14, జనవరి 2024, ఆదివారం

అన్నా! చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది ?


అన్నా! మీరు పార్టీ ఆఫీసులో ఉంటారు కదా, మా చిత్తూరు జిల్లా పరిస్థితి ఎలా ఉంది ?
 అ... ఏముంది. ఈసారి కూడా ఒక సీటే కదా గెలిచేది.
అన్నా!  మారీ అంత ఘోరంగా లేదన్నా, కనీసం మూడు సీట్లు అయినా గెలుస్తాం.. ఈసారి..
ఇది రాష్ట్ర టిడిపి కార్యాలయంలో ఉంటున్న ఒక జాతీయ స్థాయి నాయకునికి, చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రాష్ట్రస్థాయి నాయకునికి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ. దీనిని బట్టి చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. జిల్లాలో గ్రౌండ్ లెవెల్ పరిస్థితి కూడా ఇదే. అయితే ధైర్యం చేసి ఎవరు ఈ నిజాలను చంద్రబాబుకు చెప్పడం లేదు. ప్రతి నియోజకవర్గ నాయకులు ఆహా ఓహో అంటూ.. తామే గెలుస్తామన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడును కొన్ని సర్వే సంస్థలు కూడా దగా చేస్తున్నట్లు సమాచారం. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి కొంత డబ్బు తీసుకొని వారికి అనుకూలంగా సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సొంత నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీని చంద్రబాబు పార్టీ నేతలకు నిర్దేశించారు. అందులో సగం మెజార్టీ కూడా రావడం సందేహంగానే ఉంది. సంస్థల ఎన్నికలలో అధికార వైసిపి విజయకేతనం ఎగరవేయడం ఎందుకు బలం చేకూర్చుతుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పర్యాయం కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని కాలికి బలపం గట్టుకుని మరీ తిరుగుతున్నారు.

ఆ నియోజకవర్గంలో మొన్నటి వరకు పార్టీ పరిస్థితి చాలా బాగున్నట్లు అందరూ భావించారు. అయితే గతంలో టిడిపి నుంచి పోటీ చేసిన ఒక నాయకుడు అధికార పార్టీలో చేరడంతో పార్టీకి కొంత నష్టం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. మరొక నియోజకవర్గంలో ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జి కూడా లేదు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు మూడు వర్గాలుగా విడిపోయారు. ఒకరికి టికెట్ ఇస్తే ఇతర వర్గాలు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ కోసం మొదటినుంచి శ్రమిస్తున్న నాయకులను కాదని ఇతర జిల్లా నుంచి ఒక నాయకుడిని దిగుమతి చేసి, నా నాయకునికి రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన మరో నాయకుడు డబ్బును పార్టీ కార్యక్రమాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ  రాజకీయాలు తమకు వద్దంటున్న ఒక యువ పారిశ్రామిక వేత్త కోసం పార్టీ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు.  ఒక బలమైన నాయకుడు క్రియాశీలకం కాకుండా, ఒక వర్గం అడ్డుకుంటుంది.

ఇటీవల కాలంలో రెండు నియోజకవర్గాలకు ఇంచార్జిలను కొత్తగా దిగుమతి చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ పార్టీ జెండా పట్టని వారిని ఇన్చార్జిలుగా నియమించడంతో, ఒక నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు పూర్తిగా సహకరించడం లేదు. ఇన్చార్జి డబ్బును నీళ్ళులాగా ఖర్చు చేస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. అయితే దళితవాడలకే పరిమితమైన ఆరోపణలు ఉన్నాయి. మరో ఇన్చార్జి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంచార్జి ఇప్పటివరకు పార్టీ కోసం పదివేల రూపాయలను కూడా ఖర్చు పెట్టలేని దుస్థితి. నియోజకవర్గ సమావేశం కానీ, మండల సమావేశం కానీ ఏర్పాటు చేయలేని నిస్సహాయత. ఈ నియోజకవర్గంలో కమ్మసామాజిక వర్గం బలమైన నేతలు పార్టీలో ఉన్నా, వారిని సంప్రదించకుండా నియోజకవర్గ ఇన్చార్జిని నియమించడంతో అలక పాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది. మండల నాయకులు కూడా పూర్తిగా సహకరించడం లేదు.

మరో ఎస్సి నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా ఇరువర్గాలు వేరువేరుగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. వారిని కలపడానికి పార్టీ నాయకులు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడ ఒకరికి టికెట్ ఇస్తే మరో వర్గం పని చేసే పరిస్థితి లేదు. దాని పక్కనే ఉన్న నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా లేని నాయకుడు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయన అప్పుడప్పుడు చట్టం చూపుగా వచ్చి పోతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా ముగ్గురు టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం పనిచేయడానికి సిద్ధంగా లేదు. మరో నియోజకవర్గ ఇంచార్జికి సొంత కుటుంబం నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తల్లి, తమ్ముడు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని వారు గుర్రుమని ఉన్నారు. అందరిని కలుపుకొనిపోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల జిల్లా కేంద్రమైన నియోజకవర్గంలో పార్టీ టికెట్ ను అర డజనుకు పైగా అభ్యర్థులు ఆశిస్తున్నారు. అక్కడ కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతోందని సమాచారం. అయితే బలమైన నేతలు ఉన్న నియోజకవర్గంలోనూ ప్రతిపక్ష నాయకుల విమర్శలను దీటుగా ఎదుర్కొనలేక పోతున్నారు. మొక్కుబడిగా కార్యక్రమాలతో సరిపడుతున్నారు. ఇక్కడ పార్టీ టిక్కెట్టు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అలా ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్లు పనిచేయడానికి సిద్ధంగా లేరు. తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో దిగడానికి సమాయత్తమవుతున్నారు.

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ధమనీయంగా ఉంది. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి 42 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అతను ఇన్చార్జ్ గా కొనసాగడంతో ఆ నియోజకవర్గంలో బలమైన ఓట్లు కలిగిన సామాజిక వర్గం దూరంగా ఉంటుంది. గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కుటుంబం కూడా రాజకీయాలకు స్వస్తి పలికిందని తెలిసింది. నియోజకవర్గంలో అధికార పార్టీని ఎదుర్కొనే దేటైనా అభ్యర్థి లేకపోవడం పార్టీకి మైనస్. అక్కడ అధికారపార్టీ ఇంటింటికి కుక్కర్లు పంచినా, ఎదురించలేని నిస్సహయత. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా పార్టీ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించడంలో పార్టీ వైపల్యం చెందింది. బలమైన నాయకత్వం లేకుండా అక్కడి  పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. బలమైన నేత కోసం అన్వేషణ కూడా సాగడం లేదని తెలుస్తుంది. ఇక్కడ గెలవడం అసాధ్యమనే వాదన బలంగా ఉంది.

మరో నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి ప్రజలతో సక్రమంగా మమేకం కావడం లేదని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో కూడా పర్యటించడం తక్కువని తెలుస్తోంది. ఇక్కడ పార్టీ పరంగా మరో అభ్యర్థి లేకపోవడం కలిసి వచ్చే అంశం. దాని పక్కన ఉన్న మరో నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు టికెట్ అని ఆశిస్తున్నారు. ఆ స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించవచ్చని అభిప్రాయం ఉంది. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల సమన్వయం  కొరవడిందని భావిస్తున్నారు. దాని పక్కనున్న మరో నియోజకవర్గ ఇన్చార్జి ఆ నియోజకవర్గానికి ముఖం చాటేసారు. రాష్ట్రస్థాయి సమావేశాలలో పాల్గొంటున్నా, నియోజకవర్గంలో పర్యటించడం లేదు. పార్టీ కార్యక్రమాలను అసలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలు నాయకత్వం లేమితో సతమతమవుతున్నాయి.

రానున్న ఎన్నికలలో అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత తమ పార్టీని గెలిపిస్తుందని చంద్రబాబు ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేన మద్దతు ఇవ్వడం, తాను జైలుకు వెళ్ళి రావడంతో పార్టీ పటిష్టమైందని భావిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ హేమాహేమీలను ఎన్నికల బరిలోకి దించుతోంది. ఓటుకు 2000 రూపాయల కూడా ఇవ్వడానికి వెనుకాడడం లేదు. అధికార యంత్రంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఇప్పటికే పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల పరిస్థితి రిపీట్ కావచ్చు. ఇప్పటికైనా చంద్రబాబు మేల్కొని నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలకు  అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తే, పార్టీకి మంచిదని అభిప్రాయం సర్వత్రావ్యక్తం అవుతుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *