7, జనవరి 2024, ఆదివారం

*రాజకీయ పునరావాస కేంద్రాలుగా బీసి కార్పోరేషన్లు*

*రాజకీయ పునరావాస కేంద్రాలుగా బీసి కార్పోరేషన్లు* 




రాష్ట్రంలో బీసీలకు సంక్రాంతి పేరుతో వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్ లో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఈ కార్పొరేషన్లకు విధులు కానీ, నిధులు కానీ లేవు. ఈ కార్పొరేషన్ల పనితీరును పర్యవేక్షించే  ప్రత్యేక యంత్రాంగం అంటూ ఏదీ లేదు. ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఇంటికే పరిమితమయ్యారు. యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా డైరెక్టర్లు కూడా సొంత పనులకే పరిమితమయ్యారు. కార్పొరేషన్ల ఏర్పాటు ఉద్దేశం నెరవేరకనే కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. ఈ కార్పొరేషన్ల పదవీ కాలాన్ని మరో మారు ప్రభుత్వం పొడిగించింది. ఈ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి ఆయా కులాలలో మిగిలిపోయింది.


గతంలో 139 బీసీ కులాలకు 11 బీసీ సమాఖ్యలు ఉండేవి. వాటి స్థానంలో 2020 డిసెంబర్ 17వ తేదీన కులానికి ఒక కార్పొరేషన్ చొప్పున 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ వైసిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క కార్పొరేషన్ కు ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించింది. చైర్మన్ లకు నెలసరి వేతనం 56,000 కాగా వాహనబత్యం 60,000 రూపాయలు, సహాయకుడి వేతనం 12,000 వేల రూపాయలను చెల్లిస్తున్నారు. ఒక్కొక్క డైరెక్టర్ కు 12,000 చొప్పున నెలనెలా జీతాలను అందజేస్తున్నారు. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఒకసారి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు సంబంధిత కుల నాయకులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు సమావేశమయ్యారు. ఆ కులాలకు సంబంధించిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి వినతులను స్వీకరించారు. అంతటితో ఆ కార్యక్రమానికి పులిస్టాప్ పెట్టారు. వచ్చిన అర్జీలను చెత్తబట్టుకే పరిమితం చేశారు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం తమ కులానికి ఏదో చేస్తుందని ఆశించిన కుల పెద్దలకు నిరాశ మిగిలింది. తదుపరి వారిని కలవడానికి మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించడం లేదు.

సంక్రాంతి పేరుతో 56 కులాలకు కార్పొరేషన్ లో ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ల విధివిధానాల పైన చాలా గొప్పగా చెప్పారు. ఒక్క బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల నియామకంలో రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా ఆ కులం అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నాయకులను గుర్తించి వారికి బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని, వారు ఆ కులాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఆ కులానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా సంబంధిత కార్పొరేషన్ చైర్మన్  దృష్టికి తీసుకుని వస్తే, తక్షణమే ఆ సమస్యలను పరిష్కరించి బీసీల బీసీల అభివుద్దికి చేయూత ఇస్తానని గొప్పగా చెప్పుకొచ్చారు.

తీరా కార్పొరేషన్ల పలకమండళ్ళ కూర్పును పరిశీలిస్తే, చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం సంబంధం లేదు. ఒక్కొక్క జిల్లాకు నాలుగేసి కార్పొరేషన్లను కేటాయించారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫారసు చేసిన వారిని చైర్మన్ చేశారు.  అలాగే జిల్లాకు ఒక డైరెక్టర్ చొప్పున 12 జిల్లాలకు 12 మంది డైరెక్టర్లను నియమించారు. ప్రతి నియోజకవర్గంలో ఒకరిద్దరు డైరెక్టర్లు ఉండే విధంగా చర్యలు తీసుకొన్నారు. కులం కోసం పనిచేసిన, పనిచేస్తున్న, తపిస్తున్న నాయకులకు చాలామందికి కార్పొరేషన్లలో స్థానం కల్పించలేదు. శాసనసభ్యుల అడుగులకు మడుగులొత్తే వారికే కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.

 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన తర్వాత అవి ఎలా పని చేయాలో నిర్దిష్టంగా విధివిధానాలను రూపొందించలేదు. రాష్ట్రస్థాయిలో ఎన్ని నెలలకు ఒకసారి వీటిపైన సమీక్ష చేయాలనే విషయం కూడా లేదు. జిల్లాస్థాయిలో, నియోజకవర్గస్థాయిలో కార్పొరేషన్ల పనితీరుపై సమీక్ష లేదు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ఎవరికి బాధ్యులు కారు. ఎవరికీ నివేదికలు అందచేయల్చిన అవసరం లేదు. వారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలో అన్ని కులాలకు కార్పొరేషన్ లకు  ఒక భవనాన్ని నిర్మించి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఆ కార్పొరేషన్ కార్యాలయాన్ని తెరిసే నాథుడు కూడా లేదు. కొంతమందికి కార్పొరేషన్ కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. చైర్మన్లు తమ ఇంటినే క్యాంపు  కార్యాలయంగా మార్చుకొని విధులు నిర్వహిస్తున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. జిల్లాలో తిరగకుండానే తిరిగినట్లు బిల్లులు చేసుకుంటున్నారు. పలువురు చైర్మన్ లకు ఏ జిల్లా ఎక్కడ ఉందో కూడా తెలియదు.  డైరెక్టర్ల సంగతి కూడా అంతే. జిల్లాలో ఏ మండలంలో తమ కులానికి సంబంధించిన జనాభా ఎంత ఉన్నారు కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటున్నారు. వీరికి విధులను నిర్దేశించకపోవడం, నిధులను విడుదల చేయకపోవడంతో కార్పొరేషన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

రాష్ట్రంలో 56 కులాల కార్పొరేషన్లు అమలులోకి వచ్చిన తర్వాత జిల్లాస్థాయిలో బీసీ కార్పొరేషన్, బీసీ సమాఖ్యలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ఇదివరకు ఇస్తున్న సబ్సిడీ రుణాలు అటకెక్కాయి. సంక్షేమ పథకాలు కనుమరుగయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ కూడా నిధుల కేటాయించకపోవడంతో ఆ శాఖ కార్యాలయ సిబ్బంది కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. వారికి ఏం దరఖాస్తు చేసుకున్నా, అతి గతి ఉండడం లేదు. ఏమడిగిన తమకు నిధులు కేటాయించడం లేదంటూ సమాధానం వస్తుంది. గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా పలు కార్యక్రమాలు నడిచేవి. ఇప్పుడు ఆ కార్యక్రమాలను రద్దు చేశారు. ఏమన్నా ప్రతిపాదనలో ఉంటే గ్రామస్థాయిలో వాలంటీర్లు చూసుకుంటున్నారు. కావున 56 బీసీ కార్పొరేషన్లు, రాష్ట్రంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాలు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *