21, జనవరి 2024, ఆదివారం

చిత్తూరు టిక్కెట్టు టైగర్ కా ? 'పులి'కా ?



జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గంలో సమర్థుడైన అభ్యర్థి కోసం టిడిపి అధినేత చంద్రబాబు అన్వేషిస్తున్నారు. వైసిపి అభ్యర్థిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం సి విజయానంద రెడ్డి పేరు ప్రకటించిన తరువాత అభ్యర్థి ఎంపిక మరింత జటిలంగా మారింది. అన్ని విధాలా సమర్థుడైన, ఆయనకు దీటైన అభ్యర్థి ఎవరు అన్నది ప్రశ్నగా మారింది. తొలినుంచి ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్టు ఇవ్వాలని టిడిపి భావిస్తున్నది. అయితే బలిజ సామాజిక వర్గానికి చెందిన వైసిపి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్థానంలో విజయానంద రెడ్డికి టికెట్టు యిచ్చారు. దీనితో టిడిపి పునరాలోచనలో పడింది. 

మాజీ ఎమ్మెల్యే సి కె బాబు అయితే తప్ప విజయానంద రెడ్డికి పోటీ ఇవ్వలేరని పలువురు భావిస్తున్నారు. సి కె బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. చిత్తూరు టైగర్ అన్న పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల ముందు టిడిపిలో చేరారు. తరువాత మారిన పరిస్థితుల వల్ల ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు ఇంచార్జి పదవి ఇస్తే మంచిదని కొందరు సూచించినా, ఒక వర్గం అడ్డు పడటం వల్ల ఆ ప్రయత్నం ఆగిపోయింది. అయితే తాజాగా ఆయన పేరు పరిశీలనలోకి వచ్చింది. 

ఆయన కాకపోతే పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నానీని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆయన కూడా గతంలో పలు దఫాలు చిత్తూరు టికెట్టు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. పైగా చంద్రగిరి నియోజక వర్గంలో ఆయన పట్ల ఒక వర్గం వ్యతిరేకంగా ఉండటం కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. చంద్రగిరిలో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామా నాయుడు మనవడు  ఇందు శేఖర్ పరిశీలనలో ఉంది. లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరొక వ్యక్తి పేరు పరిశీలనలోకి రావచ్చు. 

కాగా చిత్తూరు టికెట్టు కోసం టిడిపిలో మరి కొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ చిత్తూరు అభ్యర్థి విజయనంద రెడ్డి మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆయన బాగోతం బయట పెట్టాలని ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయం నుండి జిల్లా కేంద్రానికి ఆదేశాలు అందాయి. ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశిస్తున్న అభ్యర్థులు అందరూ విలేకరుల సమావేశంలో పాల్గొనాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఒక ముఖ్యనేత అందరికి ఫోన్ చేసి, విలేకరుల సమావేశానికి రావాలని కోరారు. ఇద్దరు తప్ప మిగిలిన వారు డుమ్మా కొట్టారు. చివరకు మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి వచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కూడా అధిష్టానం సీరియస్ గా  తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థి మీద ప్రెస్ మీట్ పెట్టలేని వాళ్ళు ఆయనకు పోటీ ఎలా ఇస్తారు ? ఆయనను ఎలా ఎదుర్కొంటారని ఒక ముఖ్యనేత ప్రశ్నించారు. కావున కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు తెలిసింది.   


కొత్తగా సి ఆర్ రాజన్ పేరు తెరమీదకు వచ్చింది. అయితే స్థానికుడు కాకపోవడం ఆయనకు మైనస్ గా తెలుస్తోంది. స్థానిక నేతలు కొందరు ఆయనకు మద్దతు తెలిపారు. గురజాల జగన్ మోహన్ నాయుడు గత కొంత కాలంగా పార్టీ కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వారికి ఇస్తే ఇంతవరకు జెండా మోసిన వారి సంగతి ఏమిటన్నది ప్రశ్న. బలిజ సామాజిక వర్గానికి చెందిన కాజూరు బాలాజీ, కటారి హేమలత టికెట్టు ఆశిస్తున్నారు. అయితే విజయానంద  రెడ్డిని, సి కె బాబు లేదా పులివర్తి నాని మాత్రమే తట్టుకో గలరని పార్టీ వర్గాలు అంటున్నాయి. కావున అధిష్టానం CK బాబు, పులివర్తి నాని పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఏ విషయం ఇంకా ఖరారు కాలేదు. చిత్తూరు అభ్యర్థి తేలాలి అంటే కొంత కాలం సస్పెన్స్ తప్పదు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *