాబు మాట్లాడలేదు. బీసీలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసే అంశము ప్రస్తావించలేదు. తొలినుంచి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా నిలిచిందని, బీసీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని, యూనివర్సిటీ అని ఊకదంపుడు ఉపన్యాసాలతో ముగించారు. రానున్న కాలంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులలో 50% బీసీలు ఉండాలని అకాంక్షిం చారు. ఇందుకని అనుగుణంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. అంతేగాని రానున్న ఎన్నికల్లో బీసీలకు సీట్లు కేటాయింపు గురించి ప్రస్తావించలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలను అధికారంలో ఎలా భాగస్వామ్యం చేస్తారో కూడా చెప్పలేదు. దీంతో విమర్శకుల చేతికి తెలుగుదేశం పార్టీ అస్త్రం ఇచ్చినట్లు అయింది.
రానున్న ఎన్నికల్లో పలువురు బీసీ నేతలు అసెంబ్లీ పార్లమెంట్ టికెట్లను ఆశిస్తున్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలోని ఐదు మంది నాయకులు, ఐదు నియోజకవర్గాలలో టికెట్ల కోసం అగ్రవర్ణాలతో పోటీ పడుతున్నారు. గత సంవత్సరం తంబళ్లపల్లెను మాత్రమే బీసీలకు కేటాయించారు. ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లను బీసీలు ఆశిస్తున్నారు. జనాభాలో సగమైన తాము రాజ్యాధికారంలో కూడా సగభాగం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే బీసీ సదస్సులో చంద్రబాబు నాయుడు బీసీల అశలు, ఆకాంక్షల మీద సన్నిళ్లు చల్లారు. బీసీలను ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారన్న విషయం మరో మారు రుజువు చేశారు. జయహో బిసి సమావేశానికి హాజరైన బీసీ నాయకులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. సమావేశంలో చంద్రబాబు ప్రసంగం చాలా పేలవంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.