11, జనవరి 2024, గురువారం

చంద్రగిరి ఎన్నికల బరిలో బడి సుధా యాదవ్ !


చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జి పులి వర్తి నానీకి ఎదురు గాలి ప్రారంభం అయ్యింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి అనుచరుడు బడి సుధా యాదవ్ తాను ఈ సారి చంద్రగిరి నుంచి పోటీకి సిద్దమని ప్రకటించారు. తాను 21 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నానని చెప్పారు. తొలి నుంచీ అరుణ కుమారితో కలసి పని చేస్తున్నానని చెప్పారు. తాను కూడా టిడిపి టిక్కెట్టు కోసం ప్రయత్నం చేస్తానని, రాక పోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బడి సుధా యాదవ్ గతంలో స్టేట్ బిసి కార్పోరేషన్ డైరెక్టర్ గా పనిచేశారు. అలాగే, స్టేట్ యాదవ్ కార్పోరేషన్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం పుదిపట్ల సర్పంచ్ గా ఉన్నారు. దీపావళికి నియోజకవర్గంలోని ఆత్మీయులకు స్వీట్స్, టపాకాయకులు పంపిణి చేశారు.


నియోజక వర్గంలో టిడిపికి ఓటు బ్యాంకు అయిన యాదవ సామాజిక వర్గం ఓటర్లు 15 వేలకు పైగా ఉన్నారని అంటున్నారు. సుధా యాదవ్ కు స్వంత సామాజిక వర్గంతో పాటు, బలహీన వర్గాలలో కొంత పట్టు ఉందని తెలిసింది. ఆయన పోటీ చేస్తే ఓట్లు చీలి పార్టీ నష్టపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడి టిడిపి లో వర్గపోరు నడుస్తున్నది. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నందున తమకు టిక్కెట్టు ఇవ్వాలని ఆ వర్గం నేతలు పట్టు పడుతున్నారు. రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవ నారాయణ రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త డాలర్ దివాకర్ రెడ్డి టికెట్టు ఆశిస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వెంకట్రామ నాయుడు మనవడు కె ఇందు శేఖర్ టికెట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇటీవల నారా లోకేష్ ను కలసి మాట్లాడారు. నియోజక వర్గంలో ఒక బలమైన వర్గం ఆయన వెంట ఉందని సమాచారం. 


ఈ నేపథ్యంలో పులివర్తి నానీకి ఎదురీత తప్పదని భావిస్తున్నారు. చంద్రగిరి నుంచి గల్లా అరుణ కుమారి నాలుగు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆమె 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో 4,518 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో చంద్రబాబు ఆమెను పక్కన బెట్టి పులివర్తి నానీకి టికెట్టు ఇచ్చారు. ఆయన చెవిరెడ్డి చేతిలో 41,755 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు వైసిపి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలో నానీకి స్వంత పార్టీలో ఎదురవుతున్న ప్రతికూలతలు చర్చనీయాంశంగా ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *